సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్య | software engineer murder plotter flaunts crime on facebook | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్య

Published Wed, Dec 11 2013 1:00 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్య - Sakshi

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్య

అనంతగిరి, న్యూస్‌లైన్: నగరంలోని ఎస్సార్ నగర్ ఠాణా పరిధి నుంచి అదృశ్యమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణహత్యకు గురయ్యాడు. మాజీ భార్య సోదరుడే సూత్రధారిగా ఉండి కిరాయి హంతకులతో ఈ ఘాతుకాన్ని చేయించాడు. హత్యకు సంబంధించిన ఫొటోలు ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేయడంతో క్లూ దొరికింది. దీని ఆధారంగా దర్యాప్తు చేసిన పశ్చిమ మండల పోలీసులు మంగళవారం రాత్రి ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ సమీపంలో పడేసిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చిన ఎస్సార్‌నగర్ అధికారులు బుధవారం మృతదేహానికి వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించనున్నారు. 
 
 విడాకుల ఒప్పందం మీరడంతో కక్ష...
 ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలోని బల్కంపేట బీకేగూడ వెంకటేశ్వర దేవాలయం సమీపంలో నివసించే చంద్రశేఖర్‌గౌడ్ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటూ పలు ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తున్నాడు. ఇతడికి గతంలో చెన్నైకు చెందిన సంధ్యతో వివాహమైంది. చంద్రశేఖర్ వేధింపుల నేపథ్యంలో ఇరువురి మధ్యా స్పర్థలు వచ్చాయి. దీంతో సంధ్య తన సోదరుడైన అరుణ్‌కుమార్‌గౌడ్ సాయంతో చెన్నైలోనే చంద్రశేఖర్‌పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఈ పరిణామాలు 2006లో ఇద్దరూ విడాకులు తీసుకునే వరకు వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే జరిగిన ఒప్పందం ప్రకారం చంద్రశేఖర్ వివాహ సమయంలో తీసుకున్న రూ.10 లక్షల నగదు, ఫ్లాట్, 40 తులాల బంగారం తిరిగి ఇవ్వాల్సి ఉంది. అప్పటి నుంచి ఇతడు వీటిని సంధ్యకు అప్పగించకపోవడంతో మరో వివాదం రేగింది. దీనికితోడు చంద్రశేఖర్ మరో వివాహం చేసుకోవడం అరుణ్‌కు కంటగింపుగా మారింది. 
 
 రూ.6 లక్షలకు సుపారీ ఇచ్చి...
 దీంతో చంద్రశేఖర్‌ను మట్టుపెట్టాలని నిర్ణయించుకున్న అరుణ్‌కుమార్ దీనికోసం తన స్నేహితుడు, కిరాయి హంతకులైన యూనుస్, శివ, మధుల్ని రంగంలోకి దింపాడు. తన మాజీ బావను హత్య చేస్తే రూ.6 లక్షలు చెల్లిస్తానని అరుణ్‌కుమార్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అరుణ్ చెన్నైలో ఉంటున్న నేపథ్యంలో కిరాయి హంతకులు చంద్రశేఖర్‌ను చంపకుండానే చంపానని చెప్పే అవకాశం ఉందని అనుమానించి ఓ మెలిక పెట్టాడు. తన మాజీ బావమరిదిని చంపిన తరవాత ఆ ఫొటోలను తనకు పంపాలని షరతు విధించాడు. దీనికి అంగీకరించిన దుండగులు చంద్రశేఖర్‌ను బల్కంపేట నుంచి ఈ నెల మొదటి వారంలో కారులో కిడ్నాప్ చేసుకుపోయారు. 
 
 ‘షేరింగ్’తో విషయం వెలుగులోకి...
 చంద్రశేఖర్‌ను హత్య చేయడానికి ఈ దుండగులు క్లోరోఫామ్ (మిథనాల్)ను వినియోగించారు. కారులోనే మోతాదులు మించి ఈ మత్తుమందు వాసనచూపించడంతో చంద్రశేఖర్ చనిపోయాడు. మృతదేహాన్ని అనంతగిరి నుంచి వికారాబాద్ వెళ్లే ఘాట్ రోడ్డులో ఉన్న హరిత రిసార్ట్స్ సమీపంలోని పొదల్లో పడేశారు. ఆ ఫొటోలను సెల్‌ఫోన్‌లో తీసుకున్న దుండగులు వాటిని చెన్నైలో ఉన్న అరుణ్‌కుమార్‌కు మెయిల్ చేశారు. వాటిని చూసిన అరుణ్ విషయాన్ని తన సోదరికి చెప్పాలనే ఉద్దేశంతో ‘దెట్ బాస్టర్డ్ వజ్ కిల్డ్’ అంటూ ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. ఫేస్‌బుక్ పేజ్ కావడంతో విషయం సంధ్యతో పాటు అదే గ్రూప్‌లో ఉన్న మరికొందరికి చేరింది. వీరి దూరపు బంధువు, కామన్ ఫ్రెండ్ అయిన రవికుమార్ సైతం ఈ గ్రూప్‌లో ఉండటంతో విషయం అతడికి చేరింది.
 
 వెస్ట్‌జోన్ పోలీసుల చొరవతో...
 శవానికి సంబంధించిన ఫొటోలు, దారుణమైన పదజాలం ఉండటంతో కంగుతిన్న రవి తీవ్ర ఆందోళనతో విషయాన్ని రాజేంద్రనగర్ పోలీసులకు చేరవేశాడు. హతుడు ఎవరన్నది తెలియకుండా కేసు నమోదు చేయడం కష్టమని వారు చెప్పడంతో సమాచారాన్ని చంద్రశేఖర్ నివసించే పరిధిలోని ఎస్సార్‌నగర్ పోలీసులకు అందించాడు. దీంతో అప్రమత్తమైన డీసీపీ సత్యనారాయణ దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. తొలుత చంద్రశేఖర్ తల్లి రాములమ్మను సంప్రదించిన పోలీసులు ఆమె ద్వారా కుమారుడి వివరాలు ఆరా తీశారు. ఆమె ద్వారా అదృశ్యమయ్యాడని తెలుసుకుని ఫిర్యాదు స్వీకరించి శుక్రవారం మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
 
 అరుణ్‌కుమార్ విచారణతో బహిర్గతం...
 చంద్రశేఖర్ గతాన్ని పరిశీలించిన పోలీసులు అరుణ్‌కుమార్‌పైనే దృష్టి కేంద్రీకరించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా... కుత్బుల్లాపూర్, వరంగల్‌లకు చెందిన యూనుస్, శివ, మధులకు సుపారీ ఇచ్చానని అంగీకరించాడు. వారు నిజంగానే చంపారా? లేక వేరే ఫొటోలు పంపారా? అనేది తనకు తెలియదని చెప్పడంతో కంగుతిన్న పోలీసులు ముమ్మరంగా గాలించి యూనుస్‌ను పట్టుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో మరో వ్యక్తినీ అదుపులోకి తీసుకుని మంగళవారం రాత్రి వికారాబాద్ సమీపం నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న చంద్రశేఖర్ మృతదేహాన్ని అతడి సోదరుడు గుర్తించాడు. బుధవారం వెస్ట్‌జోన్ పోలీసులు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement