
దొనకొండలో సోలార్ ప్లాంట్ !
వంద మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉంది.
► రుద్రసముద్రం గ్రామ సమీపంలో ఏర్పాటుకు ప్రతిపాదనలు
► వంద మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు భూములు పరిశీలించిన ట్రానా ఎనర్జీ ప్రతినిధులు
దొనకొండ : జిల్లాలో వంద మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉందని, ముంబైకి చెందిన ట్రానా ఎనర్జీ కంపెనీ పార్టనర్ కె.వి రమణశాస్త్రి పేర్కొన్నారు. మండలంలోని రుద్రసముద్రం గ్రామ పొలాలను ఆ కంపెనీ డైరెక్టర్ యోగేష్ చపానీరాతో కలిసి శనివారం పరిశీలించారు. కె.వి రమణశాస్త్రి మాట్లాడుతూ వంద మెగా వాట్స్ సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు భూములు³రిశీలించేందుకు దొనకొండ పర్యటనకు వచ్చామన్నారు.
లా మెగా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో ట్రానా ఎనర్జీ ఒక భాగమన్నారు. సర్వే నంబర్లు 262, 264లో 100 ఎకరాలు, 370 నుంచి 470 వరకు 200 ఎకరాలు వారు పరిశీలించారు. ఇక్కడి పరిస్థితులు అనుకూలిస్తే ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు. ఇది ప్రాథమిక సర్వే మాత్రమే అని.. ఇక్కడి భౌగోళిక పరిస్థితులను పరిశీలించడానికి తమ కంపెనీ తరఫున మరోసారి వస్తామన్నారు. టెక్నికల్, ఆర్థికం, సామాజికం, సస్టెయినబుల్ అనే నాలుగు అంశాలపై తమ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధారపడి పనిచేస్తుందన్నారు.
వంద మెగావాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణం చేపడితే సుమారు 250 నుంచి 1500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. సోలార్ ప్లాంట్ నిర్మాణానికి 600–1000 ఎకరాల భూమి అవరసమవుతుందని, నిర్మాణ ఖర్చు రూ. 600 కోట్లు అని చెప్పారు. అన్నీ కుదిరి ఇక్కడ సోలార్ సిస్టమ్ నిర్మించినట్లయితే భవిష్యత్‌లో టైల్స్, అడెటివ్ కెమికల్ ఉత్పత్తి చేసేందుకు తమ గ్రూప్ ఆఫ్ కంపెనీ పనిచేస్తుందన్నారు.
ఇక్కడి పరిస్థితులను డిప్యూటీ తహసీల్దార్ గోగు వెంకటేశ్వర్లు, మ్యాపుల ద్వారా భూముల వివరాలను సర్వేయర్ వెంకట్రావు వారికి వివరించారు. ఆయన వెంట ఐటీ ప్రమోషనల్ అధికారి వి.వి. భూపాల్, కన్సల్టెంట్ భాను చందర్, ఏపీఐఐసీ ఏఈ కుమార్ ఉన్నారు.