ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఉద్దేశించిన రచ్చబండ కార్యక్రమానికి నిరసనలు, నిలదీతల మధ్య సాగుతోంది.
అచ్చంపేట, న్యూస్‌లైన్: ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఉద్దేశించిన రచ్చబండ కార్యక్రమానికి నిరసనలు, నిలదీతల మధ్య సాగుతోంది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటో ఉండటంపై టీఆర్‌ఎస్ శ్రేణు లు, తెలంగాణవాదులు మండిపడుతున్నారు. గురువారం అచ్చంపేటలో జరిగిన మూడోవిడత రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. సర్పంచ్‌లకు ఆహ్వానం లేకుండా ఎ లా ఏర్పాటు చేశారని తెలంగాణవాదులు, టీ ఆర్‌ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తంచేశా రు.
రచ్చబండ బ్యానర్‌ను తొలగించారు. దీం తో మార్కెట్‌కమిటీ చైర్మన్ శ్రీపతిరావు, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి గువ్వల బాలరాజ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువురు తోసుకోవడంతో కొంత గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ శ్రేణులు ఒకరిపై మరొకరు కుర్చీలను విసురుకున్నారు. మంత్రి డీకే అరుణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గొడవను నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జిచేశారు. ఇరువర్గీయులను సభావేదిక నుంచి దూరంగా నెట్టేశారు. తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కనిపించని సీఎం ఫొటో
రచ్చబండ బ్యానర్‌పై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటో ఉండటంపై జిల్లాలో జరుగుతున్న రగడను దృష్టిలో ఉంచుకుని అచ్చంపేట రచ్చబండ కార్యక్రమంలో అధికారులు, అధికారపార్టీ నాయకులు సీఎం ఫొటో కనిపించకుండా బ్యానర్‌ను మడిచిపెట్టి జాగ్రత్తపడ్డారు. మంత్రి డీకే అరుణ రచ్చబండకు హాజరైనా సీఎం సందేశాన్ని వినిపించలేదు. మంత్రి అరుణ ఎదుటే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణులు బాహాబాహీకి దిగినా ఏమీ అనకుండా మిన్నకుండిపోయారు. ఈ సందర్భంగా మంత్రి అరుణ మాట్లాడుతూ..ఉద్దేశపూర్వకంగా కొందరు రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. ప్రజల కోసం ఏర్పాటుచేసిన వేదికపై రాజకీయాలు మాట్లడటం సరికాదని హితవుపలికారు.
సీఎం ఫొటోపై ఎమ్మెల్యే నిరసన
మహబూబ్‌నగర్ రూరల్: రచ్చబండను గురువారం స్థానిక జెడ్పీ మైదానంలో ఆర్డీఓ, మండల ప్రత్యేకాధికారి హన్మంతరావు అధ్యక్షతన ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సీఎం ఫొటోలను తొలగించిన తరువాతే రచ్చబండను కొనసాగించాలని పట్టుబట్టారు. సమైక్యవాది అయిన సీఎం ఫొటో ముందు తాము రచ్చబండను నిర్వహించాలా?, తెలంగాణ అంతటా, సీఎం ఫొటోను బహిష్కరించినా, ఇక్కడ మాత్రం ఏర్పాటు చేయడం ఏమిటని ఆయన అధికారులను నిలదీశారు. ఫొటోను తొలగించేవరకు కూర్చునేది లేదని పట్టుబట్టారు. ఆయనకు టీఆర్‌ఎస్ నేతలు జత కలిశారు. సీఎం డౌన్‌డౌన్ అంటూ బీజేపీ, టీఆర్‌ఎస్ శ్రేణులు నినాదాలుచేస్తూ ఫ్లెక్సీలను చించేశారు. ఆ వెంటనే ఫ్లెక్సీలను చించేసిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో ఎమ్మెల్యే పోలీసుల తీరుపై మండిపడ్డారు.
పోలీసులు తీసుకెళ్లిన కార్యకర్తను తిరిగి ఇక్కడికి తీసుకొచ్చేంత వరకు సభను కొనసాగించబోమని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ క్రమంలో కార్యకర్తలు టెంట్లలో ఏర్పాటుచేసిన సీఎం ఫొటోలను చించేశారు. వాటిని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇంతలో కొందరు టెంట్లను కూల్చివేసేందుకు ప్రయత్నిస్తుండగా ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి జోక్యం చేసుకుని పోలీసులు తీసుకెళ్లిన వ్యక్తిని ఇక్కడికి తీసుకురావాలని ఆదేశించారు. సీఎం ఫొటోలను తొలగించామని, సభ నిర్వహణకు సహకరించాలని కోరడంతో తిరిగి 12గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి వచ్చింది.
పోలీసు పహారాలో..
అయిజ మండలకేంద్రంలో రచ్చబండ కార్యక్రమం పూర్తి పోలీసు పహారాలో జరిగింది. ప్రజల కంటే పోలీసులే ఎక్కువగా కనిపించారు. 0మండల ప్రత్యేకాధికారి మదనమోహన్‌శెట్టి ఆధ్వర్యంలో జరిగిన రచ్చబండలో ఎమ్మెల్యే అబ్రహాం పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతుండగా టీఆర్‌ఎస్ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు రంగు సుమలత, జిల్లా కార్యదర్శి బూషణం, రంగుసూరి వేదికపైకి ఎక్కారు. అధికారి మాట్లాడుతుండగా మైక్‌న లాక్కొని జై తెలంగాణ నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే టీఆర్‌ఎస్ నాయకులను అరెస్ట్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.