సమస్యకు సామరస్య పరిష్కారం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన ఫిర్యాదులు రోజురోజుకు పెరుగుతున్న నే పథ్యంలో వాటి పరిష్కారానికి గుంటూరు నగరంలో ఉచిత న్యాయాధికార సంస్థ ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ సెంటరు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపనున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు కానున్నదనే ప్రచారం జరుగుతుండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనూహ్యంగా ఊపందుకుంది. ఇతర జిల్లాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదారులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆస్తుల క్రయవిక్రయాలు నిత్యం జరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు చదరపు గజం రూ.రెండు వేలు పలకని స్థలాల ధరలు రూ. పదివేలకు పెరిగాయి. దీంతో ఈ రంగానికి అన్ని వర్గాలు చేరువయ్యాయి.
ప్రతీ గ్రామంలో కనీసం పది మంది వ్యక్తులు రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా అవతారమెత్తి ఆస్తుల క్రయ విక్రయాలను జరుపుతున్నారు. వీరికితోడు రాజకీయ నేతల ముఖ్య అనుచరులు, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు ఈ వ్యాపారంలోకి ప్రవేశించడంతో అక్రమాలూ పెరిగాయి. ఒకే స్థలాన్ని ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు విక్రయించడం, విలువైన స్థలాలను కబ్జా చేయడం సర్వసాధారణమైంది. రిటైర్డ్ ఉన్నతాధికారుల స్థలాలను కూడా కబ్జా చేసే స్థాయికి ఈ అక్రమార్కులు పెరిగారు.
90 శాతం ఫిర్యాదులు
భూములకు
సంబంధించినవే..
ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుల్లో 90 శాతం స్థలాల కబ్జాలు, దొంగ రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్ ప్రకారం నగదు చెల్లింపులు జరగడం లేదనేవే ఎక్కువగా ఉంటున్నాయి. ఆ ఫిర్యాదులను స్వీకరించి బాధితుల నుంచి వివరాలు సేకరించడానికే పోలీసులకు సమయం సరిపోవడం లేదు.
వీటిపై పూర్తి స్థాయి విచారణ జరిపి కేసులు పరిష్కరించేందుకు అవసరమైన సిబ్బంది, సమయం కూడా పోలీస్‌శాఖకు లేదు. వీటిలో జోక్యం చేసుకుంటే సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యం పెరుగుతుందనే ఆరోపణలు వచ్చే అవకాశాలు ఉండటంతో పోలీస్ ఉన్నతాధికారులు ప్రి లిటిగేషన్ సెంటరు ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చారు.
అర్బన్ ఎస్పీ జెట్టి గోపీనాథ్ ఈ రంగంలో జరుగుతున్న అక్రమాలపై ఇప్పటికే ఒక అవగాహనకు రావడంతోపాటు స్పెషల్ బ్రాంచ్ ద్వారా పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ రంగానికి సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి చట్టపరంగా అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఉచిత న్యాయాధికార సంస్థ ఏర్పాటు ఆవశ్యకతను జిల్లా యంత్రాంగానికి వివరించనున్నారు.