‘ఆయనకు మంత్రి పదవి రాకపోవడంపై నో కామెంట్’
విజయవాడ: విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి రాని అంశంపై తాను స్పందించదలచుకోలేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఆయన బుధవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీలో 175 నియోజకవర్గల్లో పార్టీని, గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తామని తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధులతో పెట్టే పథకాలకు ప్రధాని మోదీ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు. ఏపీలో ఉత్తరాంధ్రకు మురళీధర్ రావు, మధ్యఆంధ్రకు మంత్రి ఆర్కే సింగ్, రాయలసీమకి వినోద్ థావడేలు పార్టీ బలోప బాధ్యులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.
అక్టోబర్‌లో అమిత్ షా విజయవాడ పర్యటన ఉంటుందన్నారు. పర్యటన సమయంలో ఇతర పార్టీల నుంచి బీజేపీలో పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయన్నారు. మోదీ పుట్టిన రోజైన సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా దివాస్ జరపనున్నామని తెలిపారు. కాకినాడలో బీజేపీపై టీడీపీ రెబెల్స్, నంద్యాలో జెండాలు లేకుండా ప్రచారం చేయించడంపై పార్టీలో చర్చించామని తెలిపారు. కంచె ఐలయ్య వ్యాక్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని, కంచె ఐలయ్యపై కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.