సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజును నియమించారు. ఈ మేరకు సోమవారం రోజున బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకంపై సోమువీర్రాజు ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. 'నన్ను ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్‌గా నియమించినందుకు జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్రహోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కి మన కేంద్ర నాయకత్వంలోని ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు' తెలిపారు.
కాగా మరో ట్వీట్‌లో.. 'నాపై పెట్టిన ఈ బాధ్యతను నేను మనసా, వాచా, కర్మణ నిబద్దతతో నిర్వహిస్తాను. పార్టీని జిల్లా, మండల, గ్రామ బూత్‌స్థాయి వరకు సంస్థాగతంగా బలోపేతం చేస్తాను. అందరినీ కలుపుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి వంద శాతం కృషిచేస్తాను. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు' అంటూ పేర్కొన్నారు.
గత ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరతానని ‘సాక్షి’ టీవీతో సోము వీర్రాజు చెప్పారు. చంద్రబాబు ప్రవర్తన కారణంగానే గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాభివృద్ధిలో బీజేపీ పాత్ర ఉంటుందని, పోలవరానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంతో సాయపడతామన్నారు. ఏపీలో బీజేపీని సకల జనుల పార్టీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment