
సాక్షి, పశ్చిమ గోదావరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని రాబోయే రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూస్తామని వైఎస్సార్‌సీపీ నేత రఘురామ కృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కాళ్ళ మండలం పెద అమిరంలో రఘురామ కృష్ణంరాజు ఆధ్వర్యంలో నరసాపురం పార్లమంటరీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముదునూరి ప్రసాదరాజు, కారిమూరి నాగేశ్వరరావు, గుణ్ణం నాగబాబు, గుబ్బల తమ్మయ్య, పాతపాటి సర్రాజు, గూడూరి ఉమాబాల, దాట్ల రంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు.
తెలుగు యువత సభ్యులు కళ్లేపల్లి సతీష్ రాజు, వాండ్రం సర్పంచ్ గడి గోవిందం, ఎంపీటీసీ నర్సే భారతి, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. అనేక మంది తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులు ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకోనున్నారని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తన సొంత గూటికి వచ్చి మహిళల మధ్య ఆత్మీయ సదస్సు నిర్వహించడం శుభ సూచికమన్నారు. నరసాపురం పార్లమెంట్‌లోని ఏడు నియోజక వర్గాల్లో వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగించడం ఖాయమన్నారు.