అశోక 'చక్రం' | SP ashok kumar persecuting police department | Sakshi
Sakshi News home page

అశోక 'చక్రం'

Published Fri, Oct 27 2017 8:34 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

SP ashok kumar persecuting police department - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ పోలీసు శాఖ ప్రక్షాళనకు నడుం బిగించారు. మూడు నెలల పనితీరును నిశితంగా పరిశీలించిన ఆయన భారీగా 45 మంది ఎస్‌ఐలను బదిలీ చేశారు. త్వరలో మరో విడత బదిలీలు చేయనున్నట్లు సమాచారం. మొత్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు తనదైన బృందాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో సుదీర్ఘ కాలం పాతుకుపోయి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి స్థానచలనం కల్పించారు. పనితీరు బాగున్న వారిని స్టేషన్లలో కొనసాగించి, ఆరోపణలు వచ్చిన వారిని వీఆర్‌తో పాటు అప్రాధాన్య శాఖలకు బదలాయించారు.

ఎస్పీగా జూలై 3న అశోక్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి శాఖాపరంగా ఎలాంటి బదిలీలను చేపట్టలేదు. గతంలో కొందరు డీఎస్పీలు ఎస్పీకి తప్పుడు సమాచారం ఇస్తూ.. కొంతమంది అధికారులను వెనుకేసుకొచ్చి పోలీసుశాఖ ప్రతిష్టను దెబ్బతీసినట్లు చర్చ జరిగింది. ఈ క్రమంలో స్వయంగా పోలీసుల పనితీరును పరిశీలించిన తర్వాతే బదిలీలు చేయాలని ఎస్పీ భావించినట్లు తెలిసింది. అందులో భాగంగానే మూడు నెలల తర్వాత బదిలీలకు ఉపక్రమించారు. మరో 15రోజుల్లో రెండో విడత బదిలీలు కూడా ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత సీఐల బదిలీలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

ఆరోపణలు ఉన్న వారికి స్థానచలనం
అనంతపురంలో పనిచేసే పలువురు ఎస్‌ఐలతో పాటు పట్టణ, రూరల్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐలు సుదీర్ఘకాలంగా ఒకేస్టేషన్‌లో కొనసాగుతున్నారు. వీరిలో కొందరు మట్కా, క్రికెట్‌ బెట్టింగ్, పేకాటకు పూర్తిగా సహకరిస్తూ వచ్చారు. ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తాడిపత్రిలో రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి పేకాట మాఫియాలో చిక్కుకుని అప్పులపాలై భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి తనూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఉదంతం తర్వాత పేకాట, మట్కాపై ఎస్పీ సీరియస్‌గా స్పందించారు. కొత్తలో చర్యలు తీసుకుంటున్నట్లు నటించినా.. కొందరు ఎస్‌ఐలు ఆ తర్వాత యథావిధిగా ‘ఆట’ నడిపించారు. ఇదే క్రమంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు సాగడం లేదని కొందరు డీఎస్పీలు తప్పుడు నివేదికలు ఇచ్చారు. తాజా బదిలీలతో వీరి ఆటకట్టించినట్లయింది.

గ్రామస్థాయి నుంచి సమస్యాత్మక వ్యక్తుల చిట్టా
వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి పోలీస్‌స్టేషన్‌ వారీగా ఏ గ్రామంలో ఏ పార్టీలో ఏ నాయకులు ఉన్నారు? వారి స్థితిగతులు ఏంటి? గతంలో అతనిపై ఉన్న కేసులు, సమస్యాత్మక వ్యక్తులు జాబితాను సేకరించనున్నారు. వీరిపై ప్రత్యేక దృష్టి సారించి కౌన్సెలింగ్‌ ఇవ్వనున్నారు. గ్రామాల్లో ఏ రకమైన గొడవలు జరిగినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా రౌడీషీట్‌ తెరిచేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే గన్‌లైసెన్స్‌లు ఉన్న వారి వివరాలను సేకరించి అవసరం లేని వారిని తొలగించేలా కలెక్టర్‌కు నివేదిక అందజేయనున్నారు.

ప్రాపర్టీ రికవరీపై ప్రత్యేక దృష్టి
దొంగతనాలు, చోరీకి గురైన సొమ్మును తిరిగి బాధితులకు అందజేయడంపై అశోక్‌ ప్రత్యేక దృష్టి సారించారు. గత మూడు నెలల్లో రూ.1.28కోట్ల సొమ్మును(బంగారంతో పాటు) దొంగల నుంచి రికవరీ చేశారు. అలాగే దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 15ఏళ్లుగా దొంగతనాల కేసులోని నిందితుల జాబితాను సిద్ధం చేసి వారి ఫొటోలతో పాటు పూర్తి వివరాలను ఆన్‌లైన్‌ చేయిస్తున్నారు. పాత నేరస్తులపై పోలీసు నిఘా ఉంచి, దొంగతనాలకు పాల్పడకుండా చేయడమే లక్ష్యంగా సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తున్నారు. అయితే పట్టణ, మండల కేంద్రాల్లో ఇప్పటికీ అధికార పార్టీ కనుసన్నల్లో పని చేస్తున్న సిబ్బంది విషయంలో ఎస్పీ దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

సమష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు సాధ్యం
ప్రతి అధికారి అందరినీ కలుపుకుని వెళ్లినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధ్యం. నేను బాధ్యతలు తీసుకున్నప్పుడు దొంగతనాల కేసులు ఎక్కువగా పేరుకుపోయాయి. కేవలం కేసులు తీసుకుంటే సరిపోదు.. బాధితులకు సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలి. బాధితులకు న్యాయం జరిగినప్పుడే పోలీసు వ్యవస్థ బాగా పని చేస్తున్నట్టు. ఆ దిశగా సిబ్బందికి అన్ని విషయాల్లో శిక్షణనిస్తున్నాం. ఫ్యాక్షన్, రౌడీయిజం, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణను ప్రాధాన్యత అంశాలుగా తీసుకుంటున్నాం. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాం. మట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్‌ బెట్టింగ్‌ నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. సిబ్బంది పనితీరుపైనా నిఘా ఉంచాం. – జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement