sp ashok kumar
-
పకడ్బందీగా లెక్కింపు
ఓట్లలెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలని, ఏ చిన్న తప్పు జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి వీరపాండియన్ సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం ఆయన ఆర్ఓలు, ఏఆర్ఓలకు డెమో కౌంటింగ్ వివరించారు. అనంతరం ఎస్పీతో కలిసి కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను చిత్రీకరించడంతో పాటు కౌంటింగ్ కేంద్రంలో హాట్‌లైన్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి రవాణా సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు. సాక్షి, అనంతపురం అర్బన్: ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఆర్ఓలు, ఏఆర్ఓలది కీలకపాత్ర అని, కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.వీరపాండియన్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ఎలా చేయాలనే అంశంపై మంగళవారం జేఎన్టీయూలోని కౌంటింగ్ కేంద్రంలో ఆర్ఓలు, ఏఆర్‌ఓల ద్వారా డెమో కౌంటింగ్ చేయించారు. ఈసందర్భంగా కలెక్టర్ కౌంటింగ్ విధానం గురించి వివరించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ టేబుల్‌కు ఈవీఎం పెట్టెలను సహాయకులు తీసుకొచ్చి ఉంచుతారన్నారు. కంట్రోల్ యూనిట్‌ను బ్యాలెట్ యూనిట్‌కు కనెక్ట్ చేసి అందులో అభ్యర్థుల వారీగా పోలైన ఓట్ల వివరాలను 17సి పార్ట్–2లో రౌండ్ల వారీగా నమోదు చేయాలని సూచించారు. పోలైన ఓట్లను హాల్లోని ఏజెంట్లు, సూక్ష్మ పరిశీలకులు, కౌంటింగ్ అసిస్టెంట్లకు చూపించాల్సిన బాధ్యత కౌంటింగ్ సూపర్వైజర్లదేనన్నారు. రౌండ్లు మేరకు సిద్ధం చేసుకుని ఉంచిన ఫోల్డర్లో రౌండ్ కౌంటింగ్ షీట్‌ను ఉంచి కంపానియన్ టేబుల్‌కు పంపించి, సిస్టంలో నమోదు చేయించాలన్నారు. తరువాత సువిధ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. నేడు రెండో రాండమైజేషన్ ఎన్నికల పరిశీలకుల ఆధ్వర్యంలో ఆర్ఓల సమక్షంలో బుధవారం రెండో విడత రాండమైజేషన్ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. 23వ తేదీ ఉదయం 5 గంటల్లోగా మూడో రాండమైజేషన్ జరుగుతుందన్నారు. అప్పుడు కౌంటింగ్ కేంద్రాలు, టేబుళ్లను కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో జేసీ ఎస్.డిల్లీరావు, జేసీ–2 హెచ్.సుబ్బరాజు, ట్రైనీ కలెక్టర్ ఎం.జాహ్నవి, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, నోడల్ అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు. ఎన్నికల కౌంటింగ్‌కు భద్రత కట్టుదిట్టం సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ఆఖరు ఘట్టమైన కౌంటింగ్ రోజున కట్టుదిట్టమైన భద్రత చేపట్టామని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ మంగళశారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫ్యాక్షన్, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా వేశామని, జిల్లా బలగాలే కాకుండా ఎపీఎస్పీ, సీఆర్పీఫ్ బలగాలను సైతం భారీగా వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ రోజున రిటర్నింగ్ అధికారుల అనుమతి లేనిదే ఎవరినీ కౌంటింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లోకి అనుమతించమని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నాయకులు, కార్యకర్తలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
త్వరలో మహిళా రక్షక్ బృందాలు
అనంతపురం సెంట్రల్: మహిళలపై జరుగుతున్న నేరాలను ని యంత్రించాలని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ పిలుపునిచ్చారు. మహిళల రక్షణ, భద్రత కోసం త్వరలో మహిళా రక్షక్ బృందాలను రంగంలోకి దింపుతున్నట్లు ప్రకటించారు. ఆదివారం పోలీసు కాన్ఫరెన్స్హాల్లో మహిళా రక్షక్ బృందాల అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిరోజూ జరిగే నేరాల్లో 20 శాతం మహిళలకు సంబంధించవిగా నమోదవుతున్నాయని తెలిపారు. వీటికి తోడు ఈవ్‌టీజింగ్, వేధింపులు ఇతర కారణాలపై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వేధింపులకు పాల్పడుతున్న వారి ఆగడాలను అరికట్టేందుకు మహిళా రక్షక్ బృందాలు పనిచేస్తాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 మహిళా రక్షక్ బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయన్నారు. అనంతపురం, ధర్మవరం, కళ్యాణదుర్గం, తాడిపత్రి సబ్ డివిజన్లలో రెండు చొప్పున, గుంతకల్లు, కదిరి, పెనుకొండ, పుట్టపర్తి సబ్‌డివిజన్‌లో ఒక్కో బృందం పనిచేస్తుందన్నారు. పార్కులు, కళాశాలలు, పాఠశాలలు, దేవాలయాలు, బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో మహిళా రక్షక్ బృందాలు నిఘా ఉంచుతాయన్నారు. ఈవ్టీచర్లు, అమ్మాయిలను వేధించే ఆకతాయిలను గుర్తించి వారిని కౌన్సిలింగ్ కేంద్రాలకు తీసుకెళ్తారని తెలిపారు. అనుభవజ్ఞులైన వారితో కౌన్సిలింగ్ ఇప్పించడంతో పాటు వారి తల్లిదండ్రులను కూడా పిలిపించడం జరుగుతుందన్నారు. రెండోసారి పునరావృతం అయితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అశోక 'చక్రం'
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ పోలీసు శాఖ ప్రక్షాళనకు నడుం బిగించారు. మూడు నెలల పనితీరును నిశితంగా పరిశీలించిన ఆయన భారీగా 45 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. త్వరలో మరో విడత బదిలీలు చేయనున్నట్లు సమాచారం. మొత్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు తనదైన బృందాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో సుదీర్ఘ కాలం పాతుకుపోయి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి స్థానచలనం కల్పించారు. పనితీరు బాగున్న వారిని స్టేషన్లలో కొనసాగించి, ఆరోపణలు వచ్చిన వారిని వీఆర్‌తో పాటు అప్రాధాన్య శాఖలకు బదలాయించారు. ఎస్పీగా జూలై 3న అశోక్‌కుమార్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి శాఖాపరంగా ఎలాంటి బదిలీలను చేపట్టలేదు. గతంలో కొందరు డీఎస్పీలు ఎస్పీకి తప్పుడు సమాచారం ఇస్తూ.. కొంతమంది అధికారులను వెనుకేసుకొచ్చి పోలీసుశాఖ ప్రతిష్టను దెబ్బతీసినట్లు చర్చ జరిగింది. ఈ క్రమంలో స్వయంగా పోలీసుల పనితీరును పరిశీలించిన తర్వాతే బదిలీలు చేయాలని ఎస్పీ భావించినట్లు తెలిసింది. అందులో భాగంగానే మూడు నెలల తర్వాత బదిలీలకు ఉపక్రమించారు. మరో 15రోజుల్లో రెండో విడత బదిలీలు కూడా ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత సీఐల బదిలీలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆరోపణలు ఉన్న వారికి స్థానచలనం అనంతపురంలో పనిచేసే పలువురు ఎస్ఐలతో పాటు పట్టణ, రూరల్‌లో పనిచేస్తున్న ఎస్ఐలు సుదీర్ఘకాలంగా ఒకేస్టేషన్‌లో కొనసాగుతున్నారు. వీరిలో కొందరు మట్కా, క్రికెట్ బెట్టింగ్, పేకాటకు పూర్తిగా సహకరిస్తూ వచ్చారు. ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తాడిపత్రిలో రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి పేకాట మాఫియాలో చిక్కుకుని అప్పులపాలై భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి తనూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఉదంతం తర్వాత పేకాట, మట్కాపై ఎస్పీ సీరియస్‌గా స్పందించారు. కొత్తలో చర్యలు తీసుకుంటున్నట్లు నటించినా.. కొందరు ఎస్ఐలు ఆ తర్వాత యథావిధిగా ‘ఆట’ నడిపించారు. ఇదే క్రమంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు సాగడం లేదని కొందరు డీఎస్పీలు తప్పుడు నివేదికలు ఇచ్చారు. తాజా బదిలీలతో వీరి ఆటకట్టించినట్లయింది. గ్రామస్థాయి నుంచి సమస్యాత్మక వ్యక్తుల చిట్టా వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి పోలీస్‌స్టేషన్ వారీగా ఏ గ్రామంలో ఏ పార్టీలో ఏ నాయకులు ఉన్నారు? వారి స్థితిగతులు ఏంటి? గతంలో అతనిపై ఉన్న కేసులు, సమస్యాత్మక వ్యక్తులు జాబితాను సేకరించనున్నారు. వీరిపై ప్రత్యేక దృష్టి సారించి కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. గ్రామాల్లో ఏ రకమైన గొడవలు జరిగినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా రౌడీషీట్ తెరిచేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే గన్‌లైసెన్స్‌లు ఉన్న వారి వివరాలను సేకరించి అవసరం లేని వారిని తొలగించేలా కలెక్టర్‌కు నివేదిక అందజేయనున్నారు. ప్రాపర్టీ రికవరీపై ప్రత్యేక దృష్టి దొంగతనాలు, చోరీకి గురైన సొమ్మును తిరిగి బాధితులకు అందజేయడంపై అశోక్ ప్రత్యేక దృష్టి సారించారు. గత మూడు నెలల్లో రూ.1.28కోట్ల సొమ్మును(బంగారంతో పాటు) దొంగల నుంచి రికవరీ చేశారు. అలాగే దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 15ఏళ్లుగా దొంగతనాల కేసులోని నిందితుల జాబితాను సిద్ధం చేసి వారి ఫొటోలతో పాటు పూర్తి వివరాలను ఆన్లైన్ చేయిస్తున్నారు. పాత నేరస్తులపై పోలీసు నిఘా ఉంచి, దొంగతనాలకు పాల్పడకుండా చేయడమే లక్ష్యంగా సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తున్నారు. అయితే పట్టణ, మండల కేంద్రాల్లో ఇప్పటికీ అధికార పార్టీ కనుసన్నల్లో పని చేస్తున్న సిబ్బంది విషయంలో ఎస్పీ దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. సమష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు సాధ్యం ప్రతి అధికారి అందరినీ కలుపుకుని వెళ్లినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధ్యం. నేను బాధ్యతలు తీసుకున్నప్పుడు దొంగతనాల కేసులు ఎక్కువగా పేరుకుపోయాయి. కేవలం కేసులు తీసుకుంటే సరిపోదు.. బాధితులకు సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలి. బాధితులకు న్యాయం జరిగినప్పుడే పోలీసు వ్యవస్థ బాగా పని చేస్తున్నట్టు. ఆ దిశగా సిబ్బందికి అన్ని విషయాల్లో శిక్షణనిస్తున్నాం. ఫ్యాక్షన్, రౌడీయిజం, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణను ప్రాధాన్యత అంశాలుగా తీసుకుంటున్నాం. ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాం. మట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. సిబ్బంది పనితీరుపైనా నిఘా ఉంచాం. – జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ -
హిందూపురంలో నేడు వినాయక నిమజ్జనం
అనంతపురం సెంట్రల్: హిందూపురంలో గురువారం నిర్వహిస్తున్న వినాయక నిమజ్జన వేడుకలకు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. బుధవారం బందోబస్తు ఏర్పాట్లకు సంబందించిన వివరాలను ‘సాక్షి’కి వెల్లడించారు. జిల్లాలో హిందూపురంలో ఏడు రోజులకు నిమజ్జన వేడుకలు నిర్వహిస్తారన్నారు. ఈ వేడుకల్లో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణలో ఐదుగురు డీఎస్పీలు, 19 మంది సీఐలు, 75 మంది ఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, స్పెషల్ పార్టీ బలగాలు మొత్తం 700 మందిని తరలిస్తున్నట్లు వివరించారు. నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిసేందుకు ఉత్సవ నిర్వాహకులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా డయల్–100, 9989819191 సెల్ నెంబర్‌కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
నిఘా పటిష్టం
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం.. ఫ్యాక్షన్, గ్రూపు తగాదాల అడ్డుకట్టపై దృష్టి – చిన్న సమస్యనైనా తీవ్రంగా పరిగణించాలి - జిల్లాలో ఎక్కడా బెల్టుషాపులు ఉండరాదు - ఇసుక జిల్లా సరిహద్దు దాటి పోరాదు – నేర సమీక్షలో ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశం అనంతపురం సెంట్రల్: శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిఘాను పటిష్టం చేయాలని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో సవాళ్లతో కూడుకుని పని చేయాల్సి ఉన్నందున ఫ్యాక్షన్, గ్రూపు తగాదాలపై దృష్టి సారించాలని, చిన్న సమస్య తలెత్తినా తీవ్రంగా పరిగణించి మొగ్గలోనే తుంచేయాలని సూచించారు. శనివారం నగరంలోని పోలీస్ కాన్ఫరెన్స్హాల్లో నేర సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ గతంలో జరిగిన హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు తదితర ఘటనలపై ఆరా తీశారు. సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంతంగా ఉండేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాలన్నారు. జిలాల్లో అతి సున్నితమైన (హైపర్ సెన్సిటివ్), సున్నితమైన (సెన్సిటివ్) గ్రామాల్లో పోలీసుపరంగా చట్టాన్ని అనుసరిస్తూ కఠినంగా వ్యవహరించాలన్నారు. గ్రామాల్లో ఏం జరుగుతోందనే సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి చిన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఫ్యాక్షనిస్టులు, రౌడీల కదలికలపై నిత్యం నిఘా ఉంచాల్సిందేనని సూచించారు. పక్కాగా బైండోవర్లు చేయాలన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో సంబంధిత సీఐలు, డీఎస్పీలు ఆయా గ్రామాలను సందర్శించి పరిస్థితులను బేరీజు వేసుకొని తదనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. ఫ్యాక్షన్, దాని పర్యవసానాల గురించి విద్యార్థుల్లో అవగాహన కల్పించాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ చేపట్టి ప్రజల్లో స్పూర్తి నింపాలన్నారు. జిల్లాలో ఎక్కడా బెల్టుషాపులు కొనసాగరాదని, ఇసుక జిల్లా దాటకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలపై జరిగే నేరాలను తీవ్రంగా పరిగణించాలని సూచించారు. త్వరలో జరిగే గణేష్ వేడుకలు ప్రశాంతంగా ముగిసేలా కృషి చేయాలన్నారు. హిందూపురం, కదిరి పట్టణాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు స్నేహపూర్వకంగా మెలిగేలా శాంతి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్ ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు. స్పెషల్ డ్రైవ్ పక్కాగా చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా తిరిగే వాహన చోదకులపై చర్యలు తీసుకోవాలన్నారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, టెక్నాలజీని వినియోగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీలు మల్లికార్జున, మల్లికార్జునవర్మ, శివరామిరెడ్డి, వెంకటరమణ, కరీముల్లాషరీఫ్, చిదానందరెడ్డి, శ్రీధర్‌రావు, వెంకటరమణ, ఖాసీంసాబ్, నర్సింగప్ప, మహబూబ్‌బాషా, నాగసుబ్బన్న, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ర్యాగింగ్ నిరోధానికి సమష్టి కృషి
ర్యాగింగ్ నివారణకు ఫోన్ నంబర్లు డయల్-100, వాట్సాప్ నంబర్ 9989819191)) అనంతపురం సెంట్రల్: ర్యాగింగ్ నిరోధానికి సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ పిలుపునిచ్చారు. ఎస్పీ అశోక్‌కుమార్ అధ్యక్షతన ఆదివారం స్థానిక పోలీసు కన్వెన్షన్హాల్లో ర్యాగింగ్ నిరోధక అవగాహన సదస్సు నిర్వహించారు. ఏపీ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ చట్టం–1997, ఏపీ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఆల్ ఎడ్యుకేషన్ రూరల్స్–2002, 2009 చట్టాలు, హైకోర్టు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల గురించి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎస్పీ వివరించారు. ర్యాగింగ్ పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉంటాయి? సంబంధిత సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో అవగాహన కల్పించారు. ర్యాగింగ్ కట్టడి కోసం డయల్ –100, వాట్సాప్ నంబర్ 9989819191లకు సమాచారం చేరవేస్తే తక్షణ చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు. అవసరమైతే పోలీసు సేవలు వినియోగించుకోవాలన్నారు. ప్రత్యేక నిఘా కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ ర్యాగింగ్‌ను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాగింగ్ రక్కసి వల్ల ఒక్కోసారి ప్రాణాలు పోయిన సంఘటనలు లేకపోలేదన్నారు. తమిళనాడులోని అన్నామలై విశ్వవిద్యాలయంలో గతంలో జరిగిన ఓ ర్యాగింగ్ ఘటనను ఆయన గుర్తు చేశారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో విద్యాసంస్థల్లో అడుగిడిన విద్యార్థులకు అందుకు తగ్గట్టుగా ప్రశాంత, స్వేచ్చాయుత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఆయా యాజమాన్య సంస్థలపై ఉంటుందని సూచించారు. విద్యాసంస్థలు, హాస్టళ్లలో విద్యార్థులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టాలు, వర్తించే శిక్షలు వల్ల భవిష్యత్ ఎలా నాశనం అవుతుందో తెలియజేస్తూ పోస్టర్లు, కళాప్రదర్శనలు, నినాదాలతో కూడిన పెయింటింగ్‌లు వేయించాలని ఆదేశించారు. ర్యాగింగ్ నిరోధక కమిటీలు, స్క్వాడ్లు నిత్యం అప్రమత్తంగా ఉంటూ ర్యాగింగ్ కట్టడికి పోలీసుల సహకారం తీసుకోవాలన్నారు. ఎస్కేయూ వైస్ చాన్స్‌లర్ రాజగోపాల్ మాట్లాడుతూ ర్యాగింగ్‌పై చిన్న సమాచారం లేదా ఫిర్యాదు వచ్చినా తక్షణమే స్పందించి ముందుగానే నిరోధించే అవకాశముందన్నారు. కార్యక్రమంలో ఎస్కేయూ రిజిస్ట్రార్ సుధాకర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, జేఎన్టీయూ ప్రిన్సిపాల్ ప్రహ్లాదరావు, పలువురు డీఎస్పీలు, సీఐలు, కళాశాలల యాజమాన్యాలు పాల్గొన్నారు. -
బాధితులకు సత్వర న్యాయమే లక్ష్యం
– డయల్ 100, 9989819191 కాల్స్‌పై ఎస్పీ సమీక్ష అనంతపురం సెంట్రల్: ఆపదలో ఉన్న బాధితులకు సత్వరన్యాయం అందించడమే లక్ష్యంగా డయల్ 100, 99898 19191 విభాగాలు పనిచేయాలని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ సూచించారు. జులై నెలలో ఆయా కాల్స్‌కు వచ్చిన ఫిర్యాదులపై మంగళవారం సంబంధిత అధికారులతో ఎస్పీ సమీక్షించారు. జులైలో మొత్తం 2,306 కాల్స్ అందాయని, ప్రతి రోజూ సగటును 73 కాల్స్ వచ్చినట్లు వివరించారు. వీటిలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు వెంటనే సహాయచర్యలు అందించినట్లు తెలిపారు. ఓడీసీ, కణేకల్లు, పట్నం, శెట్టూరు ప్రాంతాల్లో బెల్టు దుకాణాలపై దాడులు చేసి కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. వజ్రకరూరు, శెట్టూరు, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో నాటుసారా విక్రేతలను పట్టుకొని బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఆపదలో ఉన్న ప్రజలతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లైతే డయల్ 100, 99898 19191 నంబర్లను ఆశ్రయిస్తే వంద శాతం న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు. -
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
అనంతపురం సెంట్రల్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పూర్తిగా నివారించాలనే లక్ష్యంతో పోలీసులు పనిచేయాలని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలు, నేరాలకు సంబంధించిన కారణాలను సమీక్షించిన ఆయన మరోవారం రోజుల పాటు స్పెషల్‌డ్రైవ్ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా పోలీసులు చేపట్టే తనిఖీలు, చర్యలను వివరిస్తూ ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నంబర్‌లేని ద్విచక్రవాహనాల కోసం స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు. త్రిబుల్రైడింగ్కు పాల్పడితే కేసులు నమోదు చేయాలన్నారు. నాలుగు చక్రాల వాహనాల్లో తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలని, అధిక లోడ్‌తో వెళ్లే వారికి కౌన్సెలింగ్ చేయాలని ఆదేశించారు. గత పది రోజులుగా జిల్లాలో చేపడుతున్న స్పెషల్‌డ్రైవ్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోందన్నారు. మొత్తం 37,266 వాహనాలను తనిఖీ చేశారని, ఇందులో 10,244 మందికి డ్రైవింగ్ లైసెన్స్‌లు లేవని గుర్తించినట్లు తెలిపారు. వీరికి కౌన్సెలింగ్‌తో పాటు కేసులు నమోదు చేసినట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 4,055 ట్రాక్టర్ ట్రాలీలకు రేడియం స్టిక్కర్లు అతికించామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 6,611 మంది ద్విచక్రవాహనదారులపై కేసు నమోదు చేశామన్నారు. -
సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల పాత్ర కీలకం
అనంతపురం మెడికల్ : సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల పాత్ర కీలకమని ఎస్పీ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఐఎంఏ హాల్లో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) జిల్లా మహాసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీతో పాటు జేఎన్టీయూ రిజిస్ట్రార్ కృష్ణయ్య, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు హాజరై మాట్లాడారు. జర్నలిస్టులు వారికున్న సమాచారంతో వాస్తవ కథనాలు ఇస్తుంటారని, అధికారులు, ప్రజాప్రతినిధులు పాజిటివ్‌గా తీసుకోవాలన్నారు. వ్యక్తిగత రాగధ్వేషాలు పెంచుకోరాదని సూచించారు. అనంతరం యూనియన్ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా షఫీవుల్లా, ప్రధాన కార్యదర్శిగా రామాంజనేయులు, కోశాధికారిగా సుదర్శన్‌రెడ్డిని ప్రకటించారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని యూనియన్ నేతలు తెలిపారు. -
జిల్లాకు చేరుకున్న ఎస్పీ అశోక్‌కుమార్
అనంతపురం సెంట్రల్ : నూతన ఎస్పీ గోరంట్ల వెంకటగిరి అశోక్‌కుమార్ ఆదివారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన వచ్చిన ఆయన, నేరుగా అనంతపురంలోని పోలీసుగెస్ట్హౌస్కు వెళ్లిపోయారు. నూతన ఎస్పీకి అదనపు ఎస్పీ మాల్యాద్రి, డీఎస్పీలు మల్లికార్జున, మల్లికార్జునవర్మ, చిన్నికృష్ణ తదితరులు స్వాగతం పలికారు. కాసేపు వారితో మాట్లాడిన ఎస్పీ వెంటనే విశ్రాంతి గదిలోకి వెళ్లారు. సోమవారం ఉదయం 10.15 గంటలకు ఆయన పోలీసుకార్యాలయంలో బాధ్యతలు తీసుకోనున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.