ర్యాగింగ్ నివారణకు ఫోన్ నంబర్లు
డయల్-100, వాట్సాప్ నంబర్ 9989819191))
అనంతపురం సెంట్రల్: ర్యాగింగ్ నిరోధానికి సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ పిలుపునిచ్చారు. ఎస్పీ అశోక్‌కుమార్ అధ్యక్షతన ఆదివారం స్థానిక పోలీసు కన్వెన్షన్‌హాల్లో ర్యాగింగ్ నిరోధక అవగాహన సదస్సు నిర్వహించారు. ఏపీ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ చట్టం–1997, ఏపీ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఆల్ ఎడ్యుకేషన్ రూరల్స్–2002, 2009 చట్టాలు, హైకోర్టు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల గురించి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎస్పీ వివరించారు. ర్యాగింగ్ పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉంటాయి? సంబంధిత సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో అవగాహన కల్పించారు. ర్యాగింగ్ కట్టడి కోసం డయల్ –100, వాట్సాప్ నంబర్ 9989819191లకు సమాచారం చేరవేస్తే తక్షణ చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు. అవసరమైతే పోలీసు సేవలు వినియోగించుకోవాలన్నారు.
ప్రత్యేక నిఘా
కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ ర్యాగింగ్‌ను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాగింగ్ రక్కసి వల్ల ఒక్కోసారి ప్రాణాలు పోయిన సంఘటనలు లేకపోలేదన్నారు. తమిళనాడులోని అన్నామలై విశ్వవిద్యాలయంలో గతంలో జరిగిన ఓ ర్యాగింగ్ ఘటనను ఆయన గుర్తు చేశారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో విద్యాసంస్థల్లో అడుగిడిన విద్యార్థులకు అందుకు తగ్గట్టుగా ప్రశాంత, స్వేచ్చాయుత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఆయా యాజమాన్య సంస్థలపై ఉంటుందని సూచించారు. విద్యాసంస్థలు, హాస్టళ్లలో విద్యార్థులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.
ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టాలు, వర్తించే శిక్షలు వల్ల భవిష్యత్ ఎలా నాశనం అవుతుందో తెలియజేస్తూ పోస్టర్లు, కళాప్రదర్శనలు, నినాదాలతో కూడిన పెయింటింగ్‌లు వేయించాలని ఆదేశించారు. ర్యాగింగ్ నిరోధక కమిటీలు, స్క్వాడ్‌లు నిత్యం అప్రమత్తంగా ఉంటూ ర్యాగింగ్ కట్టడికి పోలీసుల సహకారం తీసుకోవాలన్నారు. ఎస్కేయూ వైస్ చాన్స్‌లర్ రాజగోపాల్ మాట్లాడుతూ ర్యాగింగ్‌పై చిన్న సమాచారం లేదా ఫిర్యాదు వచ్చినా తక్షణమే స్పందించి ముందుగానే నిరోధించే అవకాశముందన్నారు. కార్యక్రమంలో ఎస్కేయూ రిజిస్ట్రార్ సుధాకర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్ ప్రహ్లాదరావు, పలువురు డీఎస్పీలు, సీఐలు, కళాశాలల యాజమాన్యాలు పాల్గొన్నారు.
ర్యాగింగ్ నిరోధానికి సమష్టి కృషి
Published Sun, Aug 6 2017 10:41 PM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM
Advertisement
Advertisement