బదిలీపై వెళ్తున్న సీఎం త్రివిక్రమవర్మ
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మకు బదిలీ అయింది. ఈయనకు ఇటీవల డీఐజీగా పదోన్నతి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈయన్ని ఏలూరు రేంజ్ డీఐజీగా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈయన స్థానంలో ఇదివరకూ జిల్లాలో ఏఎస్పీగా పనిచేసిన సెంథిల్‌కుమార్ జిల్లా ఎస్పీగా రానున్నట్లు సమాచారం. బదిలీపై వెళ్తున్న సీఎం త్రివిక్రమవర్మ 2017 జూన్ 26న శ్రీకాకుళం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన హయాంలో వంశధార నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించే విషయంలో చురుగ్గా వ్యవహరించారు. అలాగే కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ (సీపీవో) వ్యవస్థను జిల్లాకు పరిచయం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై శ్రద్ధ కనబర్చారు. దొంగతనాలు అరికట్టడంలో, దొంగల భరతం పట్టేందుకు వీలుగా ఎల్‌హెచ్‌ఎంఎస్ ప్రత్యేక యాప్‌ను రూపొందించడంలో, జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ఈయన హయాంలోనే జరిగింది. రాత్రి వేళళ్లో ముమ్మర గస్తీ నిర్వహించడం, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారికి చలానాలు నమోదు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదుతో పాటు పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు కూడా త్రివిక్రమవర్మ హయాంలోనే జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment