సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికలపై జిల్లా యంత్రాంగం కసరత్తును వేగవంతం చేసింది. మండల ప్రాదేశిక స్థానాల (ఎంపీటీసీ) పునర్విభజన ప్రక్రియను చకచకా పూర్తి చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలపై అనుమానాలున్నప్పటికీ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఎంపీటీసీల లెక్కలు తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 13వ తేదీలోగా ఎంపీటీసీల స్థానాల డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సర్కారు నిర్దేశించింది. ఈ నెల 14న ప్రాథమిక నోటిఫికేషన్, అనంతరం సూచనలు, అభ్యంతరాలు స్వీకరించిన పిదప 28న తుది జాబితా ప్రకటించాలని మార్గదర్శకాలు జారీచేసింది. ఈ క్రమంలోనే ఎంపీటీసీ స్థానాల పునర్విభజనలో జిల్లా యంత్రాంగం తలమునకలైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో.. ఆ మేరకు పునర్విభజనను చేపడుతోంది.
3500మంది జనాభాకు ఓ స్థానం..
సగటున 3500 మంది జనాభాకు ఒక ఎంపీటీసీ స్థానం ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో 2011 జనాభా ప్రకారం జిల్లావ్యాప్తంగా 639 ఎంపీటీసీ స్థానాలు వస్తాయి. గతంలో 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 500 ఎంపీటీసీలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా జనాభా 22,36,329 ఉంది. ఈ మేరకు ఈ సారి అదనంగా 139 ఎంపీటీసీలు పెరగనున్నాయి. అయితే, సరూర్‌నగర్, రాజేంద్రనగర్ మండలాల్లోని గ్రామాలను నగరపంచాయతీ/జీహెచ్‌ఎంసీ పరిధిలో కలిపారు. ఇవికాకుండా మరో 50 పంచాయతీలను గ్రేటర్‌లో విలీనం చేసే అంశం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో వీటిని పంచాయతీరాజ్ శాఖ జాబితానుంచి తొలగించాల్సి ఉంటుంది. దీంతో జిల్లాలో ఎంపీటీసీల సంఖ్య 550 కు పరిమితమయ్యే అవకాశముందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుండగా.. ఎంపీటీసీల పునర్విభజన ప్రక్రియను ఈ నెల 13లోగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. 14న ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసి 21వ తేదీలోగా అభ్యంతరాలు స్వీకరించి 26వ తేదీవరకు పరిశీలిస్తారు. 28న ఎంపీటీసీ స్థానాల తుది జాబితాను ప్రకటిస్తారు. అదే రోజూ రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతారు. ఎంపీటీసీ స్థానాలతోపాటు జెడ్పీటీసీ స్థానాల జాబితాను కూడా ఏకకాలంలో రూపొందిస్తారు. కాగా, గ్రేటర్‌లో విలీనమయ్యే పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఇదివరకే కోర్టు తీర్పు వెల్లడించినందున.. ఆ జనాభాను కూడా పరిగణనలోకి తీసుకునే అంశాన్ని జిల్లా యంత్రాంగం పరిశీలిస్తోంది.
ఎన్నికలు జరిగేనా.?
గత నెల 30న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన అనంతరం.. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారిపోయింది. సీమాంధ్రలో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగుస్తున్నాయి. ఈ పరిస్థితులు స్థానిక ఎన్నికల నిర్వహణకు అనువుగా లేవు. అయి తే, ఎంపీటీసీ స్థానాల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారుపై గత నెలాఖరులో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవి జిల్లా యంత్రాంగాలకు చేరేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. యంత్రాం గం మాత్రం వీటిపై కసరత్తు పూర్తి చేస్తున్నప్పటికీ, ఎన్నికల నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నెలాఖరులో నిర్వహిస్తామని గతంలో ప్రకటించిన మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం వెనకడుగు వేసిం ది. మంత్రివర్గంలో సగంమంది రాజీనామాలు చేయడం, పాలన స్తంభించడంతో ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి. ఈ క్రమంలో స్థానిక ఎన్నికలకు ఇప్పట్లో మోక్షం కలిగే అవకాశ ం కనుచూపు మేరలో కనిపించడం లేదు.
ప్రాదేశిక కసరత్తు షురూ
Published Sun, Aug 11 2013 4:26 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement