తూర్పుగోదావరి, కాకినాడ క్రైం : జిల్లాలో ఏడు సబ్‌జైళ్లు ఉండగా, జిల్లా కేంద్రం కాకినాడలోని సబ్‌జైలును స్పెషల్ సబ్‌జైలుగా ఆధునికీకరించారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఖైదీలకు ఆధునాతన వసతులు కల్పిస్తున్నారు. ఖైదీల మనస్సులు నిర్మలంగా ఉండేలా వారితో యోగా చేయిస్తున్నారు. అంతేకాదు ఓంశాంతి వారి శాంతిసందేశాలను అందిస్తున్నారు. న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహించి ఖైదీలు సత్ప్రవర్తన కలిగేలా వారికి వివిధ చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. లీగల్ క్లీనిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
ఖైదీల కోసం స్పెషల్ సబ్‌జైలులో మినరల్ వాటర్, రైస్ కుక్కర్లు, డైనింగ్ టేబుళ్లు, గార్డెన్, çషవర్‌బాత్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సబ్‌జైలు ఆవరణ పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంటుంది. అలాగే ఖైదీల కోసం వచ్చే బంధు, మిత్రులు కూర్చోవడానికి షెల్టర్, తాగడానికి మంచినీరు కల్పించారు. లోపలికి వెళితే ఇదొక జైలులా కాకుండా ఆశ్రమానికి తలపించేలా తీర్చిదిద్దారు. సువిశాలమైన గదులు, గదులన్నింటిలో ఫ్యాన్లు అమర్చారు. ఆటవిడుపుగా కేరమ్స్, చెస్, చదువుకోవడానికి పుస్తకాలు, చూడడానికి టీవీ సౌకర్యాలను కల్పించారు. ఖైదీలను ఎమర్జెన్సీగా ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించారు. సబ్‌జైలులో ఉండే ఖైదీలు వారి కుటుంబ సభ్యులతో వారానికి రెండుసార్లు మాట్లాడే అవకాశాన్ని జైల్ అధికారులు కల్పించారు. ఖైదీల ఆరోగ్యం సబ్ జైలులో ప్రత్యేకంగా ఆర్వోప్లాంట్ ఏర్పాటు చేశారు.
మెనూలో మార్పులు
ఉదయం టిఫిన్, వారంలో రెండు రోజులు చపాతి, అందులో బంగాళదుంప కూర, మరో రెండు రోజులు గోధుమనూక, వరినూక ఉప్మా, రెండు రోజులు పులిహోర, ఒక రోజు పొంగలి పెడుతున్నారు. నెలలో మొదటి ఆదివారం మధ్యాహ్నం మేక మాంసం, రెండు, మూడు, నాలుగు వారాలు కోడిమాంసం, మంగళవారం కోడిగుడ్డు ఇస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు రెండేసి రోజులు కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పుతో పాటు ఆకు కూర పెడుతున్నారు. సాయంత్రం కాయగూరల భోజనం పెడుతున్నారు.
సీసీ కెమెరాల నిఘా
ఖైదీల కదలికలు, వారి మానసిక పరిస్థితిని నిరంతరం పరిశీలించేందుకు సబ్‌జైలులో అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వారి సత్ప్రవర్తనను కూడా తెలుసుకుంటున్నారు.
‘‘జైళ్లు సంస్కరణాలయాలుగా ఉండాలి. ఖైదీల్లో మార్పు తీసుకువచ్చి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి’’ ఇదీ మహాత్ముడి ఆశయం. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్నారు జైళ్ల అధికారులు. ‘‘సెంట్రల్ జైలైనా.. సబ్ జైలైనా.. ఒక్కసారి అందులోకి వెళితే నరకం అనుభవించాల్సిందే..’’ అనే ఒకప్పటి మాటను కూడా జైలు అధికారులు మరచిపోయేలా చేస్తున్నారు. ప్రస్తుతం చెరసాలలను అధునాతన మార్పులతో ఖైదీల్లో పరివర్తన తెచ్చే శాలలుగా మార్చేస్తున్నారు. తమదైన శైలిలో ‘చెర’గని ముద్ర వేస్తున్నారు.