
తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక
చిత్తూరు(ఎడ్యుకేషన్): జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి తెలిపారు. జెడ్పీ ఒకటి, ఏడు స్థాయి సంఘాల సమావేశం బుధవారం జరిగింది. జెడ్పీ మీటింగ్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో మం చినీటి సమస్య పరిష్కారంపై చర్చించారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు మొదట పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లాలో ముఖ్యంగా పడమటి మండలాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, వర్షపునీటిని నిల్వ చేసి, వినియోగించుకునే విధానంపై ప్రణాళికలు అవసరమని జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి అన్నారు. ఇప్పటికే తెలుగుగంగతో శ్రీకాళహస్తి, ఏర్పేడు, రేణిగుంట మండలాల్లోని 108 గ్రామాలకు శాశ్వత తాగునీటి పరిష్కారం చూపామని గుర్తు చేశారు.అదే తరహాలో జిల్లాలో ఉన్న పెద్ద చెరువులు, జలాశయాలను తాగునీటి సరఫరాకు వినియోగించుకోవాలని సూచించారు.
ప్రభుత్వానికి నివేదిద్దాం: చెవిరెడ్డి
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని సూచించారు. జెడ్సీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో మంచినీటి వనరులను కాపాడుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుందామన్నారు. ఇందుకు ఎంపీడీవోలు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
వాటర్‌షెడ్లతో సాధ్యం
పుంగనూరు జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డియాదవ్ మాట్లాడుతూ ఉపాధిహామీ పథకంలో వాటర్‌షెడ్ల నిర్మాణాలు విరివిగా చేపడితే భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. సదుం జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఐదునెలలుగా పెండింగ్‌లో ఉన్న మంచినీటి సరఫరా బిల్లులు చెల్లించాలని కోరారు. ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణాలు పూర్తిచేసి నెలలు గడుస్తున్నా, బిల్లుల చెల్లింపులో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లమండ్యం చెరువును రిజర్వాయర్‌గా మార్చి సమీప గ్రామాల్లో తాగునీటి సమస్యను తీర్చాలని రేణిగుంట జెడ్పీటీసీ సభ్యురాలు లీలావతి కోరారు. పెద్దేరు, చిన్నేరు ప్రాజెక్టులను హంద్రీ-నీవాకు అనుసంధానం చేయడం ద్వారా మంచినీటి ఎద్దడి పరిష్కరించుకోవచ్చని తంబళ్లపల్లి జెడ్పీటీసీ సభ్యుడు శంకర్ సూచించారు. తలకోన నీటిని పంపింగ్ విధానం ద్వారా చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం మండలాలకు సరఫరా చేసి తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని చిన్నగొట్టిగల్లు జెడ్పీటీసీ సభ్యురాలు శోభారాణి కోరారు.
పాకాల, ఐరాల మండలాల్లోని 20 గ్రామాలకు భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్న చుక్కావారిపల్లి నుంచి సరఫరా చేయాలని పాకాల జెడ్పీటీసీ సురేష్ సూచించారు. తాగునీటి పథకాలకు 20హెచ్‌పీ మోటార్లు అమర్చాలని బి.కొత్తకోట జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డెప్ప కోరారు. చెరువులను ఆక్రమణలనుంచి కాపాడాలని పెనుమూరు జెడ్పీటీసీ రుద్రయ్యనాయుడు కోరారు. పూతలపట్టు మండలం పి.కొత్తకోట చెరువులో వర్షపునీటిని నిల్వచేసుకుని గ్రామాలకు వినియోగపడేలా చర్యలు చేపట్టాలని జెడ్పీటీసీ వనజ పేర్కొన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ విజయకుమార్,ట్రాన్స్‌కో ఎస్‌ఈ హరినాథ్ పాల్గొన్నారు.