
జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా, సంక్షేమమే అజెండాగా వ్యవసాయ, విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. జిల్లాలో 60 శాతంపైగా ఉన్న వ్యవసాయాధారిత కుటుంబాలకు ఈ బడ్జెట్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భారీగా నిధులు కేటాయించి వారి సంక్షేమానికి అండగా నిలిచారు. జిల్లాలో సుమారుగా 6.60 లక్షల రైతాంగ కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 85 శాతానికి పైగా పేద వర్గాల పిల్లల చదువులు, విద్య వ్యవస్థలో మౌలిక రంగాల కల్పన, అభివృద్ధికి కూడా అదే తీరుగా బడ్జెట్ కేటాయింపులు చేశారు. 4.60 లక్షల మంది తల్లులకు ఆర్థిక భరోసా లభిస్తుంది. పొదుపు మహిళలు 5.60 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఆక్వా రైతులు 39 వేల మందికి, మత్స్యకారుల 59 వేల మందికి ఆర్థిక చేయూత లభిస్తుంది.
సాక్షి, నెల్లూరు : రాష్ట్ర బడ్జెట్‌ల్లో వ్యవ‘సాయానికి’ పెద్ద పీట వేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో శుక్రవారం ప్రవేశ పెట్టి న బడ్జెట్లో రైతులకు సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.20,677 కోట్లు, సాగునీరు, వరద నివారణకు రూ.13,139 కోట్లు, వైఎ స్సార్ రైతు భరోసాకు రూ.8,750 కోట్లు కేటాయించారు. జిల్లాలో సుమా రు 11 లక్షల ఎకరాల్లో వ్యవసాయం సాగువుతోంది. ఇందులో 4.50 లక్షల మంది యాజమాన్య రైతులు ఉంటే.. 1.96 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు.
పెట్టుబడి సాయంగా అందరి రైతులకు ఏటా రూ.12,500 లబ్ధి కలుగుతోంది. స్వల్పకాలిక రుణాల కింద రూ.12 వేల కోట్లు, దీర్ఘకాలిక రుణాల కింద రూ.1,500 కోట్లు కేటాయించడంతో రైతులకు ఆసరాగా ఉండనుంది. జిల్లాలో దాదాపు ఏటా లక్ష మంది వరకు రుణాలు తీసుకుంటారు. వీరిందరికి వడ్డీ లేని రుణా లు అందనున్నాయి. బడ్జెట్‌లో కేటా యింపులతో రుణాలు సులభతరం కా నున్నాయి. సేంద్రియ వ్యవసాయానికి రూ.91 కోట్లు కేటాయించారు. జిల్లాలో సేంద్రియ వ్యవసా యం 4 వేల ఎకరాల్లోనే సాగు చేస్తున్నారు. ఉచిత విద్యుత్, ధరల స్థిరీకరణ నిధుల ద్వారా ప్రతి రైతు కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుంది.
రైతులను ఆదునుకునే విధంగా ఉంది
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులను అన్ని విధాలా ఆదుకునే విధంగా, ఆసరాగా ఉంది. బడ్జెట్‌లో రైతాంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి కేటాయింపులు చేయడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
– చిరసాని కోటిరెడ్డి, రైతు సం ఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి
సాగరపుత్రుల కన్నీళ్లు తుడుస్తూ..
వాకాడు: మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 590 కోట్లు కేటాయించారు. జిల్లాలో 169 కిలో మీటర్ల సముద్ర తీరం వెంబడి 12 తీర ప్రాంత మండలాల్లో 118 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 59 వేల మంది వేటపై ఆధారపడిన మత్స్యకారులు ఉన్నారు. వీరికి సంబంధించి 5 వేలకు పైగా వేట చేసే లైసెన్స్ కలిగిన బోట్లు ఉన్నాయి. వీరికి గతంలో డీజిల్‌పై రూ.6.03 మాత్రమే రాయితీ ఉండేది. అది కూడా పూర్తిగా అందేది కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మొత్తాన్ని రూ.12.96లకు పెంచారు. ఇందు కోసం డీజల్ సబ్సిడీ కింద రూ. 100 కోట్లు కేటాయించారు.
ఐదేళ్లుగా వేట విరామం సమయంలో చెల్లించే పరిహారం అందని ద్రాక్షలా మారింది. గత ప్రభుత్వం వేట విరామం పరిహారం కింద చెల్లిస్తున్న రూ.4 వేలను రూ. 10 వేలకు పెంచి ఏటా పరిహారం కోసం రూ. 100 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. జిల్లాలో 15,321 మంది మత్స్యకారులు లబ్ధిపొందనున్నారు. సముద్రంపై ప్రకృతి విపత్తుల కారణంగా వేట సక్రమంగా సాగక, మత్స్యసంపద దొరక్క నానా అగచాట్లు పడుతున్న మత్స్యకారులకు మత్స్య సందప వృద్ధి కోసం రూ. 60 కోట్లు కేటాయించారు. ఊహ తెలిసినప్పటి నుంచి వేట చేసి 50 ఏళ్లకే వృద్ధాప్యం చెందిన మత్స్యకారులకు పింఛన్ కింద రూ.130 కోట్లు కేటాయించారు. మత్స్యకారులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే గతంలో ఇస్తున్న రూ. 5 లక్షల బీమాను రూ. 10 లక్షలకు పెంచారు.
జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం
మత్స్యకారుల సంక్షేమానికి అనూహ్యంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆదుకున్న సీఎం జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. నాలుగేళ్లుగా వేట విరామం కింద అందజేయాల్సిన రూ. 4 వేలు డబ్బులు సక్రమంగా అందలేదు. దానిని రూ. 10 వేలకు పెంచి మత్స్యకారులను ఆదుకోవడం చాలా సంతోషంగా ఉంది.
– పోలయ్య మత్స్యకారుడు, కొండూరుపాళెం
ప్రభుత్వ విద్యకు పెద్ద పీట
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. బడ్జెట్‌లో విద్యారంగానికి రూ.32,618 కోట్లు నిధులు కేటాయించారు. ఇందులో జగనన్న అమ్మఒడి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మొత్తం రూ.6,455 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన జగనన్న అమ్మఒడి పథకం పకడ్బందీగా అమలు చేసేందుకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుందని విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు. జిల్లాలో మొత్తం 4,485 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 3,307, ఎయిడెడ్ 114, కార్పొరేట్, ప్రైవేట్ 1,057, కేంద్ర ప్రభుత్వ 7 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 4,28,667 మంది విద్యార్థులు చదువుతున్నారు.
వీరితో పాటు ఇంటర్ విద్యార్థుకు కూడా జగనన్న అమ్మఒడి పథకాన్ని విస్తరించనున్నట్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌కు సంబంధించి 215 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ యాజమాన్యానికి సంబంధించి 69, కార్పొరేట్, ప్రైవేటుకు సంబంధించి 146 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో మొత్తం 32,020 మంది విద్యార్థులు చదువుతున్నారు. అమ్మఒడి పథకంలో భాగంగా ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఏటా రూ.15 వేలు విద్యార్థి తల్లి ఖాతాకు జమ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో జిల్లాలో మొత్తం 4,60,687 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
మధ్యాహ్న భోజన పథకం
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1,077 కోట్లు కేటాయించింది. జిల్లాలో మొత్తం 3,404 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. నెల్లూరు అర్బన్ పరిధిలో ఇస్కాన్ సంస్థ ద్వారా 111 పాఠశాలలు, అక్షయ పాత్ర ద్వారా గూడూరు, మనుబోలు, వెంకటాచలం, ముత్తుకూరు మండలాల్లోని 291 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. వీటితో పాటు మిగిలిన 3,202 పాఠశాలల్లో 3002 ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఈ పాఠశాలల్లో మొత్తం 2,16,320 మంది విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి సరిగా నిధులు ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏజెన్సీ నిర్వాహకులకు బిల్లులు ఐదారు నెలలు పెండింగ్‌లో ఉంచేవారు. ఆయాలు, హెల్పర్లకు గౌరవ వేతనం సైతం నెలల తరబడి ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు బడ్జెట్‌లో రూ.1,077 కోట్లు కేటాయించడం సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆక్వా రైతు సం‘క్షేమం’ దిశగా.
ఆక్వా రైతుల కష్టాలు తీరనున్నాయి. ఆక్వా రైతులకు విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యాచరణలో పెట్టారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఆక్వా రైతుల విద్యుత్ చార్జీల రాయితీకి రూ.475 కోట్లు కేటాయించారు. జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి 13 మండలాలు ఉన్నాయి. కావలి, బోగోలు, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, మనుబోలు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు, తడ మండలాల పరిధిలో సాధారంగా సుమారు 1.85 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. కానీ కొన్నేళ్లుగా పెరిగిన పెట్టుబడి వ్యయాలు, ధరల ఆటుపోటలతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం సుమారు 1.25 లక్షల ఎకరాల్లో సాగు అవుతోంది. దాదాపు 39 వేల మంది రైతులు ఆక్వా సాగు చేస్తుంటే.. 22,550 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.
సబ్సిడీ విద్యుత్‌తో మేలు
నిన్నటి వరకు ఆక్వా రైతులు విద్యుత్ కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు జీఓ విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం బడ్జెట్‌లో విద్యుత్ చార్జీల తగ్గింపునకు నిధులు కేటాయించడం ఆనందంగా ఉంది. ఇది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని స్పష్టమైంది.
– కనపర్తి నాగేంద్ర, ఆక్వా రైతు, ఊటుకూరు
పొదుపు మహిళలకు వడ్డీలేని రుణాలు
జిల్లాలోని పొదుపు మహిళలకు ఇక నుంచి వడ్డీలేని రుణాలు అందనున్నాయి. డీఆర్‌డీఏ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో, మెప్మా పరిధిలోని పట్టణ ప్రాంతాల్లో మొత్తం కలిపి 53,350 గ్రూపుల్లో 5.60 లక్షల మంది పొదుపు సభ్యులు ఉన్నాయి. గతంలో పొదుపు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేది. వడ్డీతో సహా సకాలంలో చెల్లించిన వారికి రాయితీ మొత్తాన్ని తిరిగి బ్యాంకులకు జమ చేసే వారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు అసలు మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. వడ్డీ మొతాన్ని ప్రభుత్వమే బ్యాంకులకు నేరుగా జమ చేయనుంది. ఈ మేరకు వడ్డీలేని రుణాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1,140 కోట్లు కేటాయించింది. పొదుపు గ్రూపులకు 2019 ఏప్రిల్ నుంచి వడ్డీలేని రుణాలు మంజూరు చేయనున్నారు. పొదుపు మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించేందుకు సుమారు నెలకు రూ.15 కోట్లకు పైగా వడ్డీ ప్రభుత్వం చెల్లించనుంది.
ఏప్రిల్, మే, జూన్, జూలై నెలకు సంబంధించిన వడ్డీని ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించనునట్లు సమాచారం. మహిళలు చెల్లించవలసిన వడ్డీని ప్రభుత్వం చెల్లించి దానికి సంబం«ధించిన రసీదులను గ్రామ వలంటీర్ల ద్వారా అందజేయనున్నట్లు తెలిసింది. సీఎం తీసుకున్న నిర్ణయం వలన స్వయం సహాయక గ్రూపు మహిళలపై వడ్డీల భారం పడదు. వడ్డీలేని రుణాల పథకం 2012 నుంచి అమలులో ఉంది. పొదుపు మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. మహిళలు తీసుకున్న రుణాలను అసలు, వడ్డీతో కలిపి మహిళలే చెల్లించే వారు. ప్రతి నెల సక్రమంగా చెల్లించన గ్రూపులకు మాత్రమే వడ్డీ తిరిగి చెల్లించే వారు. టీడీపీ ప్రభుత్వం 2016 జూన్ నుంచి వడ్డీలేని రుణాలు చెల్లించకుండా ఎగనామం పెట్టింది. పొదుపు మహిళలు మాత్రం తీసుకున్న రుణాలను వడ్డీలతో సహా తిరిగి చెల్లించారు. టీడీపీ ప్రభుత్వం మహిళను నమ్మించి మోసం చేసింది. నూతన ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల స్వయం సహాయక మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment