
బీసీల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్
♦ హెల్త్ సిటీగా విశాఖ : సీఎం
♦ విజయవాడలో జ్యోతిబా పూలే విగ్రహావిష్కరణ
విజయవాడ (భవానీపురం)/ సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వెనుకబడిన తరగతుల ఉప ప్రణాళిక కోసం బడ్జెట్‌లో రూ.8,700 కోట్లు కేటాయింపులు చేశామని చెప్పారు. మహాత్మా జ్యోతిబా పూలే 190వ జయంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఏర్పాటుచేసిన పూలే విగ్రహాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. విశాఖలోని ఏయూ కాన్వొకేషన్ హాలులో నిర్వహించిన పూలే జయంతి ఉత్సవంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో కలసి పాల్గొన్నారు.
విజయవాడ, విశాఖల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం జ్యోతిబా పూలే స్ఫూర్తితో, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విధానాలతో పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని చంద్రబాబు చెప్పారు. బీసీ హాస్టళ్లను పూర్తిగా రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తున్నామని తెలిపారు. విశాఖ హనుమంతవాక వద్ద రూ.565 కోట్లతో 1,300 పడకల సామర్థ్యంతో నిర్మించిన విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సెస్ (విమ్స్)ను చంద్రబాబు ప్రారంభించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో దీనిని తీర్చిదిద్దుతామన్నారు. హెల్త్ సిటీగా విశాఖను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇలావుండగా నక్కపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు రూ.18 లక్షల చెక్‌ను బుచ్చిరాజుపాలెం వద్ద సీఎం పంపిణీ చేశారు. విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టు వరకు సీఆర్‌డీఏ ఏర్పాటు చేసిన గ్రీనరీ, నూతన టెర్మినల్ పనులను సోమవారం ముఖ్యమంత్రి పరిశీలించారు.
ఈఎస్‌ఐ ఆస్పత్రికి శంకుస్థాపన
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేసే కార్మికులకు ఉపయోగపడే విధంగా 300 పడకల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన ఈఎస్‌ఐ ఆస్పత్రిని సీఎం అభ్యర్థన మేరకు 500 పడకల సామర్ధ్యానికి పెంచడంతో పాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర కార్మికశాఖ మంత్రి దత్తాత్రేయ ప్రకటించారు. తుంగ్లాంలో రూ.500 కోట్లతో నిర్మిస్తున్న ఈఎస్‌ఐ ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు.
ఆరోగ్యశ్రీయే స్ఫూర్తి: వెంకయ్యనాయుడు
సుమారు పదేళ్లుగా రాష్ర్టంలో నిరుపేదలకు ఎంతగానో ఉపయోగ పడుతున్న ఆరోగ్యశ్రీ పథకం స్ఫూర్తిగా జాతీయ ఆరోగ్య బీమా పథకాన్ని దేశ వ్యాప్తంగా ఈ ఏడాది నుంచే అమలు చేయాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రపంచంలో ప్రతి 10వేల మందికి 20 మంది డాక్టర్లుంటే..మన దేశంలో ఆరుగురే ఉన్నారన్నారు. ప్రభుత్వాస్పత్రు ల్లో వైద్యసేవలు ఘోరంగా ఉండడం వల్లే 67 శాతం మంది ప్రైవేటు, ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారన్నారు.