‘సత్యం’ రామలింగరాజుకు ప్రత్యేక కోర్టు సమన్లు
4న కోర్టులో హాజరుకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ అభియోగాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది. ఈ చార్జిషీట్‌లో నిందితులుగా ఉన్న రామలింగరాజు, ఆయన భార్య నందిని, సోదరులు, వారి భార్యల సహా డెరైక్టర్లుగా ఉన్న 47 మందితో పాటు 166 కంపెనీలకు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 4న వారంతా స్వయంగా కోర్టులో హాజరు కావాలని న్యాయమూర్తి చక్రవర్తి ఆదేశించారు. చార్జిషీట్‌లో 76 మందిని సాక్షులుగా పేర్కొన్న ఈడీ... 1,186 కీలక డాక్యుమెంట్లను ఆధారాలుగా చూపింది. దాదాపు 500 పేజీలున్న ఈ చార్జిషీట్‌తో పాటు 20 వేల పేజీల అనుబంధ డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 45 కింద అభియోగాలను మోపింది. ‘సత్యం’ మాజీ చైర్మన్ రామలింగరాజు కంపెనీ సీఈవో తదితరులతో కుమ్మక్కై సంస్థ లాభాలు ఉన్నట్లుగా చూపుతూ బ్యాలెన్స్ షీట్లను రూపొందించారని ఈడీ తన చార్జిషీట్‌లో ఆరోపించింది. ఏప్రిల్ 4 నుంచి ఈ కేసు తుది విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కుంభకోణంపై సీబీఐ నమోదు చేసిన కేసులో కోర్టు విచారణ (ట్రయల్) తుది దశలో ఉంది. ఈడీ చార్జిషీట్‌పై విచారణ ప్రారంభమైతే సీబీఐ కేసులో తీర్పు ఆలస్యం కావచ్చు.