సాక్షి, హైదరాబాద్: మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత బైర్రాజు రామలింగరాజు శుక్రవారం ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. ఇదే కేసులో నిందితులైన ఆయన భార్య నందిని, సోదరుడు రామరాజు, ఇతర కుటుంబసభ్యులు సహా 47 మంది కోర్టు ముందు హాజరయ్యారు. వీరినుంచి రూ.10 వేల చొప్పున పూచీకత్తు బాండ్లను తీసుకున్న కోర్టు.. వీరందరికీ చార్జిషీట్, అనుబంధ పత్రాలను అందజేసింది. తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది. చార్జిషీట్‌ను ఇప్పటికే కోర్టు విచారణకు స్వీకరించి.. నిందితులకు వాటి ప్రతులను కూడా అందజేసిన నేపథ్యంలో త్వరలో తుది విచారణ(ట్రయల్) ప్రారంభమయ్యే అవకాశముంది. కాగా సత్యం కంప్యూటర్స్ కుంభకోణంపై సీబీఐ నమోదు చేసిన కేసులో విచారణ(ట్రయల్) తుది దశలో ఉంది. మరో రెండు నెలల్లో ఈ కేసులో తీర్పు వెలువడే అవకాశముంది.
నాలుగున్నరేళ్ల తర్వాత చార్జిషీటు..
కేసు నమోదు చేసిన నాలుగున్నరేళ్ల తర్వాత ఈడీ అధికారులు ఈ చార్జిషీట్ దాఖలు చేశారు. సత్యం కంప్యూటర్స్ లిమిటెడ్‌ను నిందితుల జాబితాలో మొదటిదిగా పేర్కొనగా, రామలింగరాజు, ఆయన కుటుంబసభ్యులుసహా 47 మంది వ్యక్తులతోపాటు 166 కంపెనీలను ఈ జాబితాలో చేర్చారు. మొత్తం 213 మందిని నిందితులుగా చూపారు. 76 మందిని సాక్షులుగా పేర్కొనగా...1,186 కీలక డాక్యుమెంట్లను ఆధారాలుగా చూపారు. దాదాపు 500 పేజీల చార్జిషీట్‌తోపాటు 20 వేల పేజీల అనుబంధ డాక్యుమెంట్లను సమర్పించారు.
ఈడీ కోర్టుకు హాజరైన ‘సత్యం’ రాజు
Published Sat, Apr 5 2014 12:36 AM | Last Updated on Thu, Sep 27 2018 5:03 PM
Advertisement