
సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈనెల 29న ఉదయం 5.30 నుంచి శ్రీవారి దర్శనం, వైకుంఠ ద్వార ప్రవేశం కల్పిస్తామని టీటీడీ తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు వెల్లడించారు. ఏకాదశి ఏర్పాట్లను మంగళవారం ఆయన మీడియాకు వెల్లడించారు. 29న వైకుంఠ ఏకాదశి, 30న ద్వాదశి, నూతన ఆంగ్ల సంవత్సరాది కారణంగా ఈ నెల 28 నుంచి జనవరి 1 వరకు 5 రోజులపాటు అన్ని రకాల ఆర్జితసేవలు, కాలిబాట దివ్యదర్శనం టోకెన్లు రద్దు చేశామన్నారు.
వాటితోపాటు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, విరాళాలిచ్చిన దాతలకు ప్రత్యేక దర్శనాలు ఉండవన్నారు. ఏకాదశి రోజు ఉదయం 12.01 గంటలకు వైకుంఠ ద్వారం తెరిచి, నిత్య, ధను ర్మాస పూజలు నిర్వహిస్తామన్నారు. రాజ్యాంగపరమైన హోదాలో ఉన్నవారికి, ఇతర ప్రముఖులకు దర్శనం, వసతి ఏర్పాట్ల విషయమై ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామని జేఈవో వెల్లడించారు.