సాక్షి, మచిలీపట్నం : కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం ప్రత్యేకతే వేరు. అక్కడ ప్రధాన పార్టీల నాయకులకు అసమ్మతి బెడద, వర్గపోరు ఆనవాయితీగా వస్తోంది. దీనికితోడు ఇక్కడ ఒకసారి ఓడిస్తే మరో ఎన్నికలో సానుభూతితో గెలిపించే సంప్రదాయం కూడా ఓటర్లలో ఉంది. ఫలితంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటముల్లో ఆ నియోజకవర్గం ‘గన్’వరంగా గుర్తింపు పొందింది.
1994 ఎన్నికల్లో టీడీపీ టికెట్ రాకపోవడంతో గద్దె రామ్మోహన్‌రావు ఆ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేశారు. గద్దె చేతిలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి వెంకట బాలవర్థనరావు పరాజయంపాలయ్యారు. అప్పట్లో సానుభూతి ఓట్లతో గద్దె గెలవడంతో ఓటమిపాలైన బాలవర్థనరావు ఉడా చైర్మన్‌గా నియమితులయ్యారు. ఎన్నికల అనంతరం గద్దె తిరిగి టీడీపీలో చేరడంతో 1994 నుంచి 1999 వరకు గద్దె, దాసరి రెండు వర్గాలుగా గన్నవరం నియోజకవర్గంలో పనిచేస్తున్నారు.
1999 ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విజయవాడ ఎంపీగా గద్దెను పంపి దాసరికి గన్నవరం సీటు కేటాయించి వర్గ వైషమ్యాలను సర్దుబాటుచేసే ప్రయత్నం చేశారు.
1999 ఎన్నికల్లో అప్పటి ఎంపీ కావూరు సాంబశివరావు మద్దతుతో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కాంగ్రెస్ టికెట్ పొంది గన్నవరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. ముద్దరబోయినకు అప్పటి ఎన్నికల్లో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులంతా వ్యతిరేకంగా పనిచేసి ఓడించారు. కాంగ్రెస్‌లో అసమ్మతికితోడు ప్రజల్లో సానుభూతి తోడుకావడంతో 1999 ఎన్నికల్లో దాసరి విజయం సాధించారు.
ఓటమి పొందిన ముద్దరబోయిన నియోజకవర్గంలో మకాం పెట్టి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేశారు.
అంతకుముందు రెండు ఎన్నికల నుంచి చెల్లాచెదురైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను సమీకరించి పార్టీని బలోపేతం చేశారు. ఐదేళ్లు కష్టపడి పనిచేసిన ముద్దరబోయినకు 2004 ఎన్నికల్లో పార్టీ టికెట్ లభించలేదు. అధిష్ఠానం కడియాల బుచ్చిబాబును కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికచేయడంతో బిత్తరపోయిన ముద్దరబోయిన కాంగ్రెస్ రెబల్‌గా బరిలోకి దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన తరువాత కాంగ్రెస్‌లో చేరిపోయారు.
2009 ఎన్నికల్లో పట్టుబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ సాధించినప్పటికీ టీడీపీ తరపున పోటీ చేసిన దాసరి చేతిలో పరాజయం పాలుకాక తప్పలేదు.
తాజాగా..
గన్నవరంలో గతం నుంచి కాంగ్రెస్, టీడీపీ నువ్వానేనా అనే రీతిలో ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ చిరునామా గల్లంతైంది. వైఎస్సార్‌సీపీ పట్టు సాధించింది. ప్రధాన పార్టీగా ఉన్న తెలుగుదేశంలో మాత్రం అసమ్మతి అనవాయితీ కొనసాగుతూనే ఉంది. ఇటీవల దాసరి బాలవర్థనరావు, వల్లభనేని వంశీమోహన్‌లు ఇద్దరూ టికెట్ నాది అంటే నాది అంటూ పంతాలకు పోతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వారి సామాజికవర్గానికి చెందిన పెద్దలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. అయినా వీరిద్దరిలో ఏ ఒక్కరికి టికెట్ వచ్చినా మిగిలిన వారు అసమ్మతి అనవాయితీని కొనసాగిస్తూ రెబల్ అవుతారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
అసమ్మతి ఆనవాయితీ
Published Wed, Mar 26 2014 3:48 AM | Last Updated on Wed, Aug 15 2018 7:45 PM
Advertisement
Advertisement