కనిగిరి, న్యూస్‌లైన్: కనిగిరి ప్రాంత చేనేత కార్మికులపై నేతలు, అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. చేనేత కార్మికుల అభివృద్ధికి రూ.60 లక్షల ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న అప్పటి చేనేత జౌళి శాఖ మంత్రి శంకర్రావు హామీ నీటి మీదరాతగానే మారింది. 2011 జనవరి 22న శంకర్రావు కనిగిరిలో పర్యటించారు. చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. వారి సంక్షేమం కోసం రూ.60 లక్షలతో ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నెల రోజుల్లోపు అమలు చేసి ఆదుకుంటామని చెప్పారు. ఈమేరకు అప్పటి ఏడీఏను ఆదేశించారు. కానీ మూడేళ్లు కావస్తున్నా అతీ గతి లేదు. శంకర్రావు మారి ఆ శాఖకు మరో మంత్రి ప్రసాద్ కుమార్ వచ్చి రెండేళ్లు కావస్తున్నా వాటిపై దృష్టి సారించలేదు.
అదే వేదిక పై ఉన్న ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి కూడా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. ఇదిలా ఉండగా గత జూన్ నెలలో చేనేత కార్మికులకు హామీలేని రుణాలిస్తున్నట్లు ఎమ్మెల్యే ఉగ్ర హడావుడి చేశారు. ఈ ఏడాది జిల్లాలో 2,020 మందికి రూ.6 కోట్లు హామీలేని రుణాలిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆయా బ్యాంకుల పరిధిలోని చేనేతలకు తప్పక హామీలేని రుణాలివ్వాలని ఆదేశించారు. ఒక్కొక్కరికి రూ. 30 వేలు రుణం, రూ. 4,500 సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కనిగిరి ప్రాంతంలోని చేనేత కార్మికులు ఎంతో ఆశతో పోటీ పడి దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 1,500 దరఖాస్తులు వచ్చాయి. కానీ నేటికి ఒక్కరికీ రుణం అందలేదు.
బ్యాంకర్ల విముఖత:
పాలకుల, అధికారుల నిర్లక్ష్యం కనిగిరి ప్రాంత చేనేతలకు శాపంగా మారింది. వేదికలపై మాటలు చెప్పే నాయకులు వాటిని అమలు చేసేందుకు ప్రయత్నించడం లేదనే విమర్శలున్నాయి. చీరాల నియోజకవర్గంలోని కొంతమందికి తప్ప మిగతా ప్రాంతాల్లోని చేనేతలకు బ్యాంకర్లు హామీ లేని రుణాలు ఇవ్వలేదు. కనిగిరి నియోజకవర్గ పరిధిలోని ఏ బ్యాంకర్ కూడా చేనేతలకు హామీ లేని రుణాలిచేందుకు ముందుకు రావడం లేదు. బ్యాంక్‌ల చుట్టూ రోజూ తిరుగుతున్నా స్పందించడం లేదని చేనేత సంఘ నాయకులు చెప్తున్నారు.
కనిగిరి చేనేతలపై చిన్న చూపా...
జిల్లాలో చేనేత కార్మికులు చీరాల తర్వాత బేస్తవారిపేట, కనిగిరి ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం కనిగిరి ప్రాంతంలో 1500 మగ్గాలున్నా యి. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సుమారు 47 గ్రామాల్లో చేనేత కార్మికులు జీవిస్తున్నారు. దాదాపు 2వేలకు పై గా కుటుంబాలున్నాయి. 10 సొసైటీలకు సంబంధించి 2 వేల మంది సభ్యులు ఉన్న ట్లు అంచనా. వీరికి ఆర్థిక వనరులు, ప్రభు త్వ సహాయం లేక, బ్యాంక్ రుణాలు అందక నానా అవస్థలు పడుతున్నారు.
ప్రత్యామ్నాయ బాటలో చేనేతలు..
కనిగిరి ప్రాంతంలోని చేనేత కార్మికులు నూటికి 70 మంది ప్రత్యామ్నాయ కూలీలుగా మారి జీవిస్తున్నారు. ఇప్పటికే సగం మంది వలస బాటపట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. మరి కొంత మంది బేల్దారి పని, మట్టి పని, మిక్చర్ బండ్లను, ఐస్ బండ్లను వేసుకుంటూ బతుకు తున్నారు. దేవాంగనగర్, యడవల్లి, వాగుపల్లి గ్రామాల్లో చేనేతల గృహాలు వలసలతో ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
నేతన్నలపై చిన్న చూపు
Published Wed, Oct 16 2013 7:11 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
Advertisement
Advertisement