లిఫ్ట్‌లు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతున్నాయి. బహుళ అంతస్తులు ఉండే అపార్ట్‌మెంట్స్, షాపింగ్ మాల్స్‌లో సౌకర్యవంతం కోసం లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే వాటి వినియోగంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అక్కడక్కడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిపై పూర్తి అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పాతగుంటూరు : రాజధానిలోని రెండు జిల్లాల్లో జనాభా ఎంత పెరిగినా అందరికీ నివాసయోగ్యమైన అక్షయపాత్రలా మార్చినవి అపార్ట్‌మెంట్లే. వేల కుటుంబాలు తల దాచుకుంటున్నది ఈ బహుళ అంతస్తుల భవనాల్లోనే. అందరికీ కింద ఫ్లోర్లే దొరకవు గనుక పై అంతస్తుల్లోనైనా నివాసం తప్పనిసరి. అన్ని మెట్లు ఎక్కలేని వారిని రివ్వున పైకి చేర్చే లిఫ్ట్‌లు ఉండటంతో ఇక చింతే లేదు. అయితే అంతటి మేలు చేసే లిఫ్ట్ వినియోగంలో ఏ మాత్రం ఏమరుపాటు ఉన్నా ప్రాణాల మీదకు వచ్చేంత ప్రమాదాలు పొంచి ఉన్నాయనేది గమనించాల్సిన అంశం.
పలువురి మృతి..
ఈ నెల 3న లిఫ్ట్‌ల కారణంగా ఇరువురు మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కొంతకాలంగా మరమ్మతులకు గురైన విషయం తెలియక డోర్ తెరుచుకుని ఉన్న ఖాళీ లిఫ్ట్‌లోకి వెళ్లి ప్రమాదానికి గురై వ్యక్తి మృతి చెందాడు. అలాగే, ప్రకాశం జిల్లా చీరాలలో మొదటి గేటు వేసి రెండో గేటు మూసే క్రమంలో మరో వ్యక్తి లిఫ్ట్ బటన్ నొక్కడంతో అది పైకి వెళ్లడంతో గేటుకు గోడకు మధ్యలో తల ఇరుక్కుపోవడంతో అతని తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు నెలల క్రితం నగరంలోని ఓ జిమ్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన హీరో నిఖిల్ గ్రిల్ లిఫ్ట్‌లో అంతరాయం ఏర్పడడంతో సుమారు 20 నిమిషాల పాటు ఇరుక్కు పోయారు. గ్రిల్స్‌ను తొలగించడంతో హీరో సుక్షితంగా బయటకు వచ్చిన ఘటన జరిగింది. ఇలాంటి ఘటనలు దాదాపు అపార్ట్‌మెంట వాసులందరికి ఓ హెచ్చరిక లాంటివి. ప్రతి ఒక్కరూ తమ భవనాల్లోని లిఫ్ట్‌ల నిర్వహణ ఎలా ఉందో తరచూ చూసుకోవాల్సి తరుణమిది. ప్రస్తుతం మూడు రకాల లిఫ్ట్‌లు వినియోగంలో ఉన్నాయి.
1–గ్రిల్స్ లిఫ్ట్ : ఈ లిఫ్ట్‌కు ఉన్న రెండు డోర్లు గ్రిల్‌తో రూపొందించడంతో గాలి, వెలుతురు ఉంటుంది. రెండు డోర్లు లాక్ అయిన తర్వాత కిందకైనా పైకి అయినా మూవ్ అవుతుంది. సరిగా లాక్ అవకపోతే హెచ్చరిస్తుంది. పిల్లలు గ్రిల్‌లో చేతులు పెట్టి ప్రమాదాలకు గురవుతున్న కారణంగా ప్రస్తుతం వీటి డిమాండ్ తగ్గింది.
2–ఆటోమేటిక్ డోర్ లాక్ లిఫ్ట్ : ఈ లిఫ్ట్‌కు లోపల గ్రిల్ ఉంటే బయట ఆటోమేటిక్‌గా దానంతట అదే మూసుకుపోయే డోర్ ఉంటుంది. లోపల డోర్ లాక్ అయిన వెంటనే ఇది కూడా లాక్ అవుతుంది. ప్రస్తుతం ఈ లిఫ్ట్‌ల వినియోగం అధికంగా ఉంది. గాలీ, వెలుతురు తక్కువగా ఉంటుంది. కరెంట్ పోయినపుడు రన్నింగ్‌లో ఉన్న లిఫ్ట్ ఆగిపోతే చీకటిమయమవుతుంది. అందులో ఉన్నవారు ఇబ్బంది పడకముందే జనరేటర్ ఆన్‌చేసి లిఫ్ట్ పని చేసేలా చూడాలి. జనరేటర్ పని చేయకపోతే మాత్రం కష్టం. కొత్తగా నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లలో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. అపార్ట్‌మెంట్ నిర్మాణంలో ఉండగానే కొందరు తాత్కాలికంగా లిఫ్ట్‌ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది సరైన విధానం కాదు. పూర్తిస్థాయిలోనే లిఫ్ట్ ఏర్పాటు చేసుకోవాలి.
3–స్ప్రింగ్ డోర్ లిఫ్ట్ : ఈ లిఫ్ట్‌లను ఆస్పత్రులు, పెద్ద పెద్ద హోటళ్లలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటి డోర్లు తాము చేరవలసిన అంతస్తు రాగానే వాటంతట అవే తెరుచుకుంటాయి. లోపలికి వెళ్లగానే డోర్లు మూసుకుంటాయి. వీటి నిర్వహణకు లిఫ్ట్ బాయ్ ఎల్ల పుడూ అందుబాటులో ఉంటాడు. అతనే ఆపరేట్ చేస్తాడు. వీటిలో అంతగా ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. అపార్ట్‌మెంటు లిఫ్ట్‌లు నలుగురు, ఐదుగురికి మాత్రమే పరిమితమైతే వీటిల్లో ఒకేసారి పదిమంది వరకు ఎక్కే వెసులుబాటు ఉంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
♦ లిఫ్ట్‌కు ఉన్న రెండు డోర్లు పూర్తిగా లాక్ కానిదే పని చేయదు. అలా లేకపోయినా పని చేస్తుందంటే అది పాడైనట్లు గుర్తించాలి.
♦ దయచేసి డోర్ లాక్ చేయండి.. వంటి రికార్డ్ చేసిన హెచ్చరిక వాఖ్యాలు లేదా బీప్ సౌండ్ లేకుండా లిఫ్ట్ పని చేసినా అది ఉపయోగించడం క్షేమం కాదు.
♦ లిఫ్ట్ సామర్థ్యానికి మించి ఎక్కువమంది ఎక్కినా మధ్యలోనే ఆగిపోవడం, త్వరగా చెడిపోవడం జరుగుతుంది.
♦ రెండు డోర్లు పూర్తిగా లాక్ అవకముందే తాము చేరుకోవలసిన లేదా దిగవలసిన అంతస్తు బటన్ నొక్కరాదు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే లిఫ్ట్ గమ్యాం చేరుకోకముందే ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుంది.
♦ పెద్దల తోడు లేకుండా పిల్లలను పంపించకూడదు. పిల్లలు దానిని ఆట వస్తువుగా భావించి, కిందకు, పైకి వెళ్లేందుకు పదే పదే లిఫ్ట్ బటన్‌లను వినియోగించడం వలన అది చెడిపోయే అవకాశం ఉంటుంది.
♦ ప్రతి నెలా లేదా కనీసం మూడు నెలలకు ఒకసారైనా లిఫ్ట్ సాంకేతిక నిపుణులతో సర్వీసు చేయిస్తే మంచి కండీషన్‌లో పని చేస్తుంది.
♦ పాడైన లిఫ్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించరాదు.
♦ అపార్ట్‌మెంట్‌లో నివసించే వారందరూ లిఫ్ట్ వినియోగంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి.
♦ లిఫ్ట్ వినియోగం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సాంకేతిక నిపుణులతో అవగాహన సదస్సులు నిర్వహించడం మంచిది.
మూడు నెలలకోసారి సర్వీసింగ్ తప్పనిసరి..
మేం అన్ని జాగ్రత్తలు తీసుకునే లిఫ్ట్‌లను ఫిట్ చేస్తాం. లిఫ్ట్ వినియోగానికి సంబంధించి బోర్డును లిఫ్ట్ బయట, లోపల అందరికి కనిపించేలా ఏర్పాటు చేస్తున్నాం. అయితే మూడునెలలకోసారైనా సర్వీసింగ్ చేయించాలి. ఏమైనా విడిభాగాలు పోతే వెంటనే వేయించాలి. – హర్షవర్ధన్, బిల్డర్, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment