సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం: శాసనసభ ఎన్నికలకు సంబంధించి ప్రతిసారి ఆ గ్రామం ప్రత్యేకంగా కనపడుతోంది. గతంలో ఎన్నికలను బాయ్‌కాట్ చేయడంతో స్వయంగా అధికారులే ఎన్నికలను జరిపారు. ఈ సారి కూడా తమకు న్యాయం చేయాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే వీటిని ఎన్నికల అధికారులు తొలగించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని శ్రీపురంధరపురం గ్రామానికి 1970లో శ్రీహరికోట (షార్) నుంచి 200 గ్రామాలు పునరావాసం కింద వచ్చాయి. ఆ సమయంలో వీరి భూములు, నివాసాలు మొత్తం తీసుకున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా శ్రీపురంధర పురంలో స్థలాలను, భూములను కేటాయిస్తామని తెలిపింది. అయితే వారికి భూముల విషయంలో న్యాయం జరగలేదని ఇప్పటి వరకు వారు పోరాడుతూనే ఉన్నారు.
ఎన్నికలు గ్రామంలో వద్దని..
2012 ఉప ఎన్నికల్లో శ్రీపురంధపురం గ్రామస్తులు ఎన్నికలను బాయ్‌కాట్ చేశారు. తమకు అన్యాయం జరిగిందని , అందుకే ఎన్నికలు తమ గ్రామంలో వద్దని చెప్పారు. దీంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి న్యాయం చేస్తామని, ఎన్నికలు ఉన్నందున ఇప్పుడు ఏమీ చేయలేమని చెప్పారు. గ్రామస్తులకు సర్దిచెప్పి ఎన్నికలు నిర్వహించారు.
న్యాయం చేసిన వారికే మద్దతు
తమకు ప్రతిసారి ఎన్నికల సమయంలో వాగ్దానం తప్ప న్యాయం జరగలేదని గ్రామస్తులు అంటున్నారు. ఈ మేరకు తాము ఓట్లను అమ్ముకోమని, జీఓ నంబరు 1024 ప్రకారం తమకు రావాల్సిన ఎకరా భూమి ఇప్పించదలచిన వారికే మా మద్దతు అని గ్రామంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం ఎన్నికల అధికారులకు తెలిసి దానిని తొలగించారు. అయితే గ్రామస్తులు మాత్రం తమకు న్యాయం చేసిన వారికే అండగా ఉంటామని అంటున్నారు.
ఎకరా భూమి ఇప్పించేవారికే మా మద్దతు
Published Sun, Mar 31 2019 9:23 AM | Last Updated on Sun, Mar 31 2019 2:57 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment