మండలంలోని మోపాడ సంతతోటలో శుక్రవార ం రాత్రి వివాహితపై జరిగిన సామూహిక లైంగికదాడి కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.
డెంకాడ: మండలంలోని మోపాడ సంతతోటలో శుక్రవార ం రాత్రి వివాహితపై జరిగిన సామూహిక లైంగికదాడి కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. అకృత్యానికి పాల్పడిన నిందితుల వివరాలు తెలుసుకోవటంలో వారు కొంతమేర పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలి పరిసరాల్లోని గ్రామానికి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం అందినట్టు తెలిసింది. విజయనగరంలో బాహుబలి సినిమా మొదటి ఆట చూశాక రాత్రి 9:30 గంటల సమయంలో ఎత్తు బ్రిడ్జి వద్ద ఓ భర్త తన భార్యను తగరపువలస వెళ్లే ఆటో ఎక్కించగా డ్రైవర్, మరో వ్యక్తి మోపాడ సంతతోటలోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ సంఘటన గురించి శనివారం తెలియటంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మోపాడ, కొండరాజుపేట తదితర గ్రామాలకు చెందిన మహిళలు జంక్షన్ వద్ద వాహనాలు దిగి నడుచుకుని వస్తుంటారు. సామూహిక లైంగికదాడి గురించి తెలియటంతో స్థానిక మహిళలు భయాందోళనకు గురయ్యారు. శనివారం మధ్యాహ్నం డెంకాడ పోలీసులకు ఫిర్యాదు అందిన వెంటనే భోగాపురం సీఐ కె.వైకుంఠరావు బాధితురాలిని సంఘటన స్థలానికి తీసుకుని వెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. విజయనగరం నుంచి బయలుదేరిన ఆటో స్టాండ్‌కు చెందినదైతే సీరియల్ ప్రకారం వెళతాయి కాబట్టి వివిధ స్టాండ్‌ల నిర్వాహకుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన ఆటోలు ఏమైనా వచ్చాయా అన్న అంశంపైనా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
బాధితురాలి నుంచి కూడా వివరాలు సేకరించారు. లైంగికదాడికి పాల్పడిన అనంతరం నిందితులిద్దరు ఆమెను వేరే ఆటో ఎక్కించారు. రెండో ఆటో డ్రైవర్ ఎవరో తెలుసుకుని అతడితో మాట్లాడితే నిందితుల వివరాలు తెలిసే అవకాశం ఉందన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులను పట్టుకోవటంతోపాటు వారికి కఠిన శిక్ష పడేలా చూసేందుకు తగిన శాస్త్రీయ ఆధారాలు సేకరించాల్సి ఉంది. ఆటో డ్రైవర్‌తోపాటు ఉన్న మరో వ్యక్తి ఎవరు? వారు మొదటి నుంచి పక్కా ప్రణాళికతో వ్యవహరించారా? లేదా జొన్నాడ ప్రాంతానికి వచ్చేసరికి ఆటోలో ఉన్న ప్రయాణీకులందరూ దిగిపోవటంతో వారిద్దరికీ దుర్మార్గ ఆలోచన పుట్టిందా? అన్న విషయాలు విచారణలో తేలాల్సి ఉంది. నిందితులను ఒకటి, రెండు రోజుల్లో పట్టుకుని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.