శ్రద్ధలో మరో కుట్రకోణం! | Sraddha Hospital Another Crime Reveals in Visakhapatnam | Sakshi
Sakshi News home page

శ్రద్ధలో మరో కుట్రకోణం!

Published Tue, Jun 4 2019 11:27 AM | Last Updated on Thu, Jun 6 2019 10:29 AM

Sraddha Hospital Another Crime Reveals in Visakhapatnam - Sakshi

శ్రద్ధ ఆస్పత్రి

సాక్షి, విశాఖపట్నం: కిడ్నీ రాకెట్‌కు కేంద్ర బిందువైన నగరంలోని శ్రద్ధ ఆస్పత్రి యాజమాన్యం ఆడిన మరో కుట్రకోణం బట్టబయలైంది. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. కిడ్నీ రాకెట్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ ప్రదీప్‌ పరారీలో ఉన్నాడు. పోలీసులకు దొరక్కుండా చాన్నాళ్లు తప్పించుకున్నాడు. ఈలోగా న్యాయవాదులు, సన్నిహితుల సలహాలతో వ్యూహాలు పన్నాడు. ఇందులో భాగంగా శ్రద్ధ ఆస్పత్రిని 2014లో మరొకరికి (తన వద్ద పనిచేసే వ్యక్తికి?) జీపీఏ రాసినట్టు తప్పుడు నోటరీ చేయించాలని నిర్ణయించాడు. ఈ బాధ్యతను నగరానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే న్యాయవాదికి అప్పగించాడు. వాస్తవానికి ఆయన కూడా నోటరీ న్యాయవాదే.

అయినప్పటికీ ఈ కిడ్నీ రాకెట్‌ కేసులో తానెక్కడ ఇరుక్కుంటానో అన్న భయంతో తనకు పరిచయం ఉన్న నాయుడు అనే మరో నోటరీని ఆశ్రయించాడు. పాత తేదీలతో శ్రద్ధ ఆస్పత్రిని మరొకరికి దారాదత్తం చేస్తూ జీపీఏ రాయించినట్టు నోటరీ చేయించాడు. అయితే శ్రద్ధ ఆస్పత్రిలో పోలీసులు నిర్వహించిన సోదాల్లో ఈ తప్పుడు జీపీఏ డాక్యుమెంటు బయటపడినట్టు సమాచారం. దీంతో సంబంధిత నోటరీ నాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు సంగతిని బయటపెట్టాడు. శ్రద్ధ ఆస్పత్రి నిర్వాహకులు తనకు బంధువులని, అందువల్ల నోటరీ చేయాలని కోరడంతో చేశానని, తనకు నోటరీ ఫీజు కూడా కేవలం రూ.400లే ఇచ్చాడని నాయుడు పోలీసుల విచారణలో కుండబద్దలు కొట్టాడు. అంతేతప్ప అంతకు మించి ఈ వ్యవహారంలో తనకేమీ తెలియదని చెప్పడంతో పోలీసులు అతడిని విడిచిపెట్టారు. శ్రద్ధ ఆస్పత్రి యాజమాన్యం నుంచి భారీగా సొమ్ము నొక్కేసి సుబ్రహ్మణ్యం ఈ పనికి పూనుకున్నాడని అనుమానిస్తున్నారు. ఇందులో నకిలీ జీపీఏకి సూత్రధారి సుబ్రహ్మణ్యాన్ని అదుపులోకి తీసుకోకపోవడం, అరెస్టు చేయక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనను మోసం చేశాడంటూ సుబ్రహ్మణ్యంపై న్యాయవాది నాయుడు ఫిర్యాదు చేసినా దానిని పోలీసులు తీసుకోవడం లేదని అంటున్నారు.

స్కెచ్‌ వెనక కథ ఇదీ..!
ఈ కిడ్నీ రాకెట్‌లో తన ప్రమేయం లేదని చెప్పేందుకు, అరెస్టు కాకుండా తప్పించుకునేందుకే శ్రద్ధ ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ ప్రదీప్‌ ఈ ఎత్తుగడ వేశాడు. జీపీఏ పొందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేస్తే అతను జైలులో ఉన్నంతకాలం అతడి కుటుంబాన్ని శ్రద్ధ యాజమాన్యం పోషించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. వ్యూహం బెడిసి కొట్టడంతో ప్రదీప్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement