
రైతు సమస్యలపై శ్రద్ధచూపాలి
నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
ఆత్మకూరు: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు శ్రద్ధచూపాల్సిన అవసరం ఉందని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండల సర్వసభ్య సమావేశం స్థానిక స్త్రీశక్తి భవన్‌లో బుధవారం ఎంపీపీ సిద్ధం సుష్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులు యూరియా కోసం జిల్లావ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యను అధిగమించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధచూపాలన్నారు.
జనవరిలోనే పలు గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొందని, ఈ సమస్య వేసవికాలం నాటికి మరింతగా తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందన్నారు. మూడేళ్లుగా వర్షాలు లేకపోవడంతో బొగ్గేరు ప్రవహించకపోవడంతో పలు ప్రాంతాల్లో పంటలకు సైతం నోచుకోలేదన్నారు. దీనిమూలంగా తాగునీటి కష్టాలు అధికమయ్యాయన్నారు. అధికారులు ఈ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. తాము కూడా జిల్లా కలెక్టరు, జిల్లా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం ఆర్థికంగా మన రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉండగా విద్యుత్ రంగంలో మాత్రం ప్రగతి సాధించిందన్నారు. జిల్లాలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా, మరో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కృషి జరుగుతుందన్నారు. రైతులకు 9 గంటల వరకు విద్యుత్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుందన్నారు. అన్ని గ్రామాల్లో స్వచ్ఛభారత్ ద్వారా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు.
అధికారులు రాజకీయాలకతీతంగా అన్ని సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. పీఎం, సీఎంలు దత్తత, స్మార్ట్‌గ్రామాలను రూపొందించడం మంచి పరిణామమన్నారు. రెండు, మూడు లక్షలతో ఏర్పాటు కానున్న సుజల స్రవంతి కూడా అన్ని గ్రామాల్లో విస్తరించేందుకు కృషిచేయాలన్నారు. గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి పరిచేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు.
జెడ్పీలోనూ నిధుల కొరత ఉంది: జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి
జిల్లా పరిషత్ సైతం లోటు బడ్జెట్‌లో ఉందని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు. మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తాను ప్రత్యేకంగా శ్రద్ధచూపుతానన్నారు. ఆత్మకూరు జెడ్పీటీసీసభ్యునిగా ఉన్నందునే జెడ్పీ చైర్మన్ అయ్యాయని, ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనులు చేశారనే అంశాన్ని ప్రతి ఒక్కరు అడుగుతారని, దీంతో ఈ నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తానన్నారు.
యూరియా కొరత బాగా ఉంది: ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి
ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ పదిరోజులుగా యూరియా కొరత ఉందని, దీనిని అధిగమించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వేసవిలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. అందరం కలిసిమెలసి పనిచేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో ఎంపీడీఓ నిర్మలాదేవి పాల్గొన్నారు.