శ్రీ వేంకటేశ్వర వైభవం
వైకుంఠం కదలివచ్చింది.. శ్రీనివాసం తరలివచ్చింది.. శ్రీహరిని నిదుర లేపి, నోరారా సుప్రభాతం పలికి, మనసారా అర్చించి, భక్తితో నివేదన సమర్పించే భాగ్యం విశాఖవాసులను వరించింది.. సహస్ర కలశాలతో విశేషంగా అభిషేకించి, సాయంవేళ వేయి దీపాలతో ఆరాధించి, రాత్రి ఏకాంత సేవతో స్వామిని నిద్ర పుచ్చే అపూర్వ అవకాశం లభించింది.. జన్మ ధన్యమైందంటూ భక్తులంతా పులకించిపోయారు. వేంకటేశ్వర వైభవాన్ని వీక్షించడానికి రెండు కళ్లూ చాలక.. ఆర్తిని మదినిండా నింపుకొని ఆనందబాష్పాలు రాల్చారు. తిరుమలలో జరిగే నిత్యసేవలు, విశేష పూజల్లో పాల్గొనే అదృష్టాన్ని భక్తులకు కల్పించాలన్న టీటీడీ సదాశయం ఫలించింది. తొలి రోజునే జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వేలాదిమంది స్వామిని దర్శించి తరించారు.
తిరుమలేశుని వైభవోత్సవాలకు విశాఖనగరం బుధవారం వేదికయింది. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. తిరుమలలో శ్రీనివాసునికి జరిగే నిత్యసేవల భాగ్యాన్ని భక్తులందరికీ దగ్గరగా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం..హిందూధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా వైభవోత్సవాలను విశాఖలో ప్రారంభించాయి. ఈనెల 29వ తేదీ వరకూ శ్రీనివాసుని ఉత్సవాలను నిర్వహిస్తారు. బుధవారం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో జరిగిన వైభవోత్సవాలలో భారీగా భక్తులు పాల్గొన్నారు. ఉదయం 5 గంటల నుంచి స్టేడియం వద్ద భక్తులు వందల సంఖ్యలో క్యూ కట్టారు.
ఉదయం 6 గంటలకు సుప్రభాతంతో స్వామివారి సేవలు ప్రారంభమయ్యాయి. అనంతరం తోమాలసేవ, అర్చనల్లో టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ దంపతులు పాల్గొన్నారు. ప్రతి బుధవారం ఉదయం 6 గంటలకు తిరుమలలో నిర్వహించిన మాదిరిగానే సహస్రకలశాభిషేకం నగరంలో అత్యంతవైభవంగా జరిపారు. శ్రీదేవి,భూదేవి సమేత శ్రీనివాసునికి అభిషేకం జరిపారు.
సాయంకాలం సహస్రదీపాలంకరణసేవ, మేళతాళాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ శ్రీవారి ఉత్సవ మూర్తులకు తిరువీధి నయనపర్వంగా ఊరేగింపు సాగింది. ఈ కార్యక్రమాల్లో ఏఓ రఘునాథ్, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, ప్రధాన అర్చకుడు గురురాజ్ స్వామి, ఫెస్టివల్ ఇన్‌చార్జ్ సురేంద్రరెడ్డి, ధర్మప్రచార పరిషత్ ఉపాధ్యక్షుడు రాంబాబు, టీటీడీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సహస్ర కలశాభిషేకం
తిరుమల నుంచి వచ్చిన అర్చక స్వాములు సహస్ర కలశాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేకంగా నిర్వహించే రోజువారీ సేవల్లో ఒకటైన ఈ కలశాభిషేకంలో 1200మంది దంపతులు పాల్గొన్నారు. తొలుత వేదికపై వడ్లు పరచి వాటిపై వెయ్యి కలశాలలో పవిత్ర జలాలు నింపారు. పసుపు, గంథం, పాలు, నెయ్యి, పంచదార, తేనెతో ఉత్సవ విగ్రహలకు అభిషేకించారు. అనంతరం అభిషేకం చేయించిన పవిత్ర జలాలను భక్తులపై జల్లారు. సేవ అనంతరం భక్తులు క్యూలో వెళ్లి వెంకన్నను దర్శించుకున్నారు.
అలౌకిక ఆనందం
భక్తులు పులకించారు.. తన్మయత్వంతో పరవశించారు.. తిరుమలలో శ్రీనివాసుని దర్శించిన విధంగా అలౌకిక ఆనందాన్ని అనుభవించారు. అసలే అది ఆనంద నిలయం. అక్కడ లభించేది మహదానందం. ఆ ఆధ్యాత్మిక ఝరిలో ఓలలాడిన భక్తజనం పులకింతకు లోనయ్యారు. ఏడు కొండలు ఎక్కి, వేంకటేశ్వర స్వామి సన్నిధికి చేరితే లభించే మధురానుభూతిని మనసారా అనుభవించారు. స్వర్ణభారతి ప్రాంగణంలో అడుగుపెట్టిన వెంటనే తొలుత వారిని భక్తి సంగీతం పలకరించింది. అన్నమయ్య కీర్తనలను ఆలకిస్తూ మైమరచిపోయారు. వేలాదిమంది భక్తులు సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు సాగిన వివిధ సేవల్లో పాల్గొన్నారు. సహస్ర కలశాభిషేకంలో పాల్గొనే భాగ్యం 1200మంది దంపతులకు లభించింది. స్వామివారికి కైంకర్యం చేసిన ప్రసాదాన్ని వారంతా అపురూపంగా స్వీకరించారు. సన్నాయి వాద్యాలు, మంత్రోచ్ఛారణల నడుమ ఎక్కడ చూసినా తిరుమల వాతావరణం కనిపించడంతో భక్తుల సంతోషానికి అవధులు లేవు. తిరుమల వెలుపల తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ సేవల్లో పాల్గొనే భాగ్యం దక్కినందుకు విశాఖవాసులుగా మురిసిపోయారు.
నేటి సేవ
తిరుప్పావడ
తిరుమలలో ప్రతి గురువారం శ్రీ వేంక టేశ్వరస్వామికి రెండవ అర్చనానంంతరం జరిగే సేవనే తిరుప్పావడ అని పిలుస్తారు. దీనినే అన్నకూటోత్సవం అంటారు. ఉదయం 6 గంటలకు స్వామివారి మూలవిరాట్‌కు ఉన్న ఆభరణాలను అన్నింటినీ తొలగిస్తారు. అనంతరం ఊర్వ్ధపుండ్రాన్ని కూడ బాగా తగ్గించి నేత్రాలు స్పష్టంగా కనిపించేలా చేస్తారు. తరువాత స్వామివారికి ఎదురుగా బంగారు వాకిలి ముందర కనిపించేలా చేస్తారు. అనంతరం భక్తులకు సేవతో పాటు శ్రీవారి
నేత్రదర్శనం పొందే అవకాశం కలుగుతుంది.