తిమ్మాపూర్, కరీంనగర్, న్యూస్‌లైన్ : దిగువ మానేరు జలాశయం(ఎల్‌ఎండీ) పూర్తిస్థాయిలో నిండడంతో గురువారం ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా విడుదల చేసిన 6 వేల క్యూసెక్కుల నీరు గురువారం మధ్యాహ్నం ఎల్‌ఎండీకి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టం 920 అడుగులు(24 టీఎంసీలు). ప్రస్తుతం ప్రాజెక్టులో 919.65 అడుగులు(23.372 టీఎంసీలు) నీరుండగా రిజర్వాయర్‌కు కాకతీయ కాలువతోపాటు వరద కాలువ ద్వారా ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో గురువారం సాయంత్రం 4.40 సమయంలో సీఈ శంకర్ పదో నంబర్ గేటు ఎత్తి రెండు వేల క్యూసెక్కుల నీటిని మానేరు నదిలోకి వదిలారు. ప్రస్తుతం వరద కాలువ ద్వారా ఆరు వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా రెండు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే శుక్రవారం మరో గేటు ఎత్తే అవకాశముంది. వరద కాలువ నుంచి వచ్చే నీటిని గంట గంటకు లెక్కించి గేట్లు తెరవడం, లేదా మూయడం చేస్తామని సీఈ తెలిపారు. కార్యక్రమంలో జీవీసీ 4 ఎస్‌ఈ రుక్మారెడ్డి, తహశీల్దార్ భుజంగరావు, ఈఈ గుణవంతరావు, డీఈఈ రాములు, ఏఈ కాళిదాసు, కేడీసీసీబీ డెరైక్టర్ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు అహ్మద్, బుచ్చయ్య తదితరులున్నారు.
మరో గేటు ఎత్తే అవకాశం
ఒక గేటు ఎత్తి మానేరుకు నీరు వదిలిన అధికారులు దిగువకు వెళ్లే కాకతీయ కాలువకు నీటి విడుదల గురువారం సాయంత్రం నిలిపివేశారు. ఓ యువకుడు ప్రమాదవశాత్తు కాలువలో గల్లంతు కాగా మృతదేహం వెలికితీసేందుకు నీటి విడుదల ఆపాలని పోలీసుల కోరడంతో నిలిపివేశారు. గతంలో కాలువ మరమ్మతు జరిగిన ప్రదేశంలో మట్టి కొట్టుకుపోవడంతో అక్కడ ఇసుక సంచులు వేయడానికి చర్యలు చేపట్టారు. శుక్రవారం ఇసుక సంచులు కాలువలో వేస్తామని చెప్పారు. ఆ తర్వాతనే నీటిని మళ్లీ దిగువకు వదులుతామన్నారు.
నీటిమట్టం పరిశీలనకు సెన్సార్‌బాల్స్
రిజర్వాయర్‌లో నీటి మట్టం పరిశీలనకు రిజర్వాయర్ ఇన్‌టేక్ వెల్ వద్ద సెన్సార్ బాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇన్‌ఫ్లో పెరగడంతో అలల తాకిడికి బయట నీటి మట్టం సరిగా అంచనా వేయలేకపోతున్నామని, అందుకే అలల తాకిడి ఉండని ఇన్‌టేక్ వెల్‌లో సెన్సార్ బాల్స్ ఏర్పాటు చేస్తే నీటి మట్టాన్ని సరిగ్గా అంచనా వేయడానికి వీలుంటుందని అధికారులు చర్చించారు. నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని, దీనికి అంచనా వేయాలని సీఈ శంకర్ సంబంధిత ఇంజినీర్లను ఆదేశించారు.
ఎల్‌ఎండీ గేటెత్తారు..
Published Fri, Aug 16 2013 4:04 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement