వేలూరు అపోలో ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్న శ్రీవాణి (ఇన్‌సెట్) శ్రీవాణి (ఫైల్ )
సాక్షి కడప : అనుకున్న లక్ష్యం కోసం.. అనుక్షణం పోరాటం చేస్తోంది.. ఇంటి కష్టాలు ఉద్యోగంతోనే దూరమవుతాయని భావించింది.. మూడేళ్లుగా పట్టుదలతో శ్రమిస్తోంది. ఇదే సమయంలో ఆమెను విధి వక్రించింది. అనుకోని జ్వరం కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పటికే ఎస్‌ఐ పరీక్షలో దేహదారుడ్య, ఇతర ప్రాథమిక పరీక్షలను నెగ్గిన ఆ యువతి.. ఈనెల 24వ తేదిన జరిగే మెయిన్ పరీక్షకు హాజరు కావాల్సిన పరిస్థితిలో తీవ్ర అనారోగ్యంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ప్రాణం కోసం పోరాడుతోంది. పులివెందులలోని నరసారెడ్డి పెట్రోలు బంకు సమీపంలో నివసిస్తున్న విద్యావతమ్మకు నలుగురు పిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు కాగా, ఒకరు బాబు. తండ్రి మృతి చెందడంతో అనీన్ తల్లే చూసుకుంటోంది.
పులివెందుల సమీపంలోని పాఠశాలలో పాఠాలూ చెబుతూ పిల్లలను చదివించుకుంటోంది. నాల్గవ సంతానమైన శ్రీవాణిని జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెట్టాలని బాగా చదివించింది. నంద్యాలలోని కోచింగ్ సెంటర్‌కు పంపింది. కోచింగ్ తీసుకుంటూ ఉద్యోగ వేటలో ఉన్న శ్రీవాణి?కి ఈనెల మొదటి వారంలో జ్వరం వచ్చింది. పులివెందులలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించాక కడపకు తరలించారు. కోలుకోలేదు. ప్రస్తుతం వేలూరులోని అపోలో ఆస్పత్రిలో శ్రీవాణి అపస్మారక స్థితిలో ఉంది. మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తీసుకు వెళ్లాలని వైద్యులు సూచించారు. యువతి ఊపిరితిత్తుల్లో కూడా ఇన్‌ఫెక్షన్ చేరింది. రూ. 10–15 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే రూ 3–4 లక్షలు ఖర్చు పెట్టారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో పాపను బతికించుకునేందుకు కుటుంబ సభ్యులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
దయార్థ హృదయులు దయతలిస్తేనే...
శ్రీవాణికి జీవితాన్ని ప్రసాదించాలని దయార్థ హృదయులను, మానవతా వాదులును కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. అంతో ఇంతో అయితే తాము పెట్టుకునే వారమని...బయట కూడా అప్పులు తెచ్చామని....స్థాయికి మించి లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడంతోనే తప్పని పరిస్థితుల్లో శ్రీవాణికి జీవితాన్ని ఇవ్వాలని కోరుతున్నామన్నారు. స్వచ్చంద సంస్థలు, మానవతా వాదులు, దాతలు ఆర్థికంగా చేయూతనందిస్తే శ్రీవాణికి పునర్జన్మ ప్రసాదించిన వారవుతారని తల్లి కన్నీరుమున్నీరవుతూ చెప్పింది. శ్రీవాణిని ఆదుకోవాలనుకుంటే ఎం.శ్రీ సాయిరాం, అకౌంట్ నెం. 36988129978, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ : ఎస్‌బీఐఎన్ 0000849, ఎస్‌బీఐకి ఆర్థికసాయాన్ని పంపించాలన్నారు. వివరాలకు శ్రీ సాయిరాంను 7416303974 నెంబరులో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment