
భీమవరం విద్యార్థుల వినూత్న ప్రయోగం
మాటలు వినే సోలార్ వీల్‌చైర్ తయారు చేసిన ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు
భీమవరం: మాటవిని మసలుకునే వారు దొరికితే కలిగే ఆనందం అంతాఇంతా కాదు. అది జీవిత భాగస్వామి అయినా.. చివరకు వీల్‌చైర్ అయినా అదే భావం. ఓ సోలార్ వీల్ చైర్ మన మాటలను వింటుంది. నడవమంటే నడుస్తుంది.. ఆగమంటే ఆగుతుంది.. వెనక్కి.. కుడి లేదా ఎడమ వైపునకు ఎలా కావాలంటే అలా తిరుగుతుంది. వికలాంగుల కోసం మాటల ఆధారంగా నడిచే సోలార్ వీల్‌చైర్‌ను భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేశారు.
మెకానికల్ ఇంజినీరింగ్ ఫైనలియర్ విద్యార్థులు నవ్య, ప్రసాద్, గీత, రాధ, రాజా దీనిని రూపొందించారు. చైర్‌కు ప్రత్యేక యాప్‌ను రూపొందించి.. బ్లూటూత్ ద్వారా పనిచేయిస్తున్నట్టు ఈ విద్యార్థులు తెలిపారు. దీని తయారీకి రూ.60 వేలు ఖర్చయిందని, ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రాజెక్ట్ కింద ఈ వినూత్న ప్రయోగం చేశామని వివరించారు. దీని పనితీరును కళాశాల ఆవరణలో ప్రదర్శించారు.