పశ్చిమగోదావరి, పాలకొల్లు అర్బన్: కావ్యేషు నాటకం రమ్యం. ఆ నాటకాన్ని రసవత్తరంగా, సందర్భోచితంగా, హాస్యభరితంగా, విషాదభరితంగా, నాటకాని రక్తి కట్టించి సమాజానికి ఒక సందేశమివ్వడంలో మహిళా కళాకారులు ముందు వరుసలో నిలుస్తున్నారు. పౌరాణిక నాటకంలో పద్యాన్ని ఆలపించడంలో సిద్ధహస్తులు, మాట పంపకంలో ప్రతిభావంతులు. గత నాలుగు దశాబ్దాలుగా రంగస్థలంపై రాణిస్తున్న కళా రమణులు. సుమారు 50, 60 ఏళ్ల క్రితం రంగస్థలంపైకి వచ్చిన నాటకాలను నేటికీ బతికిస్తూ వారు బతుకుతూ కళారంగానికి సేవలందిస్తున్న ఉభయగోదావరి జిల్లాలకు చెందిన నటీమణులు ఎందరో ఉన్నారు. మన జిల్లాకు చెందిన భీమవరం లక్ష్మి, లలితకుమారి(నరసాపురం), రమణ(తణుకు), బాలా ప్రవీణ(తణుకు), నాగమణి(తణుకు), రజని(తణుకు), రమ్యకృష్ణ(ఏలూరు), నాగమణి (టీపీగూడెం), అంజలి (దూబచర్ల), లలితా చౌదరి(ఏలూరు)పలు నాటకాలు, నాటికల్లో నటిస్తూ జీవం పోస్తున్నారు. వీరితో పాటు శ్యామల(రాజమండ్రి), అడబాల రమ (అమలాపురం)వీరితో పాటు రాజమండ్రికి చెందిన లతాశ్రీ,, కడపకు చెందిన రత్నశ్రీ, వనజ(అనంతపురం), గుడివాడ లక్ష్మి తదితరులు సుమారు 50 మంది మహిళా కళాకారులు నాటకాలను రక్తి కట్టిస్తున్నారు.
సత్య హరిశ్చంద్ర, బాలనాగమ్మ, మాయాబజార్, అల్లూరి సీతారామరాజు, మహిషాసురమర్దిని, శ్రీ కృష్ణ తులాభారం, బ్రహ్మంగారి జీవిత చరిత్ర, సాయిబాబా మహాత్మ్యం, భక్త ప్రహ్లాద, భక్త కన్నప్ప, యశోద కృష్ణ, రామ–రావణ యుద్ధం, గుళేబకావళి కథ, గయోపాక్యానం తదితర పౌరాణిక నాటకాలతో పాటు, చింతామణి, చిల్లరకొట్టు చిట్టమ్మ సాంఘిక నాటకాల ద్వారా వీరు పేరుపొందారు. నాటకం ఆడడం కోసం వీరు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ నాటకమే ఊపిరిగా జీవిస్తున్నారు.
నరసాపురం పట్టణానికి చెందిన కడలి లలిత కుమారి తల్లిదండ్రులు ఉప్పులూరి సూర్యనారాయణ– పద్మప్రియలు ఆర్టిస్టులు. వారి నుంచి వారసత్వంగా కళారంగంలో ఆమె అడుగుపెట్టారు. నా తల్లిదండ్రులకు నలుగురు ఆడపిల్లలు. అప్పటి ఆర్థిక పరిస్థితుల కారణంగా రంగస్థలంపై నాటకాలు వేయాల్సిన పరిస్థితి ఉండేదని, ఆ విధంగా రంగస్థలంపై స్థిరపడినట్టు చెప్పారు. ప్రస్తుతం అదే నాటకం తనను, తన ఇద్దరి ఆడపిల్లల్ని బతికిస్తోందని చెప్పారు. ఇప్పటికి 2 వేలకు పైగా ప్రదర్శనలిచ్చానని తెలిపారు. షార్ట్‌ఫిలింలు, సీరియల్స్‌లు పలు పాత్రలు పోషించిన ఈమెను అనేక అవార్డులు వరించాయి.
బీఎస్సీ నర్సింగ్ చేసి..
రాజమండ్రికి కళాకారిణి మక్కెల శ్యామల బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేశారు. రాజమండ్రి స్వతంత్ర ఆసుపత్రిలో ఆమె 10 ఏళ్లు నర్స్‌గా పనిచేశా. ప్రస్తుతం రాజమండ్రి ఫైనాన్స్ కంపెనీలో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈమె 15 ఏళ్లుగా రంగస్థల కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికి 1500లకు పైగా ప్రదర్శనలిచ్చానని తెలిపారు. 2015లో కర్నూలు నిర్వహించిన నంది నాటకోత్సవాల్లో శ్రీ కృష్ణ తులాభారం పద్యనాటకం ప్రదర్శించినందుకు ప్రశంసాపత్రం లభించిందని తెలిపారు.
30 సంవత్సరాలుగా రంగస్థలంపై..
తణుకు పట్టణానికి చెందిన మంగిన నాగమణి ఏడాది క్రితం గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అయినా నాటకం కోసం ఆరాట పడుతున్నారు. రంగస్థలంపై గత 30 ఏళ్ల నుంచి పౌరాణిక పాత్రలు పోషిస్తున్నారు. సత్య హరిశ్చంద్ర నాటకంలో తొలిసారిగా హరిశ్చంద్రుడు వేషం కట్టి మగ కళాకారులను మైమరిపించే విధంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఏడాది నుంచి గుండె ఆపరేషన్ చేయించుకున్న కారణంగా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.
నంది నాటకాత్సోవాల్లో ప్రతిభ
ఏలూరుకు చెందిన తాళ్లూరి జయశ్రీ(రమ్యకృష్ణ) రంగస్థలంపై 25 ఏళ్ల నుంచి అనేక ప్రదర్శనలిస్తున్నారు. బెబ్బులి, నిప్పురవ్వలు, కథా నాయకుడు, ప్రేమ సంకెళ్లు, పూలరంగడు, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం తదితర నాటకాలతో ప్రసిద్ధిపొందారు. నెల్లూరులో నిర్వహించిన నంది నాటకోత్సవాల్లో కాంస్య నంది వరించింది. ప్రభుత్వం కళాకారులను గుర్తించి ఏటా ఆర్థిక సత్కారాలు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment