Stage artist
-
మగధీరగా మహిళ.. ‘ఏం నటిస్తున్నావయ్యా బాబూ’!
స్త్రీ పాత్రను పురుషులు వేసి మెప్పించడం సహజమే.. హావభావాలతోపాటు గాత్రం కూడా మారుతుంది. కానీ స్త్రీలకు అలా కాదు.. గాత్రాన్ని మగ గొంతుగా మార్చడం కష్టం. సాంఘిక నాటకాలంటే ఎలాగో ఆ గంట, రెండు గంటలు మేనేజ్ చేయవచ్చు. కానీ పౌరాణికంలో చాలా కష్టం. ఎందుకంటే పద్యాలు.. రాగాలాపనలు కొద్ది నిమిషాలపాటు సాగుతుంటాయి. ఇంతటి క్లిష్టమైన రంగంలో రాణిస్తూ తన ప్రతిభను చాటుకుంటోంది జిల్లాకు చెందిన మంగాదేవి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఇక్ష్వాకు వంశ చక్రవర్తి... సత్యాన్ని జీవిత లక్ష్యంగా భావించిన మహారాజు సత్యహరిశ్చంద్రుడు. ఈయన జీవితం ఆదర్శనీయం.. మార్గం అనుసరణీయం. అటువంటి హరిశ్చంద్రుడి జీవితగాథ సినిమాగా, నాటకంగా దేశ వ్యాప్తంగా ఎందరినో ప్రభావితం చేయగా... మన రాష్ట్రంలో వీటితోపాటు హరికథగా, బుర్రకథగా ప్రాముఖ్యత సంపాదించింది. అన్నింటా హరిశ్చంద్ర పాత్రను పురుషులే పోషించగా తొలిసారి ఓ మహిళ ఈ పాత్రను పోషించి మెప్పిస్తున్నారు. వేదిక ఏదైనా మగవారి పాత్రల్లో ఇమిడిపోతున్నారు. తాను స్త్రీననే సందేహం కూడా ఎవరికీ రాకుండా చక్కని గాత్రం, హావభావాలతో ఆహూతుల ప్రశంసలు అందుకుంటున్నారు. నాటక రంగం నుంచి అంచెలంచెలుగా ఎదిగి వెండితెరకు తన ప్రయాణాన్ని సాగించి సినీ దర్శకులతో ‘ఔరా’ అనిపించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి.. రంగస్ధలంపై అర్జునుడు, హరిశ్చంద్రుడు, రాముడు, కృష్ణుడు తదితర పురుష పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె పేరు కె. మంగాదేవి. పడుచు పిల్లాడిని కాదు ఆడపడుచును... ఓ ఊరులో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. హరిశ్చంద్ర నాటకం మొదలయిది. ‘దేవీ కష్టము లెట్లున్నను... పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి’ అంటూ హరిశ్చంద్రుడు వేదిక మీదకు ప్రవేశించాడు. ఆకట్టుకునే ఆహార్యం.. ఖంగుమంటున్న కంఠం. స్పష్టమైన ఉచ్ఛారణతో నటనలో చెలరేగిపోతున్నాడు ఆ నటుడు.. నాటకం పూర్తయి చదివింపుల పర్వం మొదలైంది. పంచెలు కొనుక్కోమని హరిశ్చంద్రుడి పాతధారికి కట్నాలు సమర్పిస్తున్నారు. అప్పుడా పాత్రధారి మైకులో ‘మీ దీవెనలు నాకు... శ్రీరామరక్ష, మీ అభిమానమే కొండంత అండ.. మీరిచ్చిన డబ్బుతో పంచెలు కాదు, చీరెలు కొనుక్కుంటాను. నేను మీ ఆడపడుచున’ని ముగించడంతో జనం ఆశ్చర్యపోయారు. అప్పటికిగానీ హరిశ్చంద్రుని పాత్రను పోషించింది మహిళ అని వారికి తెలియలేదు. బాల్యం నుంచే... విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామానికి చెందిన 32 ఏళ్ల మంగమ్మ చదివింది పదో తరగతే అయినా 12 ఏళ్ల ప్రాయంలోనే పాఠశాలలో పద్యాలు పాడుతూ కూనిరాగాలు తీసేవారు. ఆమె అభిరుచి గమనించిన ఉపాధ్యాయులు ఆ దిశగా ప్రోత్సహించడం మొదలుపెట్టారు. మంగమ్మకు సత్యహరిశ్చంద్రుని పాత్రలో నటించడం ఇష్టమని గుర్తించిన కుటుంబీకులు తొలుత శ్రీకాకుళం జిల్లా పాలకొండ ప్రాంతానికి చెందిన పోతల లక్ష్మణ దగ్గర శిక్షణ కోసం చేర్పించారు. సత్య హరిశ్చంద్ర పౌరాణిక నాటకంలో చంద్రమతి పాత్రనే వేయాల్సిందిగా గురువు కోరినప్పటికీ సత్య హరిశ్చంద్రపాత్రనే ఏరికోరి ఎంచుకున్నారు మంగాదేవి. ఉత్తరాంధ్రలోనూ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఆమె గుర్తింపు పొందారు. అర్జునుడు, కృష్ణుడు, రాముడు పాత్రల్లో కూడా శభాష్ అనిపించుకున్నారు. యూట్యూబ్‌లో హరిశ్చంద్ర శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం, మందరాడ గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, పౌరాణిక రంగస్థల కళాకారులైన యడ్ల గోపాలరావు దర్శకత్వంలో సత్యహరిశ్చంద్ర సంపూర్ణ పద్య చలన చిత్రం రూపొందింది. దీనిలో హరిశ్చంద్ర పాత్రను మంగాదేవి పోషించారు. ఇటీవలే ఈ చిత్రాన్ని యూ ట్యూబ్‌లో విడుదల చేశారు. ఏం నటిస్తున్నావయ్యా బాబూ నన్ను మగవాడననుకుని ఏం నటిస్తున్నావయ్యా బాబూ అని అభినందిస్తుంటారు. తీరా ఆడపిల్ల అని తెలుసుకుని విస్మయానికి లోనవుతారు. మా నాన్న నన్ను మగపిల్లాడిలాగానే పెంచారు. రాజాలా బతకాలనేవారు. నా హరిశ్చంద్ర వేషం చూసి నిజంగా రాజాలాగానే ఉన్నావంటూ కన్నీరు పెట్టుకునేవారు. పన్నెండేళ్ల కిందట నేనో నాటకం వేస్తుంటే మా జిల్లాలోని బలిజిపేట మండలానికి చెందిన అరసాడ గ్రామవాసి సూర్యరావు నన్ను ఆశీర్వదిస్తూ చదివింపులు పంపించారు. తర్వాత అతడు ప్రతి ప్రోగ్రామ్‌కి వస్తుండేవారు. అలా మాటలు కలిశాయి. మనసులూ కలిశాయి, వివాహం చేసుకున్నాం. నాటకం నాకు బంగారంలాంటి భర్తను కూడా ప్రసాదించింది. నా కూతురు నా పాత్రలు చూసి నిన్ను అమ్మా అని పిలవాలా? నాన్నా అని పిలవాలా? అని అడుగుతుంటే నవ్వొస్తుంటుంది. – కె. మంగాదేవి -
రంగస్థల నటుడు ప్రకాష్‌రాజు మృతి
సాక్షి, తిరుపతి: నగరానికి చెందిన ప్రముఖ రంగస్థల నటుడు ప్రకాష్‌రాజ్(82) కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి కన్నుమూశారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా నాటక రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారు. అసెంబ్లీ రౌడీ, రాయలసీమ రామన్న చౌదరి చిత్రాల్లో నటించారు. అశోక్ సామ్రాట్, రాణా ప్రతాప్, పృధ్వీరాజ్, చాణక్య చంద్రగుప్త, విశ్వనాథ నాయకుడు, లేపాక్షి, అక్భర్ అంతిమ ఘడియలు నాటకాలు ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. చారిత్రక నాటకాలు ప్రదర్శించడంలో ఆయన తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 1977లో భవాని కళానికేతన్ నాటక సంస్థను ఏర్పాటు చేసి కళాకారులను ప్రోత్సహించారు. జిల్లాలోని కళాకారుల్లో ఎక్కువ శాతం మంది ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నవారే. అంతేకాకుండా తన నాటకాల్లో మహిళలకు పెద్ద పీట వేసి వారికి అవకాశాలు కల్పించారు. రియల్ హీరో, రంగస్థలి రారాజు, నాటక దర్శకరత్న బిరుదులు అందుకున్నారు. ప్రకాష్‌రాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మృతికి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, పలువురు కళాకారులు నివాళులర్పించారు. చదవండి: టాలీవుడ్లో విషాదం: పొట్టి వీరయ్య కన్నుమూత -
‘సీఎం వైఎస్ జగన్ మాత్రమే ఆదుకోగలరు’
కరోనా ఆడిన వింత ‘నాటకం’లో రంగస్థలం మూగబోయింది.. కోవిడ్–19 పోషించే విలన్ పాత్రకు ఎదురునిలవలేక కళాకారులంతా చిగురుటాకుల్లా వణుకుతున్నారు.. మహమ్మారి ధాటికి నిజ జీవిత పాత్రలుసైతం అర్ధంతరంగా ముగిసిపోతున్న తరుణంలో.. ఏం చేయాలో తెలియని ‘స్టేజి’లో కొట్టుమిట్టాడుతున్నారు.. వైద్యులు.. పోలీసులు వంటివారి ‘హీరో’చిత పోరాటం నెగ్గితేనే.. కళతప్పిన జీవితాల్లోకి మళ్లీ వెలుగులొస్తాయి.. ఈ యుద్ధంలో ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు.. శానిటైజర్లు.. సామాజిక దూరం వంటి ఆయుధాలు ధరిస్తేనే.. కరోనాను అంతమొందించి ‘విశ్వ’విజేతలవుతాం.. అంతవరకూ రంగస్థలానికి ‘విశ్రాంతి’ తప్పేలా లేదు. సాక్షి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కళలకు పుట్టిల్లు వంటి జిల్లాలో నేడు కళారంగం వెలవెలబోతోంది. ఉత్సవాలు లేక, పరిషత్‌లు జరగక కళాకారులు, కళాభిమానులు నిరుత్సాహంలో ఉన్నారు. మానవ మనుగడను ప్రశ్నార్థకం చేసిన కరోనా మహమ్మారి కళారంగాన్ని కూడా తిరోగమన బాట పట్టించింది. గతంలో సమాచార సాంకేతిక విప్లవ ప్రభావంతో కళారంగం కొంత తత్తరపాటుకు గురికాగా ప్రభుత్వాలతో పాటు కళాకారులు, కళాపోషకులు ఈ రంగాన్ని పూర్వ వైభవం వైపు నడిపే దిశగా చర్యలు తీసుకున్నారు. దీనితో ఇప్పుడిప్పుడే నేటి యువతలో కళారంగంపై మక్కువ పెరగడం, కొంతమంది యువకులు సైతం రంగం వైపు ఆకర్షితులు కావడంతో ఈ రంగానికి పూర్వ వైభవం వస్తోంది అనుకునే లోపు మరో పెద్ద కుదుపు కరోనా రూపంలో రావడం దురదృష్టకరమని కళాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిలిచిపోయిన పరిషత్‌లు, పోటీలు కళలపై సమాజ దృక్ఫథాన్ని మార్చే క్రమంలో వివిధ సంస్థలు కళారంగాన్ని ముందుకు నడిపించే బాధ్యతను తీసుకున్నాయి. దీని కోసం పరిషత్‌లు, పోటీలు ఏర్పాటు చేసి ఈ రంగాన్ని సజీవంగా నిలపడానికి తమ వంతు కృషి చేస్తున్నాయి. దీనితో కళాకారులకు కూడా ఆదరాభిమానాలు దండిగానే అందేవి. జిల్లాలో ఏటా పౌరాణిక, సాంఘిక నాటకాలతో పాటు ఏకపాత్రాభినయ పోటీలు ఎక్కడో ఒక చోట జరుగుతూ నిత్య కల్యాణం, పచ్చతోరణం చందంగా ఉండేది. జిల్లాలోని ఏలూరులో హేలాపురి కల్చరల్ అసోసియేషన్, గరికపాటి ఆర్ట్స్ కళా పరిషత్, వైఎంహెచ్ఏ హాలు పరిషత్, భీమవరంలో చైతన్య భారతి సంగీత నృత్య నాటిక పరిషత్, కళారంజని నాటక పరిషత్, పాలకొల్లులో పాలకొల్లు కళా పరిషత్, వీరవాసరం కళా పరిషత్, తోలేరు సుబ్రహ్మణ్య కళా పరిషత్, రాయకుదురు శ్రీ కృష్ణదేవరాయ నాటక కళా పరిషత్, కొంతేరు యూత్‌క్లబ్ కళా పరిషత్, తాడేపల్లిగూడెం బీవీఆర్ కళాపరిషత్ తదితర సంస్థలు పోటీలు నిర్వహిస్తూ కళారంగాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. అలాగే నృత్య రంగానికి సంబంధించి ఏలూరు నగరంలోని అభినయ నృత్య భారతి వంటి సంస్థలు వివిధ శాస్త్రీయ నృత్య రీతుల్లో పోటీలు నిర్వహిస్తూ నృత్య రంగాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళుతున్నాయి. వీటిలో కొన్ని సంస్థలు నిర్వహించే పోటీలు కరోనా కాలంలో రద్దు కాగా మరికొన్ని నిర్వహించే అవకాశం ఉంటుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నాయి. దీనితో పాటు గతంలో శ్రీరామనవమి, ఉగాది వేడుకలు నిస్సారంగా జరిగిపోగా త్వరలో వచ్చే వినాయక చవితి, దసరా ఉత్సవాల్లోనైనా అవకాశాలు అందివస్తాయని భావించిన కళాకారులకు కరోనా మహమ్మారి ఇప్పటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా ఉత్సవాలను కూడా రద్దు చేసే అవకాశం ఉండడంతో ఉత్సవ కమిటీలు కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసే అవకాశం లేకుండా పోయింది. ఆ విధంగా ఆయా ఉత్సవాలు కూడా వారిని నిరుత్సాహానికి గురిచేశాయి. కళారంగంపై ఆధారపడిన వేల కుటుంబాలు జిల్లాలో కళారంగంపై కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. పౌరాణిక, సాంఘిక, జానపద నాటకాలు, కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు, హరికథలు, బుర్ర కథలు వంటి కళలు ప్రదర్శించే కళాకారులతో పాటు వాటికి అనుబంధంగా మేకప్, సంగీతం, రంగాలంకరణ, సౌండ్ సిస్టమ్, మైక్ అండ్ లైటింగ్, దుస్తులు అద్దెకిచ్చే వారు ఇలా అనేక వర్గాలు ఉపాధి పొందుతున్నాయి. కరోనా లాక్డౌన్ కారణంగా కళారంగానికి అనుబంధంగా ఉపాధి పొందుతున్న అన్ని కుటుంబాలూ పూర్తిగా తమ ఆదాయ వనరులను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయాయి. పింఛన్ల మంజూరుతో కొద్దిగా ఊరట ఇదిలా ఉండగా ఐదు నెలలుగా పింఛన్లు లేక గోరుచుట్టపై రోకలిపోటు చందంగా ఇబ్బంది పడుతున్న వృద్ధ కళాకారులకు ప్రభుత్వం ఒకే సారి ఐదు నెలల బకాయి పింఛన్లు విడుదల చేయడంతో కొంత ఊరట లభించిందనే చెప్పాలి. అయితే ఇది కేవలం వృద్ధ కళాకారులకు మాత్రమే రావడంతో 60 ఏళ్లలోపు వయసు కలిగిన కళాకారులు మాత్రం ఇప్పటికీ ఆకలిదప్పులతో అలమటిస్తూనే ఉన్నారు. సకల కళాకారుల సంఘం, మరికొన్ని కళా సంస్థలు, కొంతమంది దాతలు కళాకారులకు నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు వంటివి పంపిణీ చేసినా అది తాత్కాలిక ఊరటగానే చెప్పుకోవాలి. కరోనా విలయ తాండవం నేపథ్యంలో కళాకారులను ఆదుకోవడానికి మరింత మంది కళాపోషకులు ముందుకు వస్తారనే ఆశతో కళాకారులు ఎదురు చూస్తున్నారు. ఆదాయం ఉన్నా లేకపోయినా ఆత్మగౌరవంతో జీవిస్తున్న వారి కుటుంబాలు పస్తులుంటున్న నేపథ్యంలో అభిమానాన్ని చంపుకుని కూలి పనులకు వెళ్లేందుకూ కొంతమంది కళాకారులు వెనుకడుగు వేయడం లేదు. అయితే వారికి పని ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కొన్ని కుటుంబాలు ఇప్పటికీ దుర్బర పరిస్థితులనే ఎదుర్కొంటున్నాయి. వివిధ రంగాలకు చెందిన వారిని పలువురు దాతలు ఆదుకుంటున్నట్లుగానే కళాకారులను, కళారంగంపై ఆధారపడి జీవిస్తున్న వారిని ఆదుకోవాలని కొన్ని కళా సంస్థలు పిలుపునిచ్చాయి. దానిపై దాతలు స్పందించాల్సి ఉంది. సీఎం జగన్ మాత్రమే ఆదుకోగలరు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 12 లక్షల కళాకారుల కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ కేవలం కళను నమ్ముకునే జీవిస్తున్నాయి. కరోనా కారణంగా దాదాపు ఏడాది చివరి వరకూ ప్రదర్శనలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే మా కళాకారుల కుటుంబాలను ఆదుకోగలరు. –విజయ కుమార్, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రధారి కరోనా వైరస్ కళాకారులకు మైనస్ కరోనా వైరస్ కళాకారులను మైనస్‌లో పడేసింది. 55 ఏళ్ల వయసు కలిగిన నేను చిన్నప్పటి నుంచి రంగస్థలాన్ని నమ్ముకుని జీవిస్తున్నాను. తొలుత భజనలు, అనంతరం నాటకాల్లో పాత్రలు, సంగీతం, హార్మోనియం వంటి కళలు నేర్చుకుని బుర్రకథ కళాకారుడుగా స్థిరపడ్డాను. 45 ఏళ్లకు పైగా కళారంగంలో ఉంటున్న నేను ఇంతటి సంక్షోభాన్ని ఎన్నడూ చూడలేదు. –యడవల్లి సుబ్బరాజు, బుర్రకథ కళాకారుడు ఆస్తులు లేవు, ఇతర పనులు చేతకాదు నా వయస్సు 46 సంవత్సరాలు. గత 30 ఏళ్లుగా హార్మోనిస్టుగా నాటక రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్నాను. పెద్దలు సంపాదించిన ఆస్తులు లేవు. వేరే ఏ పనీ చేతకాదు. ప్రదర్శనలు లేక ఆదాయం పోయింది. పెన్షన్‌కు సరిపడే వయసూ రాలేదు. అన్ని రంగాలనూ ఆదుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ కళాకారులకు కూడా ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలి. –యడవల్లి రమణ, హార్మోనిస్టు -
'నటి'విశ్వరూపం
పశ్చిమగోదావరి, పాలకొల్లు అర్బన్: కావ్యేషు నాటకం రమ్యం. ఆ నాటకాన్ని రసవత్తరంగా, సందర్భోచితంగా, హాస్యభరితంగా, విషాదభరితంగా, నాటకాని రక్తి కట్టించి సమాజానికి ఒక సందేశమివ్వడంలో మహిళా కళాకారులు ముందు వరుసలో నిలుస్తున్నారు. పౌరాణిక నాటకంలో పద్యాన్ని ఆలపించడంలో సిద్ధహస్తులు, మాట పంపకంలో ప్రతిభావంతులు. గత నాలుగు దశాబ్దాలుగా రంగస్థలంపై రాణిస్తున్న కళా రమణులు. సుమారు 50, 60 ఏళ్ల క్రితం రంగస్థలంపైకి వచ్చిన నాటకాలను నేటికీ బతికిస్తూ వారు బతుకుతూ కళారంగానికి సేవలందిస్తున్న ఉభయగోదావరి జిల్లాలకు చెందిన నటీమణులు ఎందరో ఉన్నారు. మన జిల్లాకు చెందిన భీమవరం లక్ష్మి, లలితకుమారి(నరసాపురం), రమణ(తణుకు), బాలా ప్రవీణ(తణుకు), నాగమణి(తణుకు), రజని(తణుకు), రమ్యకృష్ణ(ఏలూరు), నాగమణి (టీపీగూడెం), అంజలి (దూబచర్ల), లలితా చౌదరి(ఏలూరు)పలు నాటకాలు, నాటికల్లో నటిస్తూ జీవం పోస్తున్నారు. వీరితో పాటు శ్యామల(రాజమండ్రి), అడబాల రమ (అమలాపురం)వీరితో పాటు రాజమండ్రికి చెందిన లతాశ్రీ,, కడపకు చెందిన రత్నశ్రీ, వనజ(అనంతపురం), గుడివాడ లక్ష్మి తదితరులు సుమారు 50 మంది మహిళా కళాకారులు నాటకాలను రక్తి కట్టిస్తున్నారు. సత్య హరిశ్చంద్ర, బాలనాగమ్మ, మాయాబజార్, అల్లూరి సీతారామరాజు, మహిషాసురమర్దిని, శ్రీ కృష్ణ తులాభారం, బ్రహ్మంగారి జీవిత చరిత్ర, సాయిబాబా మహాత్మ్యం, భక్త ప్రహ్లాద, భక్త కన్నప్ప, యశోద కృష్ణ, రామ–రావణ యుద్ధం, గుళేబకావళి కథ, గయోపాక్యానం తదితర పౌరాణిక నాటకాలతో పాటు, చింతామణి, చిల్లరకొట్టు చిట్టమ్మ సాంఘిక నాటకాల ద్వారా వీరు పేరుపొందారు. నాటకం ఆడడం కోసం వీరు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ నాటకమే ఊపిరిగా జీవిస్తున్నారు. నరసాపురం పట్టణానికి చెందిన కడలి లలిత కుమారి తల్లిదండ్రులు ఉప్పులూరి సూర్యనారాయణ– పద్మప్రియలు ఆర్టిస్టులు. వారి నుంచి వారసత్వంగా కళారంగంలో ఆమె అడుగుపెట్టారు. నా తల్లిదండ్రులకు నలుగురు ఆడపిల్లలు. అప్పటి ఆర్థిక పరిస్థితుల కారణంగా రంగస్థలంపై నాటకాలు వేయాల్సిన పరిస్థితి ఉండేదని, ఆ విధంగా రంగస్థలంపై స్థిరపడినట్టు చెప్పారు. ప్రస్తుతం అదే నాటకం తనను, తన ఇద్దరి ఆడపిల్లల్ని బతికిస్తోందని చెప్పారు. ఇప్పటికి 2 వేలకు పైగా ప్రదర్శనలిచ్చానని తెలిపారు. షార్ట్‌ఫిలింలు, సీరియల్స్లు పలు పాత్రలు పోషించిన ఈమెను అనేక అవార్డులు వరించాయి. బీఎస్సీ నర్సింగ్ చేసి.. రాజమండ్రికి కళాకారిణి మక్కెల శ్యామల బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేశారు. రాజమండ్రి స్వతంత్ర ఆసుపత్రిలో ఆమె 10 ఏళ్లు నర్స్‌గా పనిచేశా. ప్రస్తుతం రాజమండ్రి ఫైనాన్స్ కంపెనీలో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈమె 15 ఏళ్లుగా రంగస్థల కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికి 1500లకు పైగా ప్రదర్శనలిచ్చానని తెలిపారు. 2015లో కర్నూలు నిర్వహించిన నంది నాటకోత్సవాల్లో శ్రీ కృష్ణ తులాభారం పద్యనాటకం ప్రదర్శించినందుకు ప్రశంసాపత్రం లభించిందని తెలిపారు. 30 సంవత్సరాలుగా రంగస్థలంపై.. తణుకు పట్టణానికి చెందిన మంగిన నాగమణి ఏడాది క్రితం గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అయినా నాటకం కోసం ఆరాట పడుతున్నారు. రంగస్థలంపై గత 30 ఏళ్ల నుంచి పౌరాణిక పాత్రలు పోషిస్తున్నారు. సత్య హరిశ్చంద్ర నాటకంలో తొలిసారిగా హరిశ్చంద్రుడు వేషం కట్టి మగ కళాకారులను మైమరిపించే విధంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఏడాది నుంచి గుండె ఆపరేషన్ చేయించుకున్న కారణంగా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. నంది నాటకాత్సోవాల్లో ప్రతిభ ఏలూరుకు చెందిన తాళ్లూరి జయశ్రీ(రమ్యకృష్ణ) రంగస్థలంపై 25 ఏళ్ల నుంచి అనేక ప్రదర్శనలిస్తున్నారు. బెబ్బులి, నిప్పురవ్వలు, కథా నాయకుడు, ప్రేమ సంకెళ్లు, పూలరంగడు, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం తదితర నాటకాలతో ప్రసిద్ధిపొందారు. నెల్లూరులో నిర్వహించిన నంది నాటకోత్సవాల్లో కాంస్య నంది వరించింది. ప్రభుత్వం కళాకారులను గుర్తించి ఏటా ఆర్థిక సత్కారాలు చేయాలి. -
వెతుక్కుంటూ వచ్చిన ఎన్టీఆర్ పాత్ర
సాక్షి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రంగస్థలంపై ఆయనను ఎవరైనా చూస్తే అరే ఎన్టీఆర్ గానీ వచ్చాడా అనుకునేవారు. ఎన్టీఆర్ పోలికలతో పాటు నటనా చాతుర్యం కూడా ఆయన సొంతం. సరదాగా నాటకాల రిహార్సల్స్ చూడటానికి వెళ్లిన యువకుడు వాటిపై ఆసక్తితో తానూ నాటక రంగంలోకి అడుగుపెడతానని అనుకోలేదు. వెళ్లినా నటునిగా 45 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం కొనసాగిస్తానని ఊహించలేదు. 1975లో తొలిసారి ముఖానికి రంగు వేసుకున్న ఆ యువకుడు ఇప్పటివరకూ రంగస్థలంపై తన సత్తా చాటుతూనే ఉన్నారు. పౌరాణికం, జానపదం, సాంఘికం అనే తేడా లేకుండా వందలాది పాత్రలు, వేలాది నాటకాలు ఆడుతూ రంగస్థలంపై అలుపెరుగని ప్రస్థానం కొనసాగిస్తున్నారు నగరానికి చెందిన పస్తుల విజయ్‌కుమార్. కుస్తీ, శరీర సౌష్టవాల్లోనూ సత్తా విజయ్‌కుమార్ 1951లో ఏలూరులో జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా దాదాపు ఏలూరులోనే కొనసాగింది. యువకునిగా ఉండగా నగరంలోని కోరాడ నాగన్న తాలింఖానాలో శరీర సౌష్టవంపై మరాఠీ మల్లేశ్వరరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. ఈక్రమంలో 1969లో సరదాగా కుస్తీ పోటీలు చూసేందుకు వెళ్లిన ఆయన ప్రత్యేక కారణాలతో పోటీల్లో పాల్గొనాల్సి వచ్చింది. కుస్తీలో ఎటువంటి మెలకువలు తెలియకపోయినా పోటీల్లో గెలిచి జిల్లా విజేత కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. అదేస్ఫూర్తితో శరీర సౌష్టవ అంశంలో మరింత శిక్షణ పొంది 1971లో మిస్టర్ సీఆర్ఆర్ కళాశాల, 1971 నుంచి 1973 వరకూ వరుసగా నాలుగేళ్ల పాటు మిస్టర్ పశ్చిమగోదావరిగా ఆయన నిలిచారు. అనంతరం ఆయన వ్యాపారావకాశం రావడంతో ఏలూరు విడిచి కొయ్యలగూడెం వెళ్లి స్థిరపడ్డారు. 1975లో రంగస్థల ప్రవేశం 1975లో తొలిసారి సాంఘిక నాటకంతో రంగస్థల అరంగేట్రం చేసిన విజయ్‌కుమార్ అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు. 45 ఏళ్లుగా వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. మొదట్లో ఏడాదికి 150 నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇప్పటివరకూ ఆయన దాదాపు 4,500 నాటకాలు ఆడి రికార్డు సృష్టించారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, హరిశ్చంద్రుడు, నారదుడు, దుష్యంతుడు, నహుష చక్రవర్తి వంటి పౌరాణిక పాత్రలు, వేలాది చారిత్రక, సాంఘిక పాత్రలు చేస్తూ, పలు జానపద పాత్రలు చేస్తూ తనలోని నటుడిని సంతృప్తి పరుస్తూ వస్తున్నారు. 1977లో విజయభారతి నాట్య మండలి సంస్థను ప్రారంభించి దాని ద్వారా అనేక ప్రదర్శనలు ఇవ్వడమే కాక తోటి కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. 3 నందులు.. 8 గరుడలు.. రంగస్థల యాత్రలో ఆయన కీర్తి కిరీటంలోకి నాటకరంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారంగా భావించే ప్రభుత్వ పురస్కారం నంది బహుమతులు మూడు వచ్చి చేరాయి. దీంతో పాటు తిరుపతికి చెందిన మరో ప్రతిష్టాత్మక సంస్థ గరుడ ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక పోటీల్లో పాల్గొన్న విజయ్‌కుమార్ వాటిలో ఎనిమిది సార్లు ఉత్తమ నటునిగా నిలిచి ఎనిమిది గరుడ అవార్డులు అందుకున్నారు. దీంతో పాటు నాటక రంగానికి చేసిన విశేష కృషికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఆయనను కందుకూరి పురస్కారంతో గౌరవించింది. ఇవికాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక పరిషత్‌ల్లో ఆయన ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. వెతుక్కుంటూ వచ్చిన ఎన్టీఆర్ పాత్ర విజయ్‌కుమార్ నట చరిత్రలో మైలురాయిగా నిలిచే పాత్ర ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చలన చిత్రంలో నందమూరి తారక రామారావు పాత్ర. దర్శకుడు రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం నిర్మించడానికి సిద్ధమైన తరుణంలో ఎన్టీ రామారావు పాత్ర కోసం దాదాపు 300 మందికి మేకప్‌లు వేయించి చూసినా ఆయనకు సంతృప్తి కలగలేదు. ఈ క్రమంలో విజయ్‌కుమార్ గురించి తెలిసిన వర్మ ఆయన్ను తన వద్దకు రప్పించుకుని ఆడిషన్లు పూర్తి చేసి ఎన్టీఆర్ పాత్రకు ఎంపిక చేశారు. షూటింగ్ ప్రారంభమైన 20 రోజుల్లో ఎన్టీఆర్ పాత్ర చిత్రీకరణ పూర్తిచేయడంలో విజయ్‌కుమార్ నటనా పటిమను గుర్తించిన వర్మ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఆ పాత్రకన్నా ముందే విజయ్‌కుమార్ సుమారు పది సినిమాల్లో వివిధ పాత్రలు పోషించి వెండితెరపై కూడా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. (చదవండి: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ) కళాకారుని కారణంగానే ప్రజాదరణ దూరం ప్రస్తుతం నాటకరంగానికి ప్రజాదరణ దూరం కావడానికి కళాకారుడే కారణం. పాత్ర ఔచిత్యం, పాత్ర గాంభీర్యం, ఆహార్యం, రంగాలంకరణ వంటి అంశాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజలు ఆకర్షితులు కాలేకపోతున్నారు. ఇటీవల నాటక రంగంలోకి దళారులు కూడా ప్రవేశించడంతో అసలైన కళాకారుడు నష్టపోతున్నాడు. ఆయా అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తే నాటకరంగానికి తిరిగి జవసత్వాలు వస్తాయి. – పస్తుల విజయ్‌కుమార్, రంగస్థల నటుడు -
40 ఏళ్లుగా రంగస్థలంపై ఆయనే రారాజు
వేషం వేస్తే అదుర్స్...నాయక, ప్రతినాయక పాత్రలకు ఆయనకు ఆయనే సాటి. ఆ నటనలో నవరస ప్రవాహాలు పరవళ్లు తొక్కుతాయి. సుస్పష్ట వాచకం, అనర్గళ సంభాషణా చాతుర్యం కలబోసిన శబ్దాలయం ఆయన సుస్వరం. చిన్నప్పటి నుంచి సాంఘిక, పౌరాణిక, నాటక రంగం అంటే ఎంతో ఆసక్తిని పెంచుకున్న ఆయన...50 రకాల వేషధారణలతో ఆ పాత్రలకు జీవం పోశారు. ధీర గంభీర రూపం, సవినయ భావ భంగిమలు, ఇత్యాది నట లక్షణాలతో ప్రేక్షకులను ఆనందరస తరంగ డోలికలలో ఓలలాడిస్తారు. ఆయనే ప్రముఖ రంగస్థల కళాకారుడు డాక్టర్ పిల్లుట్ల లక్ష్మీకాంత్‌శర్మ. వృత్తిరీత్యా నాచారంలోని భారత ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగిగా పని చేస్తూనే మరోవైపు నటనను ప్రవృత్తిగా మలచుకుని ప్రేక్షకులను రంజింపజేస్తున్నారు. గత 40 ఏళ్లుగా రంగస్థలంపై ప్రదర్శనలు ఇస్తూ నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాణిస్తూ ఎందరో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. సనత్‌నగర్: డాక్టర్ పిల్లుట్ల లక్ష్మీకాంతశర్మ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి పరిధిలోని వల్లభాపురం. రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయుక్త, రచయిత అయిన పొలమరశెట్టి ఫ్రాన్సిస్ స్ఫూర్తితో ఆయన రంగస్థలం వేదిక వైపు అడుగులు వేశారు. ఆయన శిష్యునిగా ఓనమాలు దిద్ది ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. నాటకరంగంపై ఆనాడు ఏర్పడ్డ అభిలాష ఇంతింతై వటుడింతై అన్నట్లుగా జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చి ఎందరో మహామహుల ప్రశంసలను అందుకున్నారు. కృషి, పట్టుదల, విషయ పరిజ్ఞానం, తన శారీర సౌష్టవానికి ఏ పాత్ర సరిపోతుందో ఆ పాత్రను ఎన్నుకోవడం, సంగీత దర్శకుని సలహా తూ.చ తప్పకుండా పాటిస్తూ క్రమశిక్షణతో నటిస్తున్నారు డాక్టర్ పిల్లుట్ల. నాటక రంగంలో తాను నేర్చుకున్న అనుభవాన్ని జోడిస్తూ నిరంతరం సాధన సంపత్తులతో పలు పద్య, సాంఘిక, పౌరాణిక, జానపద, టీవీ సీరియల్స్, సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ నాటక రంగంలో ఆయన సేవలను గుర్తించి బెంగుళూరులో డాక్టరేట్ ప్రదానం చేసింది. 500 ప్రదర్శనలు... 50 పాత్రలు డాక్టర్ పిల్లుట్ల ఏ వేషం వేస్తే ఆ పాత్రకు జీవం పోసినట్లేనని ప్రేక్షకులు చెప్పేమాట. తన నటనా కౌశలంతో ప్రేక్షకులను రంజింపజేయడమే కాదు..ఆ పాత్ర హుందాతనానికి తగ్గట్టుగా హావభావాలు పలికించడంలో మేటిగా ఎదిగారు. ఇప్పటివరకు సుమారు 500 ప్రదర్శనల్లో 50 రకాల వేషాలు వేసి రంగస్థల ప్రేమికుల మదిని దోచుకున్నారు. రంగస్థలం మీదనే కాకుండా సినిమా, సీరియల్స్‌లోను తనకు అందివచ్చిన పాత్రలకు న్యాయం చేసి డైరెక్టర్, నిర్మాతల ప్రశంసలనూ అందుకున్నారు. ప్రముఖ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ రచనలో కోకా విజయలక్ష్మి దర్శకత్వంలో ‘తెలుగు ప్రశస్తి’ విశిష్ట సంగీత నృత్యరూపకంలో శ్రీకృష్ణదేవరాయులు, గౌతమిపుత్ర శాతకర్ణిగా ద్విపాత్రాభినయం చేసి రక్తి కట్టించారు. ‘పాండవోద్యోగ విజయం’ నాటకంలో ధుర్యోధనుడు, బలరాముడు, కర్ణుడు, దుశ్శాసనుడి పాత్రలు, శ్రీవెంకటేశ్వర మహత్త్యంలో భృగమహర్షి, ఆకాశరాజుల పాత్రలు, సత్య హరిశ్చంద్ర నాటకం (కాటిసీన్)లో హరిశ్చంద్రుడి పాత్రల్లో ఒదిగిపోయారు. అదేవిధంగా బోయి భీమన్న రచనలో వచ్చిన ధర్మవ్యాధుడు నాటకంలో మహర్షిగా,ప్రసన్నయాదవంలో నరకాసురుడిగా, రుక్మిణీ కళ్యాణంలో శిశుపాలుడుగా, కాళహస్తీశ్వర సాయుజ్యంలో కిరాతుడు, శివుడి పాత్రలను, పార్వతీదేవి ఇల్లు కట్టిందిలో రావణాసురుడుగా, హిమవన్నగ దర్శనంలో చిత్రభానుడుగా, ఆంధ్ర కళా వైభవంలో తానీషాగా పాత్రధారణ చేసి ఔరా అన్పించారు. ఇవే కాకుండా వివిధ నాటకాలు, సినిమాల్లో భీముడు, విశ్వామిత్రుడు, శార్ధూరుడు, యమధర్మరాజు, బడే సాహెబ్ పాత్రలు వేశారు. ♦ నాటకాలు, సినిమాల పాత్రలే కాకుండా జానపద కళగా పేరొందిన బుర్రకథలో సైతం తన ప్రతిభను చాటుతున్నారు పిల్లుట్ల. పల్నాటి యుద్ధం, కొము రంభీం వంటి చారిత్రాక గాథలను బుర్రకథ కళా రూపంలో తీసుకువచ్చి నేటి తరానికి సందేశం అందించారు. ♦ నేటి తరానికి పద్యం అంటే తెలియని పరిస్థితి. ఆ పద్యం విలువను డాక్టర్ పిల్లుట్ల తెలియజేస్తూ ప్రదర్శనలు చేస్తున్నారు. ఎంతటి పెద్ద పద్యమైనా అనర్గళంగా తనదైన శైలిలో ప్రదర్శించి శ్రోతల మదిని దోచుకుంటున్నారు. కొత్త తరానికి వారధి వేస్తున్నా... పూర్వకాలంలో ఒక నాటకం వేస్తే ఎంతో అంకితభావంతో ప్రదర్శించేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండాపోయింది. పాతతరానికి, కొత్త తరానికి మధ్య వారధిగా నిలుస్తూ ఇప్పటి తరానికి నాటక రంగం గురించి తెలియజేసేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నా. ప్రభుత్వం కూడా నాటక రంగానికి ప్రాధాన్యతనిచ్చి కళాకారులను ప్రోత్సహిస్తే బాగుంటుంది.– డాక్టర్ పిల్లుట్లలక్ష్మీకాంతశర్మ -
సంప్రదాయ కళలకు జీవం పోస్తున్న కళాకారులు
సాక్షి, మంచిర్యాల : తెలంగాణ పల్లెలు ఓనాడు కళలకు నిలయాలు. ఆనాటి పాటలు, ఆటలు, బాలనాగమ్మ, భక్తసిరియాల, హరిచంద్ర, అల్లిరాణి నాటకాలు ప్రజలను ఎంతగానో ఆకర్షించేవి. ఆ కళాప్రదర్శనలు చూసేందుకు ఊరంతా ఒకచోటుకే చేరేవారు. పల్లెల్లో వాటికి ఆదరణ ఉండడంతో భాగవతాలు, యక్షగాణాలు, చిరుతల రామయాణాలు వంటి నాటికలు, భాగవత ప్రదర్శనలు జోరుగా ఉండేవి. ఎప్పుడైతే సినిమాలు, టీవీలు అందుబాటులోకి వచ్చాయో ఆనాటి పల్లెకళలు, నాటకాలు, భాగవతాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. నాటి కళలను ఈనాటి వారికి పుస్తకాల ద్వారానో, టీవీల ద్వారా చూపించే ఈ రోజుల్లో పల్లెకళలు ఇంకా బతికే ఉన్నాయిని చెబుతున్నారు దండేపల్లి మండలానికి చెందిన పలువురు కళాకారులు. మండలంలోని పలు గ్రామాల నుంచి.. దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి, వెల్గనూర్, కొర్విచెల్మ, కొండాపూర్, కాసిపేట, నంబాల, నర్సాపూర్ గ్రామాల్లో చాలా మంది కళాకారులు ఉన్నారు. వీరంతా భజన బృందాలుగా ఏర్పడి, ఇప్పటికీ పలు పండుగలు, పబ్బాలు, శ్రావణం, కార్తీక మాసాల్లో, మహశివరాత్రి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి పండుగల రోజుల్లో ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వీటితో పాటు గ్రామాల్లో పూజలు జరుపుకునే వారి ఇళ్లలో కూడా రాత్రి వరకు భజనలు చేస్తుంటారు. అంతేకాకుండా కృష్ణాష్టమి, దీపావళీ, శ్రీరామనవమి, శివరాత్రి పండుగలతో పాటు ఇతర పండుగల్లో సందర్భాన్ని బట్టి నాటికలు, భాగవతాలు, యక్షగాణాలు, చిరుతల రామాయణం వంటి కళాప్రదర్శనలు నేటికీ ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు దండేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అప్పుడప్పుడు నిర్వహిస్తుంటారు. వీటిని వీక్షించేందుకు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్లి ఆనాటి కళప్రదర్శనలు ప్రజలు ఆసక్తిగా తిలకిస్తూ మురిసి పోతున్నారు. పుణ్య క్షేత్రాల్లో భజనలకు.. గ్రామాల్లో గల భజన బృందాలు సాకాకుండా, తిరుమల, తిరుపతి, దేవస్థానాలు, భద్రాచలం, బాసర, కొండగట్టు, గూడెం, ఆలయల్లో నిర్వహించే భజన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా రవీంద్రభారతిలో నిర్వహించే సంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ తమ కళా ప్రదర్శనలు ప్రదర్శిస్తుంటారు. అప్పుడప్పుడు ప్రదర్శిస్తున్నం నేను నేర్చుకున్న నాటికలు, బాగవతాలను ఇప్పటికీ మా గ్రామంలో పలు పండుగ సమయాల్లో ప్రదర్శిస్తుంటాం. దీంతో ఇప్పటి వారికి ఆనాటి కళలను గుర్తు చేసిన వాళ్లం కావడంతో పాటు, పల్లె కళలు ఇంకా బతికే ఉన్నాయని తెలియజేస్తున్నం. మా గ్రామంలో చాలా మంది కళాకారులు ఉన్నారు. కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలి. – ముత్యం శంకరయ్య, రెబ్బనపల్లి -
కళాకారుల కడుపు కొట్టారు
సాక్షి, కడప : పండుగల సమయంలో శిల్పారామాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. పౌరసంబంధాలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఈ ప్రదర్శనలకు ఆ శాఖ అధికారులే పారితోషికం చెల్లిస్తారు. రెండేళ్లుగా గత ప్రభుత్వం దీన్ని కాంట్రాక్టు పద్ధతికి మార్చింది. స్థానిక కళాకారుల్లో ఒక ప్రముఖుడికి కళా బృందాల ఎంపిక, ప్రదర్శనల బాధ్యతలు అప్పగించారు. వారు జిల్లాలోని కళాకారులకు పారితోషికం చెల్లించేవారు. చెల్లింపులు కొద్దినెలలు బాగానే సాగాయి. రానురాను ఆలస్యమవుతూ వచ్చాయి. ‘ప్రభుత్వ సొమ్ము కదా..ఆలస్యంగానైనా వస్తుంది’ అన్న నమ్మకంతో కళాకారులు అప్పు చేసి పెట్టుబడి పెట్టి ప్రదర్శనలు ఇచ్చారు. క్రమంగా ప్రభుత్వం కళాకారులకు పారితోషికాలు ఎగ్గొట్ట సాగింది. గత సంక్రాంతి, దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శిల్పారామాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే బాధ్యతలను స్థానిక కళా ప్రముఖునికి అప్పగించారు. డబ్బులు రావని తెలిసి ముందు ప్రదర్శనలు ఇచ్చిన కళాసంస్థలు మరోమారు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. దీంతో కొత్త సంస్థలకు అవకాశం ఇచ్చారు. ఇంకో నెల ఆలస్యమైనా ప్రభుత్వం తప్పక నిధులు ఇస్తుందన్న ఆశతో ప్రదర్శనలు ఇచ్చారు. సాధారణంగా ప్రతి ప్రదర్శన తర్వాత శిల్పారామాల అధికారులు కళాబృందాలకు స్పాన్సర్ల ద్వారా అప్పటికప్పుడు పారితోషికం చెల్లిస్తుంటారు. మీ ప్రదర్శనలు ఆ విభాగంలోకి రావని ప్రభుత్వమే డబ్బు చెల్లిస్తుందని శిల్పారామం అధికారులు స్పష్టం చేశారు. ఈలోపు ప్రదర్శనల బాధ్యతలు తీసుకున్న కళా ప్రముఖులు ‘మీ బ్యాంకు అకౌంటు నంబరు ఇవ్వండి....ప్రభుత్వం నేరుగా మీ అకౌంటులోనే పారితోషికాలను జమ చేస్తుంది’ అని బ్యాంకు అకౌంట్ నంబర్లు తీసుకున్నారు. దీంతో ఒకనెల ఆలస్యమైనా డబ్బు తప్పక వస్తుందని కళాకారులు నమ్మారు. మేకప్, సంగీతం, రవాణా, భోజనాలు, వసతి డ్రస్సులు వెరసి ఒక్కొక్క సంస్థ రూ. 12–15 వేలు ఒక్కొక్క ప్రదర్శనకు ఖర్చు చేసింది. ఇలా ఐదారు రోజులపాటు రోజూ రెండు, మూడు సంస్థల ప్రదర్శనలు సాగాయి. పలు సంస్థలు సొంత ఖర్చులు పెట్టుకుని ప్రదర్శనలు ఇచ్చారు. శ్రమ, సమయం, అప్పు తెచ్చిన పెట్టుబడి, దానిపై చెల్లిస్తున్న వడ్డీ తడిసి మోపెడు కావడంతో కళాకారులు ఆవేదనకు లోనయ్యారు. డబ్బు ఎలా వస్తుందో? ఎవరిని అడగాలో తెలియక బాధపడుతున్నారు. అనవసరంగా అప్పుల్లో మునిగిపోయామంటూ వాపోతున్నారు. నిరుపేదలమైన తమను ప్రభుత్వమే మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి తావు లేని పాలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కొత్త ప్రభుత్వం తమ సమస్యను సానుభూతితో పరిష్కరిస్తుందని ఆశిస్తున్నారు.పార ఇది చంద్రన్న మోసం నిరుపేద కళాకారులమైన తమ కష్టానికి పారితోషికాన్ని ఎగ్గొట్టడం న్యాయం కాదు. ఆ ప్రభుత్వం తమకు రావాల్సిన మొత్తాలను ఇవ్వకుండా మోసం చేసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జోక్యం చేసుకుని న్యాయం చేస్తారన్న ఆశ ఉంది. – రాయుడు, సీనియర్ రంగస్థల కళాకారుడు, కడప కడుపు కొట్టొద్దు పనులు మానుకుని సొంత ఖర్చులతో ప్రదర్శనలు ఇచ్చాం. బిల్లులు రాకపోవడంతో వడ్డీల భారం పెరుగుతోంది. అసలు చెల్లించడం గురించిన ఆలోచన భయపెడుతోంది. నిరుపేదలమైన కళాకారుల కడుపుకొట్టిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదు. – సుబ్బరాయుడు, నటుడు, హార్మోనిస్టు, కడప -
రంగస్థల నటుడు బుర్రా కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: నాట్యాచార్య, అభినయ సరస్వతి, నాట్య మయూరిలాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న ప్రముఖ రంగస్థల నటులు, కవి, కావ్యరచయిత, వెండితెర, బుల్లితెరలపై సుపరిచితులయిన మహాకళాకారుడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి (83) లంగర్‌హౌస్‌లోని తన స్వగృహంలో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. స్త్రీ పాత్రధారణలో గొప్ప నటుడిగా కీర్తి గడించిన శాస్త్రి 1936లో జన్మించారు. ఆయనకు భార్య, ఆరుగురు పిల్లలు ఉన్నారు. శాస్త్రి అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం రాయదుర్గంలోని మహాప్రస్థానంలో నిర్వహించారు. ఆయనదీ ‘మహా ప్రస్థానమే’ 1936, ఫిబ్రవరి 9న కృష్ణాజిల్లా దివి తాలుకా కోడూరులో బుర్రా పద్మనాభ సోమయాజులు, సీతామహాలక్ష్మి దంపతులకు జన్మించిన ఈయన మేనమామ కోటేశ్వరరావు పర్యవేక్షణలో పద్యాలు నేర్చుకున్నారు. వానపాముల సత్యనారాయణ వద్ద కూడా భావయుక్తంగా పద్యాలు పాడడంపై శిక్షణ తీసుకున్నారు. ఈయనలోని నటనా విశిష్టతను బి.వి.నర్సింహారావు గుర్తించి నూతన ప్రయోగ రీతులను నేర్పారు. అకుంఠిత దీక్షతో నటన నేర్చుకున్న శాస్త్రి, ఉత్తమ స్త్రీ పాత్రలైన సత్యభామ, చింతామణి, సక్కుబాయి, చంద్రమతి, మోహిని, మాధురి తదితర పాత్రల్లో నటించారు. ఆయన చూపు మన్మథబాణంలా ఉండేదని, ప్రేక్షకుల కరతాళధ్వనులతో మారుమ్రోగిపోయేదని, శృంగార రసాధి దేవతగా ఆయన ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసేవారని నాటక ప్రియులు చెబుతుంటారు. ఆయన వేసిన నాటకాల్లో స్త్రీ పాత్రల్లోనే ఎక్కువగా నటించినందున ‘చింతామణి శాస్త్రి’గా గుర్తింపు పొందారు. సత్యసాయిబాబా నాటక సమాజాన్ని స్థాపించిన ఆయన అనేక ప్రదర్శనల ద్వారా రసజ్ఞులను మెప్పించారు. 1970వ దశకంలో చిత్రరంగ ప్రవేశం చేసిన ఆయన, వీరంకి శర్మ దర్శకత్వంలో ‘నాలాగా ఎందరో’అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కె.విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన స్వయంకృషి సినిమాలోనూ ఓ పాత్రను పోషించారు. సత్యనారాయణస్వామి అనే సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. శిఖరం, పుత్తడిబొమ్మ, ఆడదే ఆధారం, రుద్రపీఠం సీరియళ్లలో నటించారు. ఈయన దర్శకత్వం వహించిన ‘కృష్ణాతీరం’అనే సీరియల్‌కు నంది అవార్డు కూడా వచ్చింది. ఈయన నటనలోనే కాదు ప్రవచనాలు చెప్పడంలోనూ సిద్ధహస్తులుగా పేరొందారు. దేవీ భాగవతం, హనుమత్‌చరిత్ర ప్రవచాలను చెప్పేవారు. కవిగా వాల్మీకి రామాయణాన్ని తనదైన పంథాలో రాసిన ఘనత ఈయన సొంతం. ‘అష్టావిధ శృంగార నాయికలు’అనే కావ్యంతో ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. వేమన చరిత్ర, ప్రణవక్షేత్రం లాంటి ప్రసిద్ధ నాటకాల్లో నటించారు. ఈయన స్వయంగా రాసిన ‘త్యాగయ్య’అనే నాటకం వేదిక ఎక్కకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణ వార్త తెలియడంతో సినీ, సాహితీ, రంగస్థల రంగాలకు చెందిన పలువురు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ నటుడు మృతి
చిన్న పాత్రలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు దీక్షితులు అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. ఈయన పూర్తిపేరు దీవి శ్రీనివాస దీక్షిత్. కృష్ణ వంశీ దర్శకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన ‘మురారి’ ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇంద్ర, ఠాగూర్, ప్రాణం, వర్షం, అతడు మొదలైన చిత్రాల్లో ఈయన ముఖ్య పాత్రలు పోషించారు. ఆయన మృతికి పలువురు సినీ, టీవీ నటులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. జూలై 28వ తేదీ 1956వ సంవత్సరంలో హనుమంతాచార్యులు, సత్యవతమ్మ దంపతులకు జన్మించిన ఈయన సంస్కత, తెలుగు భాషలలో రంగస్థల కళల్లో ఎం.ఏ. డిగ్రీలు పొందాడు. రంగస్థల నటుడిగా, అధ్యాపకుడిగా మంచి పేరు గడించారు. ఆల్ ఇండియా రేడియోలో నటుడిగా పలు నాటకాల్లో నటించారు. -
రంగస్థలానికి ‘మొదలి’ వీడ్కోలు
నాటకాన్ని శ్వాసిస్తూ, నాటకం ఔన్నత్యాన్ని స్వప్నిస్తూ ఆ రంగానికి ఏడుపదుల కాలాన్ని అంకి తం చేసిన మహనీయుడు ఆచార్య మొదలి నాగ భూషణశర్మ. కాలేజి రోజుల్లో కన్యాశుల్కంలో మధు రవాణి వేషంతో నటుడిగా నాటక కళాసేవ ఆరం భించి, నాటక దర్శకుడిగా, రచయితగా, అధ్యాపకు డిగా, పరిశోధకుడిగా నాటకానికి బహుముఖీన సేవ లందించారు. తెలుగు నాటకాలే కాదు, విదేశాల్లోని ఉత్తమ నాటకాలను అద్భుత ప్రయోగాలతో ప్రద ర్శించి, తెలుగు ప్రజలకు నాటకవిందు చేశారు. నాటక, గాయక ప్రముఖులపై పుస్తకాలను తీసుకొ చ్చారు. తోలుబొమ్మలాటను జపనీయుల కళ్లకు కట్టారు. తెలుగు డ్రామా అండ్ థియేటర్ చరిత్రను ఇంగ్లిష్, తెలుగులో రాయాలనే తపనతో కృషిచేస్తున్న తరుణంలో ఆయన కన్నుమూయటం తెలుగు నాటకానికి తీరనిలోటు. ఆచార్య మొదలి నాగభూషణశర్మ (84) పూర్వీ కులది గుంటూరు జిల్లాలోని బ్రాహ్మణకోడూరు. తండ్రి సుబ్రహ్మణ్యశర్మ ఉద్యోగరీత్యా ఇదే జిల్లాలోని రేపల్లె దగ్గరగల ధూళిపూడిలో స్థిరపడ్డారు. అక్కడే 1935 జూలై 24న నాగభూషణశర్మ జన్మించారు. పాఠశాల దశనుంచే ఆయనకు రంగస్థలంపై అను బం«ధం ఏర్పడింది. విజయవాడ, బందరులో కాలేజి చదివే రోజుల్లో ఆ బంధం మరింత పెరిగింది. ‘మధుర వాణి’గా 50 ప్రదర్శనల్లో నటించారు. ‘భారతి’లో ప్రచురితమైన తొలి నాటకం ‘అన్వేషణ’ రాసిందీ ఆ రోజుల్లోనే. హైదరాబాద్‌లో ఎంఏ, పీహెచ్డీ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ అధ్యాపకుడిగా చేరారు. కొంతకాలం తర్వాత అమెరికాలోని ఇల్లినాయ్ యూనివర్సిటీలో ఎంఎఫ్ఏ (థియేటర్) చేశారు. తిరిగి రాగానే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రారంభించిన థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ శాఖకు తొలి అధిపతిగా మొదలిని నియమించారు. చాట్ల శ్రీరాములు, రాజా రామదాస్ వంటి నిష్ణాతులను అధ్యాపకులుగా చేర్చుకుని, నాటకకళ వికాసానికి నాగభూషణ శర్మ శ్రద్ధపెట్టారు. పలు నాటకాలనే కాదు, ఆచార్య ఆత్రేయ నాటకోత్సవాన్ని విజయవంతంగా ప్రదర్శించారు. నాటకరంగ ప్రము ఖులు డీఎస్ఎన్ మూర్తి, తనికెళ్ల భరణి, తల్లావ ఝుల సుందరం, భిక్షు, భాస్కర్, హవల్కర్, విద్యా సాగర్, జీఎస్ ప్రసాద్‌రెడ్డి వంటి ప్రముఖులు ఉస్మా నియా థియేటర్ ఆర్ట్స్ శాఖ నుంచి పట్టాలు తీసు కున్నవారే. 1988లో సెంట్రల్ యూనివర్సిటీలో సరో జినీనాయుడు ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ప్రారంభమైనపుడు శర్మ తొలి డీన్‌గా నియమితుల య్యారు. ఆ స్కూలును కళల వికాసానికి అనువైన దిగా రూపుదిద్దారు శర్మ. మరోవైపు నాటకరచన, దర్శకత్వం బాధ్యత లను అపూర్వంగా నిర్వహించారు. తెలుగులో 60, 28 ఇంగ్లిష్ నాటకాలకు దర్శకత్వం వహించారు. విదేశీ భాషలకు చెందిన అనేక కళాఖండాలను తెలు గులోకి అనువదించి, ప్రదర్శింపజేశారు. వీటిలో ‘రాజా ఈడిపస్’, ‘ది విజిట్’, ‘మ్యాడ్ విమెన్ ఆఫ్ చల్లియట్’, ‘హయవదన’, ‘మృచ్ఛకటిక’ వంటి నాటకాలు ప్రముఖమైనవి. వీటిలోని ప్రయోగాలు అనితరసాధ్యం. హైదరాబాద్‌లోని రసరంజని సంస్థకు అనేక నాటకాలను ప్రదర్శించారు. వీటిలో టంగుటూరి ప్రకాశం పంతులు ఆత్మకథను ‘ప్రజా నాయకుడు ప్రకాశం’ నాటకంగా, తన దర్శకత్వంలో రాష్ట్రమంతా ప్రదర్శించారు. హెన్నిక్ ఇబ్సెన్ నాటకం ‘డాల్స్ హౌస్’ తెలుగులో ‘బొమ్మరిల్లు’గా, బెర్టాల్ట్ బ్రెచెట్ ఇంగ్లిష్ నాటకం ‘తెల్లసున్నా’గా శామ్యూల్ బకెట్ రచన ‘దేవుడయ్యి వస్తాడట’ పేరుతోనూ తన దర్శకత్వంలోనే ప్రదర్శనలకు సిద్ధంగా ఉంచారు. సాహిత్యం, కళలు, జానపదం, నాటకం, అను వాదాలు, విమర్శలు... ఇలా అన్ని ప్రక్రియల్లోనూ 14 పుస్తకాలు రాశారు. 1975లో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ జానపద కళోత్సవాల కోసమని నటరాజ రామకృష్ణతో కలిసి 300 గ్రామాలు తిరిగి 750 మంది కళాకారులను ఆ ఉత్సవంలో పాల్గొనేలా చేశారు. 64 కళారూపాలను ‘ఫోక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్’ పుస్తకంగా తీసుకొచ్చారు. తోలుబొమ్మలాట బృందాన్ని జపాన్ తీసుకెళ్లి 15 పట్టణాల్లో ప్రదర్శిం పజేశారు. నాటకరంగ సేవలకుగాను నాగభూషణ శర్మ కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాన్ని, గతేడాది ‘కళారత్న’ గౌరవాన్ని స్వీకరించారు. ఈనెల 6న తెనాలిలో అజో–విభొ– కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభా వైజయంతి జీవితకాల సాధన పుర స్కారాన్ని అందుకున్నారు. (తెనాలిలో మంగళవారం రాత్రి కన్నుమూసిన ‘మొదలి’కి నివాళి) బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి మొబైల్ : 95509 30789 -
రంగస్త్రీలం
పాత్రలోకి వచ్చాక తమను తాము మర్చిపోయినవారే నటులుపాత్రలో పాత్ర కనపడుతుందిపాత్ర వెనక జీవితంలో ఉన్న కష్టం కప్పి పుచ్చుతుందిఆడుతున్న గుండె మీద బంగారపు పూత పూసినట్టు గుండె పగిలిపోతున్నా ధగధగమని మెరవవలసిందేపూత అన్నం పెట్టింది... పాత్ర కీర్తినిచ్చిందికానీ గర్భం ఇంకా దుఃఖస్మృతులతో కన్నీరు పెడుతూనే ఉందిపాత్రను చూసి చప్పట్లు కొట్టేవాళ్లు ప్రేక్షకులైతే జమునారాయల జీవితం చూసి చప్పట్లు కొట్టేవాళ్లం మన మందరం. ఆమె తాను పుట్టిన 21వ రోజునే ఊయలలో కృష్ణుడి వేషంతో రంగస్థల ప్రవేశం చేశారు.ఎనిమిది సంవత్సరాల వయసుకే ఇంటికి ఆధారం అయ్యారు.వయసు వచ్చాక, అందమైన అమ్మాయి ఎదుర్కొనే సమస్యలన్నీ ఎదుర్కొన్నారు.తెర ముందు నారదుడి వేషం వేస్తూనే తెర వెనుక పసిబిడ్డకు పాలిచ్చారు.నాటకాలు వేస్తూనే తల్లి అయ్యారు... ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్నారు.పురుషాధిక్యంతో ఎంతో నష్టపోయారు. అయినా దీక్ష విడిచిపెట్టలేదు.ఆమె సురభి జమునా రాయలుహైదరాబాద్లో ఇటీవల శ్రీకృష్ణుడు, సత్యభామ అర్ధనారీశ్వర వేషం వేసిన సందర్భంగా సాక్షితో పంచుకున్న అనుభవాలు ఆమె మాటలలోనే.‘‘సురభిలో కుటుంబంలో పుట్టిన ప్రతివారు అన్ని రకాల పాత్రలు పోషిస్తారు. కృష్ణుడిని తట్టలో పెట్టుకుని వసుదేవుడు గోకులానికి బయలుదేరిన సీన్లో నేను బాలకృష్ణుడిగా రంగ ప్రవేశం చేశాను. అప్పుడు నా వయసు 21 రోజులు. ఆ తరవాత చాలా బాల వేషాలు వేశాను. నాన్నగారి దగ్గర హరికథలు నేర్చుకున్నాను. పద్నాలుగు సంవత్సరాలకే వివాహం కావడంతో ‘గజపతి నాట్య కళా సమితి’ కుటుంబంలో ఐదవ కోడలిగా అడుగు పెట్టాను. ఇరవై రెండు సంవత్సరాలు వచ్చేసరికి ఐదుగురు పిల్లలు పుట్టుకొచ్చారు. కాని మిగిలింది ఇద్దరు మాత్రమే’’. దవడ వాచిపోయింది... ‘‘ఒకసారి నారద పాత్ర పోషిస్తున్న సమయంలో, పసిపిల్లకు పాలివ్వడం కోసం లోపలకు, బయటకు తిరిగాను. ఆ హడావుడిలో ఒక చిడత ఎక్కడో వదిలేశాను. ఒక్క చిడత మాత్రమే ఉంది. రెండో చిడత వెతుక్కుని రంగస్థలం మీదకు కొంచెం ఆలస్యంగా వచ్చాను. వేదిక అని కూడా చూడకుండా మా పెద్దవాళ్లు నా చెంప ఛెళ్లుమనిపించారు. వాచిన బుగ్గతోనే నారదుడి పాత్ర వేశాను. నాటకాల పట్ల నిబద్ధత పెరగడానికి ఇలాంటి క్రమశిక్షణ కారణం’’ దుస్తులు తడిసిపోయాయి... ‘‘నేను నాటకాలలో అన్నీ పురుష పాత్రలే ధరించేదాన్ని. అందువల్ల స్త్రీ సహజ లక్షణాలు కనపడకుండా వస్త్రాలు బాగా బిగించి ధరించేదాన్ని. ఆరోజు నేను మగ పాత్ర వేయాలి. మేకప్ వేసుకోవడానికి ముందే మా చిన్నమ్మాయికి పాలిచ్చాను. మేకప్ వేసుకుని, రంగస్థలం మీదకు వచ్చాను. చాలాసేపటి వరకు లోపలకు వెళ్లలేకపోయాను. ఆకలికి పసిపాప గుక్క పెట్టి ఏడుస్తోంది. మాతృ సహజమైన మమకారం లోపల నుంచి పొంగుకొచ్చింది. నా దుస్తులన్నీ క్షీరధారలతో నిండిపోయాయి. బిడ్డ ఆకలిని తీర్చలేకపోతున్నందుకు నేను ఎంత నరకం అనుభవించానో. నాటకం చూస్తున్న ప్రేక్షకులలో నుంచి ఒకరు, ‘అమ్మా! మీరు లోపలకు వెళ్లండి, పసిబిడ్డ ఏడుస్తోంది, ఆ బిడ్డకు పాలిచ్చి రండి’ అన్నారు. మేం నమ్ముకున్న వృత్తి కోసం ఎంత బాధపడతామో, ఎంత కష్టపడతామో తెలియచెప్పడానికే ఈ విషయం చెబుతున్నాను. ఎన్ని చేదు అనుభవాలో... ‘‘అప్పుడు నిండు చూలాలిని. స్టేజ్ మీద మన్మధుడి వేషం వేస్తున్నాను. మన్మధుడి పాత్ర అంటే రంజింపచేయాలి. ఒకవైపు నొప్పులు వస్తున్నాయి. కళ్లలో నుంచి చుక్క నీరు కూడా రావడానికి వీలులేదు. నన్ను లోపలకు పిలిచి ఏదో కషాయం ఇచ్చారు. తాగుతానే నొప్పులు ఆగిపోయాయి. అలాంటి కష్టమైన సమయాల్లో కూడా నటించాను. మరో సంఘటన – ఒక వారం రోజులు వరుసగా నాటకాలు ఒప్పుకున్నాను. అప్పటికే నన్ను నమ్ముకుని లక్షరూపాయల టికెట్లు అమ్మారు. నాటకం ఇంకా మూడు రోజులుందనగా మూడో పాప యాక్సిడెంట్లో మరణించింది. తల్లిగా నా హృదయం రోదించింది. నాటకం వేసి తీరాలి. మనసు బండరాయిగా మార్చుకున్నాను. బాధను కడుపులోనే మింగి వరుసగా నాటకాలు ప్రదర్శించాను. అవి కూడా సతీసావిత్రి, వర విక్రయం, సత్యహరిశ్చంద్ర నాటకాలు. మూడు నాటకాలలోనూ మరణ సన్నివేశాలున్నాయి. ఆ సన్నివేశాలలో నా పాప గుర్తుకొచ్చి ఎంత ఏడ్చానో చెప్పలేను’’ సహించలేకపోయారు... నేను నమ్ముకున్న వృత్తి నాటకం. కృష్ణుడి పడక సీన్ నుంచి రాయబారం వరకు అన్ని వేషాలు వేశాను. ద్రౌపది పాత్ర పోషించి, అందరి ప్రశంసలు అందుకున్నాను. కాని బయటి నాటక సమాజాలు నాకు వేషం ఇవ్వలేదు. ఇటువంటి ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయి. స్త్రీలను ప్రోత్సహించిన సురభి... 130 సంవత్సరాల చరిత్ర కలిగిన సురభి నాటక సంస్థ స్త్రీ అభ్యుదయానికి, అభ్యున్నతికి, స్త్రీ స్వేచ్ఛకి పెట్టింది పేరు. స్త్రీని ఉన్నతంగా చూపారు. స్త్రీ పాత్రలు స్త్రీలే వేయాలని, కుటుంబ స్త్రీలు బయటకు రావాలన్నారు. నేడు మాత్రం ఆడవారు ప్రశంసలు పొందితే, పురుషులు సహించలేకపోతున్నారు. వెనక్కు లాగే చేతులు ఉంటాయి. ముందుకు వెళ్లాలి మనం. అందుకే నేను ఈ రంగంలో విజయం సాధించగలిగాను. విలక్షణ ప్రయోగం... నాటకరంగ చరిత్రలో ఎవ్వరూ చేయని ప్రయోగం చేశాను. ఒక పక్క సత్యభామ, మరోపక్క కృష్ణుడు... రెండు పాత్రలను నేనే గంటసేపు నటించాను. డ్రెస్సింగ్, మేకప్, అన్నీ నేనే. అందరూ మెచ్చుకున్నారు, ఒప్పుకున్నారు. కాలేజీలలో డెమో ఇవ్వాలనుకున్నాను. ఏ యూనివర్సిటీలవారు నాకు అవకాశం ఇవ్వకపోవడంతో నిరాశ చెందాను. నా జీవితమే నా చదువు... ‘‘డిగ్రీలు చదవకపోయినా, జీవితాన్ని బాగా చదివాను. జీవితం నుంచి నేర్చుకున్నదే పాత్రలుగా మలుచుకున్నాను. కాని నాటకం అన్నిసార్లు అన్నం పెట్టలేదు. సురభి కంపెనీ మూసేశాక పిల్లలు, భర్తతో బయటకు వచ్చేసి, నా దగ్గర ఉన్న బంగారం అమ్మి, నా భర్తకు ఆటో కొని ఇచ్చాను. కాని లాభం లేకపోయింది. అటువంటి పరిస్థితిలో నేను ఇతర కంపెనీలలో ఔత్సాహిక కళాకారులతో పనిచేయడం ప్రారంభించాను. అక్కడ కూడా ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను. – సంభాషణ: డా. పురాణపండ వైజయంతి -
ఇచ్చోటనే కదా..!
ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కరిగిపోయేఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించేఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయేఇచ్చోటనే ఎట్టి పేరెన్నికగన్న చిత్రలేఖకుని కుంచెయు నశించె..! – జాషువా ఈ కరిగిపోవడం, అంతరించడం, కలిసిపోవడం, నశించడం.. ఇప్పుడు ఇచ్చోటనే రంగస్థలానికి వర్తిస్తోందా అనిపిస్తోంది! కానీ ఒక నమ్మకం. నాటక కళాకారులు ఆ పరిస్థితి రానివ్వరు. సుమారు 700 దశాబ్దాల చరిత్ర కలిగిన సురభి కళాకారులు నేటికీ ఎక్కడ నాటకం ఉందంటే అక్కడికి పెట్టేబేడా సర్దుకుని పొట్ట చేతబట్టుకుని వెళ్లి నాటకం ఆడుతున్నారు. ఎక్కడో ఒక మూలనైనా రంగస్థల కళలను ఆదరించే మారాజులు లేకపోతారా అని వారి ధీమా. టీవీ వచ్చాక ఠీవి తగ్గింది ఒకప్పుడు పల్లెల్లో వానలు పడలేదంటేనో, గతేడాది పంటలు సరిగా పండలేదంటేనో హరికథ, బుర్రకథ, తోలుబొమ్మలాట, రంగస్థల నాటకాలు ఆడించేవారు. అలా ఆడిస్తే వానలు కురుస్తాయని నమ్మకం. వీటి నిర్వహణకు అప్పట్లో పల్లె ప్రజలు తలా ఇంత మొత్తం వేసుకునేవారు. అలా రెండు దశాబ్దాల కిందటి వరకు కూడా రంగస్థలానికి మంచి ఆదరణే ఉండేది. ఎప్పుడైతే ఇంటింటికీ టీవీ రావడం మొదలైందో అప్పుడే రంగస్థలం పునాదులు కదలడం మొదలయ్యాయి. సాయంత్రం కాగానే జనం బయటకు రావడం మానేశారు. టీవీ సీరియళ్లతోనే కాలక్షేపం చేయడానికి అలవాటు పడిపోయారు. కలతే బతుకు అయింది! ఒక్కరున్నా నాటకం ఆగదు. కానీ ఆ ఒక్కరైనా ఇప్పుడు చూడ్డానికే కరువయ్యారు. కళంటే బతుకునిచ్చేది మాత్రమే కాదు.. బతుకు నేర్పేది కూడా అని కళాకారులు చెబుతారు. అయితే కళాకారుల జీవితాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. మరో ఐదేళ్లు, పదేళ్లు దాటితే ఈ రంగస్థలాన్ని చూసే వారు కూడా ఉండరేమో అన్న ప్రశ్నకు కళాకారుల నోటి వెంట మాటలేదు. కళ ఎప్పటికీ బతికే ఉంటుందని ఎంత గాంభీర్యంగా చెప్పినా, వారి మోములో ఏదో చిన్నపాటి బెరుకు కనిపించింది. ‘నరుని లోపలి పరునిపై ద్రిష్టి పరుపగా..తలవంచి కైమోక్షి శిష్యుడవు నీవైతే..నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే.. అని ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకునేలా చెప్పగలిగే కళాకారులు ఇంకా రంగస్థలంపై ఆశతో బతికే ఉన్నారు. అవును గంట సేపు ఏకధాటిగా మాట్లాడితేనే మా గొంతు బొంగురు పోతుంది. అలాంటిది మీరెలా తెల్లవార్లు పద్యాలు చెప్పగలరు అని కళాకారిణులను అడిగితే ఆ పరమేశ్వరుడి దయా కటాక్షం అంటారు. అది ఆయనిచ్చిన వరమంటారు. ఇలా ఏకబిగిన గంటలపాటు పద్యాలు చెప్పగలిగే కళాకారిణుల బతుకులెలా ఉన్నాయో తొంగిచూస్తే వర్ణించలేని బాధాతప్తత కనిపించింది. ఈ రంగంలోకి తమ పిల్లల్ని రానివ్వకూడదని కొందరు, ఈ రంగంలోనే వారసత్వంగా పిల్లల్ని తెచ్చేవారు కొందరు ఉన్నారు. వీళ్లు కాక.. పిల్లలు ఉన్నత చదువులు చదివినా విధిలేక ఆర్థిక పరిస్థితులు సరిగా లేక వారిని ఈ రంగస్థలంలోకి తీసుకొచ్చిన మరికొందరున్నారు. రంగుల వెనుక వెలవెల బతుకు వెనుక ఎన్ని బాధలున్నా ముఖానికి రంగేసుకోగానే వాటన్నిటినీ పక్కనబెట్టి ప్రేక్షకులను మెప్పించడానికి రంగస్థల కళాకారిణులు పడే తపన, కష్టం అంతా ఇంతా కాదు. ఎక్కడ ప్రేక్షకులు లేచిపోతారో అని రంగస్థల నాటకాల్లో సినిమా పాటలు పాడి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ నాటకాన్ని రక్తి కట్టించవలసిన సందర్భాలూ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కొందరు రంగస్థల నటీమణులను ‘ఫ్యామిలీ’ కలుసుకుంది. వారి మనోభావాలను తెలుసుకుంది. – జి.బసవేశ్వరరెడ్డి, సాక్షి, తిరుపతి ఒకచోట స్థిరంగా ఉండలేం గత ఇరవై ఏళ్లుగా రంగస్థల నటిగా ఉన్నాను. 2014లో జరిగిన నంది నాటకోత్సవాల్లో సతీసావిత్రి నాటకానికి నాకు నంది అవార్డు వచ్చింది. ఏ వృత్తిలోనైనా ఒకరిద్దరు కలిస్తే రాణించవచ్చు. కానీ, మాకు అలా ఉండదు. నాటకం వేయాలంటే ఒక బృందం కావాలి. నాటకం వేయాలని ఎక్కడి నుంచి పిలుపు వస్తుందో అక్కడికి అంతా వెళ్లిపోతాం. స్థిరంగా ఒక ప్రాంతానికే పరిమితం కాలేం. అందుకేనేమో మా కష్టాలను ప్రభుత్వం పట్టించుకోదు. – వనజకుమారి, రంగస్థల నటి ‘పని’ నాలుగు నెలలే! గత నలభై ఏళ్లుగా రంగస్థల నటిగా ఉన్నాను. ఏడాదిలో మూడు, నాలుగు నెలలు తప్ప మిగిలిన రోజుల్లో పనులు ఉండవు. సంపాదించింది ఖర్చులకూ సరిపోదు. విగ్గులు, నగలు, చీరలు సరిపడా కొనడానికి సంవత్సరానికి ముప్పై వేలకు పైగా కావాలి. రెండు నెలలకోసారి మేకప్ కిట్ కొంటాం దానికి కూడా వెయ్యికి పైగా ఖర్చవుతుంది. ఈ కష్టాలన్నీ వినేవారెవరు? చిన్నప్పటి నుంచి కళ అంటే ప్రాణం. సాంఘిక నాటకాల్లో ఎక్కువగా నటించాను. రైతు సమస్యలపై రాసిన ‘పడమటి గాలి’ నాటకంలో నా పాత్ర (లచ్చిందేవి)కు చాలా మంచి పేరు వచ్చింది. పౌరాణికాల్లో బాలనాగమ్మ పాత్ర అంటే నాకు ఇష్టం. చిన్నచూపు వల్లే మానేశా ఎనిమిదేళ్ల వయసులో ఈ రంగానికి వచ్చాను. నలభై ఏళ్ల పాటు రంగస్థల నటిగా ఉన్నా. ఎక్కువగా చింతామణి పాత్ర వేశా. కందుకూరి పురస్కారం కూడా పొందాను. కానీ నాటకాలవాళ్లంటే ప్రజల్లో చిన్న చూపు ఉంది. ప్రేక్షకులైనా మా నటనను చూసి చప్పట్లు కొడితే అదే పదివేలు అనుకుంటాం. ఇప్పుడు అదీ దక్కడం లేదు. అందుకే బయటికి వచ్చేశాను. నా పిల్లలు కూడా ఈ రంగం వైపు రావడం నాకు ఇష్టం లేదు. – రజనీబాయి, రంగస్థల నటి తల్లిలా ఆదరించింది ప్రేక్షకుల అభిరుచీ మారింది. అందుకు అనుగుణంగా మేము ఆడాలి. మా పిల్లలకైతే ఈ రంగం మీద ఆసక్తి లేదు. నా వయసు 54 ఏళ్లు. నాటకాల్లో నాకు 36 ఏళ్ల అనుభవం. రంగస్థలం మమ్మల్ని తల్లిలా ఆదరించింది. ఇప్పుడు రంగస్థలమే ఆదరణ కోసం చూస్తోంది. – విజయలక్ష్మి, అనంతపురం రంగస్థలమే నా స్వస్థలం మా దగ్గర ఐదారు నెలల గర్భిణులు కూడా నాటకాలు వేస్తారు. ఎందుకంటే మరో జీవనోపాధి ఉండదు. 12 ఏళ్ల వయసులో నేను మొదటి సారి సురభి వాళ్ల దగ్గర బాలకృష్ణుడి పాత్ర వేశా. అప్పటి నుంచి రంగస్థలమే నా స్వస్థలమైపోయింది. నా కూతురు విజయశారద ఎం.ఏ వరకు చదివింది. ఆమె కూడా నాటక రంగంలోనే ఉంది. నా భర్త పేరు ఎస్వీ సెల్వం. ఆయన కూడా నాటకరంగంలోనే కాస్ట్యూమర్‌గా ఉండేవారు. మూడేళ్ల కిందట మా సొంత ఖర్చులతో ‘శ్రీనివాస కల్యాణం నాటకం’ వేశాం. అందుకు నాకు రూ.88,000 ఖర్చయింది. కానీ ప్రభుత్వం నుంచి నాకు అందిన సాయం రూ.8,000. అలాగే ఎస్ఆర్కే అనే నాట్యమండలిని స్థాపించి రూ.1,45,000 ఖర్చుతో నాటక పోటీలు నిర్వహించాం. ప్రభుత్వం నుంచి వచ్చింది మాత్రం రూ.5,000 మాత్రమే. ప్రభుత్వం కనీసం మాకు హెల్త్కార్డులైనా ఇవ్వాలి. – విజయకుమారి (58), అనంతపురం, కళాకారిణి అంతకాలం బతుకుతామా?! ఇప్పుడున్న రంగస్థలం ఉన్నతంగా ఏం లేదు. ఆడేది పాడేది రాకపోయినా రికార్డు డ్యాన్సులతో కాలం గడుపుతున్నారు. అందుకే నా పిల్లలను ఈ రంగంలోకి తీసుకురాలేదు. ఈ ప్రభుత్వాలు 60 ఏళ్లకు పింఛన్ ఇస్తున్నాయి. మేము అంతకాలం బతుకుతామన్న నమ్మకం కూడా లేదు. ఇంక పింఛన్ తీసుకునేదెప్పుడు? వై.ఎస్.జగన్ 45 ఏళ్లకే పింఛను అంటున్నారు. అది వస్తే మా బతుకులు కొంతైనా నయం అవుతాయి. – ఆశాలత, సురభి కళాకారిణి, శ్రీకాకుళం వింతగా చూసేవాళ్లు నేను ఐదేళ్ల వయసు నుంచే నాటక రంగంలో ఉన్నా. నాటకాల్లో కొన్ని ఏడ్చే సీన్ల కోసం జెండూ బామ్ వాడుతాం. అలా చేయడం వల్ల విపరీతమైన మంట, బాధగా ఉన్నా ప్రేక్షకులను అలరించడానికి, నాటకాన్ని రక్తి కట్టించడానికి చేయక తప్పేది కాదు. పైగా లైట్ల నుంచి వచ్చే కాంతి, వేడి వల్ల కళ్లకు చాలా ఇబ్బందిగా ఉండేది. నా చూపు తగ్గిపోవడానికి అదే కారణం. నాటకం అయ్యాక ముఖానికి వేసుకున్న మేకప్ తీయడానికి కొబ్బరి నూనె వినియోగించేవాళ్లం. అది అందుబాటులో లేకపోతే కిరోసిన్‌తో శుభ్రం చేసుకుని మేకప్ తీయాల్సి వచ్చేది. అలా చేయడం వల్ల 40 ఏళ్లకే చర్మ రోగాలు వస్తాయని తెలిసినా మాకు వేరే గత్యంతరం లేదు. నా పెద్ద కూతురు వనజకుమారికి 45 ఏళ్లు. తను గత 25 ఏళ్లుగా నాట్యమండలిలో ఉంది. నా రెండో కుమార్తె అనిత కుమారికి చిన్న వయసులో పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త సంపాదన చాలక తప్పనిసరి పరిస్థితుల్లో నాటకం వేయడం ప్రారంభించింది. ఒక్కోసారి ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితులు వస్తాయి. అన్నింటినీ దిగమింగుకుని బతుకుతున్నాం. కానీ కళ అంటే మాకు గౌరవం. – సరోజ, రంగస్థల నటి, అనంతపురం -
ప్రదర్శన ఇస్తూ ఒక్కసారిగా ప్రాణాలు విడిచాడు
-
విషాదం.. ప్రదర్శన ఇస్తూ ప్రాణాలు విడిచాడు
సాక్షి, తిరువనంతపురం : ప్రముఖ కళాకారుడు కళామందలమ్ గీతానందన్ హఠాన్మరణం కేరళ కళారంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 58 ఏళ్ల గీతానందన్ ఒట్టాన్ థుల్లాల్(కేరళ శాస్త్రీయ నృత్యం) లో ప్రావీణ్యుడు. ప్రదర్శన ఇస్తున్న సమయంలోనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇరింజలక్కుడలోని ఓ ఆలయంలో ఆదివారం ఆయన ప్రదర్శన ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన నృత్యం చేస్తూనే.. వాయిద్యాకారుల ముందు మోకరిల్లాడు. ప్రదర్శనలో భాగంగానే అని అంతా భావిస్తున్న తరుణంలో చేతులు జోడిస్తూ కుప్పకూలిపోయారు. నిర్వాహకులు హుటాహుటిన ఆయన్ని ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. గుండెపోటుతో ఆయన చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, చిన్నతనం నుంచే ‘ఒట్టాన్ థుల్లాల్’ ప్రదర్శనలతో ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించారు. సంగీత నాటక అకాడమీ అవార్డు(2000)తోపాటు పలు అవార్డులు సాధించారు. మళయాళంలో ఆయన 30కి పైగా చిత్రాల్లో నటించారు కూడా. ‘చివరి వరకు ఒట్టాన్ థుల్లాల్ తోనే నా ప్రయాణం’ అని తరచూ ఆయన పలు ఇంటర్వ్యూల్లో ప్రకటించారు. కళామందలమ్ డీమ్డ్ యూనివర్సిటీలో థుల్లాల్ విభాగానికి సేవలు అందించిన గీతానందన్ ఈ మధ్యే రిటైరయ్యారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తోపాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. -
చెర్రీ రంగస్థలంపై ఇంట్రస్టింగ్ న్యూస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రంగస్థలం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల రాజమండ్రి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈసినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో రంగస్థల కళాకరుడిగా కనిపించనున్నాడట. అంతేకాదు తానే స్వయంగా రంగస్థలం అనే కంపెనీ పేరుతో నాటకాలు వేస్తుంటాడని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా కనిపించనున్నాడట. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.