చివరి ప్రదర్శనలో కుప్పకూలిన గీతానందన్ దృశ్యాలు
సాక్షి, తిరువనంతపురం : ప్రముఖ కళాకారుడు కళామందలమ్ గీతానందన్ హఠాన్మరణం కేరళ కళారంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 58 ఏళ్ల గీతానందన్ ఒట్టాన్ థుల్లాల్(కేరళ శాస్త్రీయ నృత్యం) లో ప్రావీణ్యుడు. ప్రదర్శన ఇస్తున్న సమయంలోనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ఇరింజలక్కుడలోని ఓ ఆలయంలో ఆదివారం ఆయన ప్రదర్శన ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన నృత్యం చేస్తూనే.. వాయిద్యాకారుల ముందు మోకరిల్లాడు. ప్రదర్శనలో భాగంగానే అని అంతా భావిస్తున్న తరుణంలో చేతులు జోడిస్తూ కుప్పకూలిపోయారు. నిర్వాహకులు హుటాహుటిన ఆయన్ని ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. గుండెపోటుతో ఆయన చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.
కాగా, చిన్నతనం నుంచే ‘ఒట్టాన్ థుల్లాల్’ ప్రదర్శనలతో ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించారు. సంగీత నాటక అకాడమీ అవార్డు(2000)తోపాటు పలు అవార్డులు సాధించారు. మళయాళంలో ఆయన 30కి పైగా చిత్రాల్లో నటించారు కూడా. ‘చివరి వరకు ఒట్టాన్ థుల్లాల్ తోనే నా ప్రయాణం’ అని తరచూ ఆయన పలు ఇంటర్వ్యూల్లో ప్రకటించారు. కళామందలమ్ డీమ్డ్ యూనివర్సిటీలో థుల్లాల్ విభాగానికి సేవలు అందించిన గీతానందన్ ఈ మధ్యే రిటైరయ్యారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తోపాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment