ఇచ్చోటనే కదా..!  | Today is the world stage day | Sakshi
Sakshi News home page

ఇచ్చోటనే కదా..! 

Published Tue, Mar 27 2018 12:25 AM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM

Today is the world stage day - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కరిగిపోయేఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించేఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయేఇచ్చోటనే ఎట్టి పేరెన్నికగన్న చిత్రలేఖకుని కుంచెయు నశించె..!
–  జాషువా

ఈ కరిగిపోవడం, అంతరించడం, కలిసిపోవడం, నశించడం.. ఇప్పుడు ఇచ్చోటనే రంగస్థలానికి వర్తిస్తోందా అనిపిస్తోంది! కానీ ఒక నమ్మకం.  నాటక కళాకారులు ఆ పరిస్థితి రానివ్వరు. సుమారు 700 దశాబ్దాల చరిత్ర కలిగిన సురభి కళాకారులు నేటికీ ఎక్కడ నాటకం ఉందంటే అక్కడికి పెట్టేబేడా సర్దుకుని పొట్ట చేతబట్టుకుని వెళ్లి నాటకం ఆడుతున్నారు.  ఎక్కడో ఒక మూలనైనా రంగస్థల కళలను ఆదరించే మారాజులు లేకపోతారా అని వారి ధీమా.  

టీవీ వచ్చాక ఠీవి తగ్గింది
ఒకప్పుడు పల్లెల్లో వానలు పడలేదంటేనో, గతేడాది పంటలు సరిగా పండలేదంటేనో హరికథ, బుర్రకథ, తోలుబొమ్మలాట, రంగస్థల నాటకాలు ఆడించేవారు. అలా ఆడిస్తే వానలు కురుస్తాయని నమ్మకం. వీటి నిర్వహణకు అప్పట్లో పల్లె ప్రజలు తలా ఇంత మొత్తం వేసుకునేవారు. అలా రెండు దశాబ్దాల కిందటి వరకు కూడా రంగస్థలానికి మంచి ఆదరణే ఉండేది. ఎప్పుడైతే ఇంటింటికీ టీవీ రావడం మొదలైందో అప్పుడే రంగస్థలం పునాదులు కదలడం మొదలయ్యాయి. సాయంత్రం కాగానే జనం బయటకు రావడం మానేశారు. టీవీ సీరియళ్లతోనే కాలక్షేపం చేయడానికి అలవాటు పడిపోయారు. 

కలతే బతుకు అయింది!
ఒక్కరున్నా నాటకం ఆగదు. కానీ ఆ ఒక్కరైనా ఇప్పుడు చూడ్డానికే కరువయ్యారు. కళంటే బతుకునిచ్చేది మాత్రమే కాదు.. బతుకు నేర్పేది కూడా అని కళాకారులు చెబుతారు. అయితే కళాకారుల జీవితాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి.  మరో ఐదేళ్లు, పదేళ్లు దాటితే ఈ రంగస్థలాన్ని చూసే వారు కూడా ఉండరేమో అన్న ప్రశ్నకు కళాకారుల నోటి వెంట మాటలేదు. కళ ఎప్పటికీ బతికే ఉంటుందని ఎంత గాంభీర్యంగా చెప్పినా, వారి మోములో ఏదో చిన్నపాటి బెరుకు కనిపించింది.  ‘నరుని లోపలి పరునిపై ద్రిష్టి పరుపగా..తలవంచి కైమోక్షి శిష్యుడవు నీవైతే..నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే.. అని 
ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకునేలా చెప్పగలిగే కళాకారులు ఇంకా రంగస్థలంపై ఆశతో బతికే ఉన్నారు. అవును గంట సేపు ఏకధాటిగా మాట్లాడితేనే మా గొంతు బొంగురు పోతుంది. అలాంటిది మీరెలా తెల్లవార్లు పద్యాలు చెప్పగలరు అని కళాకారిణులను అడిగితే ఆ పరమేశ్వరుడి దయా కటాక్షం అంటారు. అది ఆయనిచ్చిన వరమంటారు. ఇలా ఏకబిగిన గంటలపాటు పద్యాలు చెప్పగలిగే కళాకారిణుల బతుకులెలా ఉన్నాయో తొంగిచూస్తే వర్ణించలేని బాధాతప్తత కనిపించింది. ఈ రంగంలోకి తమ పిల్లల్ని రానివ్వకూడదని కొందరు, ఈ రంగంలోనే వారసత్వంగా పిల్లల్ని తెచ్చేవారు కొందరు ఉన్నారు. వీళ్లు కాక.. పిల్లలు ఉన్నత చదువులు చదివినా విధిలేక ఆర్థిక పరిస్థితులు సరిగా లేక వారిని ఈ రంగస్థలంలోకి తీసుకొచ్చిన మరికొందరున్నారు. 

రంగుల వెనుక వెలవెల
బతుకు వెనుక ఎన్ని బాధలున్నా ముఖానికి రంగేసుకోగానే వాటన్నిటినీ పక్కనబెట్టి ప్రేక్షకులను మెప్పించడానికి రంగస్థల కళాకారిణులు పడే తపన, కష్టం అంతా ఇంతా కాదు. ఎక్కడ ప్రేక్షకులు లేచిపోతారో అని రంగస్థల నాటకాల్లో సినిమా పాటలు పాడి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ నాటకాన్ని రక్తి కట్టించవలసిన సందర్భాలూ ఉంటున్నాయి.
ఈ నేపథ్యంలోనే కొందరు రంగస్థల నటీమణులను ‘ఫ్యామిలీ’ కలుసుకుంది. వారి మనోభావాలను  తెలుసుకుంది. 
– జి.బసవేశ్వరరెడ్డి, సాక్షి, తిరుపతి

ఒకచోట స్థిరంగా ఉండలేం
గత ఇరవై ఏళ్లుగా రంగస్థల నటిగా ఉన్నాను. 2014లో జరిగిన నంది నాటకోత్సవాల్లో సతీసావిత్రి నాటకానికి నాకు నంది అవార్డు వచ్చింది. ఏ వృత్తిలోనైనా ఒకరిద్దరు కలిస్తే రాణించవచ్చు. కానీ, మాకు అలా ఉండదు. నాటకం వేయాలంటే ఒక బృందం కావాలి. నాటకం వేయాలని ఎక్కడి నుంచి పిలుపు వస్తుందో అక్కడికి అంతా వెళ్లిపోతాం. స్థిరంగా ఒక ప్రాంతానికే పరిమితం కాలేం. అందుకేనేమో మా కష్టాలను ప్రభుత్వం పట్టించుకోదు.
– వనజకుమారి,  రంగస్థల నటి

‘పని’ నాలుగు నెలలే!
గత నలభై ఏళ్లుగా రంగస్థల నటిగా ఉన్నాను. ఏడాదిలో మూడు, నాలుగు నెలలు తప్ప మిగిలిన రోజుల్లో పనులు ఉండవు. సంపాదించింది ఖర్చులకూ సరిపోదు. విగ్గులు, నగలు, చీరలు సరిపడా కొనడానికి సంవత్సరానికి ముప్పై వేలకు పైగా కావాలి. రెండు నెలలకోసారి మేకప్‌ కిట్‌ కొంటాం దానికి కూడా వెయ్యికి పైగా ఖర్చవుతుంది. ఈ కష్టాలన్నీ వినేవారెవరు? చిన్నప్పటి నుంచి కళ అంటే ప్రాణం. సాంఘిక నాటకాల్లో ఎక్కువగా నటించాను. రైతు సమస్యలపై రాసిన ‘పడమటి గాలి’ నాటకంలో నా పాత్ర (లచ్చిందేవి)కు చాలా మంచి పేరు వచ్చింది. పౌరాణికాల్లో బాలనాగమ్మ పాత్ర అంటే నాకు ఇష్టం.

చిన్నచూపు వల్లే మానేశా
ఎనిమిదేళ్ల వయసులో ఈ రంగానికి వచ్చాను. నలభై ఏళ్ల పాటు రంగస్థల నటిగా ఉన్నా. ఎక్కువగా చింతామణి పాత్ర వేశా. కందుకూరి పురస్కారం కూడా పొందాను. కానీ నాటకాలవాళ్లంటే ప్రజల్లో చిన్న చూపు ఉంది. ప్రేక్షకులైనా మా నటనను చూసి చప్పట్లు కొడితే అదే పదివేలు అనుకుంటాం. ఇప్పుడు అదీ దక్కడం లేదు. అందుకే బయటికి వచ్చేశాను. నా పిల్లలు కూడా ఈ రంగం వైపు రావడం నాకు ఇష్టం లేదు. 
– రజనీబాయి, రంగస్థల నటి

తల్లిలా  ఆదరించింది
ప్రేక్షకుల అభిరుచీ మారింది. అందుకు అనుగుణంగా మేము ఆడాలి. మా పిల్లలకైతే ఈ రంగం మీద ఆసక్తి లేదు. నా వయసు 54 ఏళ్లు. నాటకాల్లో నాకు 36 ఏళ్ల అనుభవం. రంగస్థలం మమ్మల్ని తల్లిలా ఆదరించింది. ఇప్పుడు రంగస్థలమే ఆదరణ కోసం చూస్తోంది. 
– విజయలక్ష్మి, అనంతపురం

రంగస్థలమే నా స్వస్థలం
మా దగ్గర ఐదారు నెలల గర్భిణులు కూడా నాటకాలు వేస్తారు. ఎందుకంటే  మరో జీవనోపాధి ఉండదు. 12 ఏళ్ల వయసులో నేను మొదటి సారి సురభి వాళ్ల దగ్గర బాలకృష్ణుడి పాత్ర వేశా. అప్పటి నుంచి రంగస్థలమే నా స్వస్థలమైపోయింది. నా కూతురు విజయశారద ఎం.ఏ వరకు చదివింది. ఆమె కూడా నాటక రంగంలోనే ఉంది. నా భర్త పేరు ఎస్వీ సెల్వం. ఆయన కూడా నాటకరంగంలోనే కాస్ట్యూమర్‌గా ఉండేవారు. మూడేళ్ల కిందట మా సొంత ఖర్చులతో ‘శ్రీనివాస కల్యాణం నాటకం’ వేశాం. అందుకు నాకు రూ.88,000 ఖర్చయింది. కానీ ప్రభుత్వం నుంచి నాకు అందిన సాయం రూ.8,000.  అలాగే ఎస్‌ఆర్‌కే అనే నాట్యమండలిని స్థాపించి రూ.1,45,000 ఖర్చుతో నాటక పోటీలు నిర్వహించాం. ప్రభుత్వం నుంచి వచ్చింది మాత్రం రూ.5,000 మాత్రమే. ప్రభుత్వం కనీసం మాకు హెల్త్‌కార్డులైనా ఇవ్వాలి. 
– విజయకుమారి (58), అనంతపురం, కళాకారిణి

అంతకాలం బతుకుతామా?!
ఇప్పుడున్న రంగస్థలం ఉన్నతంగా ఏం లేదు.  ఆడేది పాడేది రాకపోయినా రికార్డు డ్యాన్సులతో కాలం గడుపుతున్నారు. అందుకే నా పిల్లలను ఈ రంగంలోకి తీసుకురాలేదు. ఈ ప్రభుత్వాలు 60 ఏళ్లకు పింఛన్‌ ఇస్తున్నాయి. మేము అంతకాలం బతుకుతామన్న నమ్మకం కూడా లేదు. ఇంక పింఛన్‌ తీసుకునేదెప్పుడు? వై.ఎస్‌.జగన్‌ 45 ఏళ్లకే పింఛను అంటున్నారు. అది వస్తే మా బతుకులు కొంతైనా నయం అవుతాయి. 
– ఆశాలత, సురభి కళాకారిణి, శ్రీకాకుళం

వింతగా చూసేవాళ్లు
నేను ఐదేళ్ల వయసు నుంచే నాటక రంగంలో ఉన్నా. నాటకాల్లో కొన్ని ఏడ్చే సీన్ల కోసం జెండూ బామ్‌ వాడుతాం. అలా చేయడం వల్ల విపరీతమైన మంట, బాధగా ఉన్నా ప్రేక్షకులను అలరించడానికి, నాటకాన్ని రక్తి కట్టించడానికి చేయక తప్పేది కాదు. పైగా లైట్ల నుంచి వచ్చే కాంతి, వేడి వల్ల కళ్లకు చాలా ఇబ్బందిగా ఉండేది. నా చూపు తగ్గిపోవడానికి అదే కారణం. నాటకం అయ్యాక ముఖానికి వేసుకున్న మేకప్‌ తీయడానికి కొబ్బరి నూనె వినియోగించేవాళ్లం. అది అందుబాటులో లేకపోతే కిరోసిన్‌తో శుభ్రం చేసుకుని మేకప్‌ తీయాల్సి వచ్చేది. అలా చేయడం వల్ల 40 ఏళ్లకే చర్మ రోగాలు వస్తాయని తెలిసినా మాకు వేరే గత్యంతరం లేదు. నా పెద్ద కూతురు వనజకుమారికి 45 ఏళ్లు. తను గత 25 ఏళ్లుగా నాట్యమండలిలో ఉంది. నా రెండో కుమార్తె అనిత కుమారికి చిన్న వయసులో పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త సంపాదన చాలక తప్పనిసరి పరిస్థితుల్లో నాటకం వేయడం ప్రారంభించింది. ఒక్కోసారి ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితులు వస్తాయి. అన్నింటినీ దిగమింగుకుని బతుకుతున్నాం. కానీ కళ అంటే మాకు గౌరవం.
 – సరోజ, రంగస్థల నటి, అనంతపురం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement