![Stage Artist Prakash Raju Passed Away In Tirupati - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/26/prakash-raj.jpg.webp?itok=5guhqVIr)
సాక్షి, తిరుపతి: నగరానికి చెందిన ప్రముఖ రంగస్థల నటుడు ప్రకాష్‌రాజ్(82) కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి కన్నుమూశారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా నాటక రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారు. అసెంబ్లీ రౌడీ, రాయలసీమ రామన్న చౌదరి చిత్రాల్లో నటించారు. అశోక్ సామ్రాట్, రాణా ప్రతాప్, పృధ్వీరాజ్, చాణక్య చంద్రగుప్త, విశ్వనాథ నాయకుడు, లేపాక్షి, అక్భర్ అంతిమ ఘడియలు నాటకాలు ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి.
చారిత్రక నాటకాలు ప్రదర్శించడంలో ఆయన తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 1977లో భవాని కళానికేతన్ నాటక సంస్థను ఏర్పాటు చేసి కళాకారులను ప్రోత్సహించారు. జిల్లాలోని కళాకారుల్లో ఎక్కువ శాతం మంది ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నవారే. అంతేకాకుండా తన నాటకాల్లో మహిళలకు పెద్ద పీట వేసి వారికి అవకాశాలు కల్పించారు. రియల్ హీరో, రంగస్థలి రారాజు, నాటక దర్శకరత్న బిరుదులు అందుకున్నారు. ప్రకాష్‌రాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మృతికి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, పలువురు కళాకారులు నివాళులర్పించారు.
చదవండి:
టాలీవుడ్‌లో విషాదం: పొట్టి వీరయ్య కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment