కరోనా ఆడిన వింత ‘నాటకం’లో రంగస్థలం మూగబోయింది.. కోవిడ్–19 పోషించే విలన్ పాత్రకు ఎదురునిలవలేక కళాకారులంతా చిగురుటాకుల్లా వణుకుతున్నారు.. మహమ్మారి ధాటికి నిజ జీవిత పాత్రలుసైతం అర్ధంతరంగా ముగిసిపోతున్న తరుణంలో.. ఏం చేయాలో తెలియని ‘స్టేజి’లో కొట్టుమిట్టాడుతున్నారు.. వైద్యులు.. పోలీసులు వంటివారి ‘హీరో’చిత పోరాటం నెగ్గితేనే.. కళతప్పిన జీవితాల్లోకి మళ్లీ వెలుగులొస్తాయి.. ఈ యుద్ధంలో ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు.. శానిటైజర్లు.. సామాజిక దూరం వంటి ఆయుధాలు ధరిస్తేనే.. కరోనాను అంతమొందించి ‘విశ్వ’విజేతలవుతాం.. అంతవరకూ రంగస్థలానికి ‘విశ్రాంతి’ తప్పేలా లేదు.
సాక్షి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కళలకు పుట్టిల్లు వంటి జిల్లాలో నేడు కళారంగం వెలవెలబోతోంది. ఉత్సవాలు లేక, పరిషత్‌లు జరగక కళాకారులు, కళాభిమానులు నిరుత్సాహంలో ఉన్నారు. మానవ మనుగడను ప్రశ్నార్థకం చేసిన కరోనా మహమ్మారి కళారంగాన్ని కూడా తిరోగమన బాట పట్టించింది. గతంలో సమాచార సాంకేతిక విప్లవ ప్రభావంతో కళారంగం కొంత తత్తరపాటుకు గురికాగా ప్రభుత్వాలతో పాటు కళాకారులు, కళాపోషకులు ఈ రంగాన్ని పూర్వ వైభవం వైపు నడిపే దిశగా చర్యలు తీసుకున్నారు. దీనితో ఇప్పుడిప్పుడే నేటి యువతలో కళారంగంపై మక్కువ పెరగడం, కొంతమంది యువకులు సైతం రంగం వైపు ఆకర్షితులు కావడంతో ఈ రంగానికి పూర్వ వైభవం వస్తోంది అనుకునే లోపు మరో పెద్ద కుదుపు కరోనా రూపంలో రావడం దురదృష్టకరమని కళాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిలిచిపోయిన పరిషత్‌లు, పోటీలు
కళలపై సమాజ దృక్ఫథాన్ని మార్చే క్రమంలో వివిధ సంస్థలు కళారంగాన్ని ముందుకు నడిపించే బాధ్యతను తీసుకున్నాయి. దీని కోసం పరిషత్‌లు, పోటీలు ఏర్పాటు చేసి ఈ రంగాన్ని సజీవంగా నిలపడానికి తమ వంతు కృషి చేస్తున్నాయి. దీనితో కళాకారులకు కూడా ఆదరాభిమానాలు దండిగానే అందేవి. జిల్లాలో ఏటా పౌరాణిక, సాంఘిక నాటకాలతో పాటు ఏకపాత్రాభినయ పోటీలు ఎక్కడో ఒక చోట జరుగుతూ నిత్య కల్యాణం, పచ్చతోరణం చందంగా ఉండేది. జిల్లాలోని ఏలూరులో హేలాపురి కల్చరల్ అసోసియేషన్, గరికపాటి ఆర్ట్స్ కళా పరిషత్, వైఎంహెచ్‌ఏ హాలు పరిషత్, భీమవరంలో చైతన్య భారతి సంగీత నృత్య నాటిక పరిషత్, కళారంజని నాటక పరిషత్, పాలకొల్లులో పాలకొల్లు కళా పరిషత్, వీరవాసరం కళా పరిషత్, తోలేరు సుబ్రహ్మణ్య కళా పరిషత్, రాయకుదురు శ్రీ కృష్ణదేవరాయ నాటక కళా పరిషత్, కొంతేరు యూత్‌క్లబ్ కళా పరిషత్, తాడేపల్లిగూడెం బీవీఆర్ కళాపరిషత్ తదితర సంస్థలు పోటీలు నిర్వహిస్తూ కళారంగాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నాయి.
అలాగే నృత్య రంగానికి సంబంధించి ఏలూరు నగరంలోని అభినయ నృత్య భారతి వంటి సంస్థలు వివిధ శాస్త్రీయ నృత్య రీతుల్లో పోటీలు నిర్వహిస్తూ నృత్య రంగాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళుతున్నాయి. వీటిలో కొన్ని సంస్థలు నిర్వహించే పోటీలు కరోనా కాలంలో రద్దు కాగా మరికొన్ని నిర్వహించే అవకాశం ఉంటుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నాయి. దీనితో పాటు గతంలో శ్రీరామనవమి, ఉగాది వేడుకలు నిస్సారంగా జరిగిపోగా త్వరలో వచ్చే వినాయక చవితి, దసరా ఉత్సవాల్లోనైనా అవకాశాలు అందివస్తాయని భావించిన కళాకారులకు కరోనా మహమ్మారి ఇప్పటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా ఉత్సవాలను కూడా రద్దు చేసే అవకాశం ఉండడంతో ఉత్సవ కమిటీలు కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసే అవకాశం లేకుండా పోయింది. ఆ విధంగా ఆయా ఉత్సవాలు కూడా వారిని నిరుత్సాహానికి గురిచేశాయి.
కళారంగంపై ఆధారపడిన వేల కుటుంబాలు
జిల్లాలో కళారంగంపై కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. పౌరాణిక, సాంఘిక, జానపద నాటకాలు, కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు, హరికథలు, బుర్ర కథలు వంటి కళలు ప్రదర్శించే కళాకారులతో పాటు వాటికి అనుబంధంగా మేకప్, సంగీతం, రంగాలంకరణ, సౌండ్ సిస్టమ్, మైక్ అండ్ లైటింగ్, దుస్తులు అద్దెకిచ్చే వారు ఇలా అనేక వర్గాలు ఉపాధి పొందుతున్నాయి. కరోనా లాక్‌డౌన్ కారణంగా కళారంగానికి అనుబంధంగా ఉపాధి పొందుతున్న అన్ని కుటుంబాలూ పూర్తిగా తమ ఆదాయ వనరులను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయాయి.
పింఛన్ల మంజూరుతో కొద్దిగా ఊరట
ఇదిలా ఉండగా ఐదు నెలలుగా పింఛన్లు లేక గోరుచుట్టపై రోకలిపోటు చందంగా ఇబ్బంది పడుతున్న వృద్ధ కళాకారులకు ప్రభుత్వం ఒకే సారి ఐదు నెలల బకాయి పింఛన్లు విడుదల చేయడంతో కొంత ఊరట లభించిందనే చెప్పాలి. అయితే ఇది కేవలం వృద్ధ కళాకారులకు మాత్రమే రావడంతో 60 ఏళ్లలోపు వయసు కలిగిన కళాకారులు మాత్రం ఇప్పటికీ ఆకలిదప్పులతో అలమటిస్తూనే ఉన్నారు. సకల కళాకారుల సంఘం, మరికొన్ని కళా సంస్థలు, కొంతమంది దాతలు కళాకారులకు నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు వంటివి పంపిణీ చేసినా అది తాత్కాలిక ఊరటగానే చెప్పుకోవాలి.
కరోనా విలయ తాండవం నేపథ్యంలో కళాకారులను ఆదుకోవడానికి మరింత మంది కళాపోషకులు ముందుకు వస్తారనే ఆశతో కళాకారులు ఎదురు చూస్తున్నారు. ఆదాయం ఉన్నా లేకపోయినా ఆత్మగౌరవంతో జీవిస్తున్న వారి కుటుంబాలు పస్తులుంటున్న నేపథ్యంలో అభిమానాన్ని చంపుకుని కూలి పనులకు వెళ్లేందుకూ కొంతమంది కళాకారులు వెనుకడుగు వేయడం లేదు. అయితే వారికి పని ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కొన్ని కుటుంబాలు ఇప్పటికీ దుర్బర పరిస్థితులనే ఎదుర్కొంటున్నాయి. వివిధ రంగాలకు చెందిన వారిని పలువురు దాతలు ఆదుకుంటున్నట్లుగానే కళాకారులను, కళారంగంపై ఆధారపడి జీవిస్తున్న వారిని ఆదుకోవాలని కొన్ని కళా సంస్థలు పిలుపునిచ్చాయి. దానిపై దాతలు స్పందించాల్సి ఉంది.
సీఎం జగన్ మాత్రమే ఆదుకోగలరు
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 12 లక్షల కళాకారుల కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ కేవలం కళను నమ్ముకునే జీవిస్తున్నాయి. కరోనా కారణంగా దాదాపు ఏడాది చివరి వరకూ ప్రదర్శనలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే మా కళాకారుల కుటుంబాలను ఆదుకోగలరు.
–విజయ కుమార్, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రధారి
కరోనా వైరస్ కళాకారులకు మైనస్
కరోనా వైరస్ కళాకారులను మైనస్‌లో పడేసింది. 55 ఏళ్ల వయసు కలిగిన నేను చిన్నప్పటి నుంచి రంగస్థలాన్ని నమ్ముకుని జీవిస్తున్నాను. తొలుత భజనలు, అనంతరం నాటకాల్లో పాత్రలు, సంగీతం, హార్మోనియం వంటి కళలు నేర్చుకుని బుర్రకథ కళాకారుడుగా స్థిరపడ్డాను. 45 ఏళ్లకు పైగా కళారంగంలో ఉంటున్న నేను ఇంతటి సంక్షోభాన్ని ఎన్నడూ చూడలేదు.
–యడవల్లి సుబ్బరాజు, బుర్రకథ కళాకారుడు
ఆస్తులు లేవు, ఇతర పనులు చేతకాదు
నా వయస్సు 46 సంవత్సరాలు. గత 30 ఏళ్లుగా హార్మోనిస్టుగా నాటక రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్నాను. పెద్దలు సంపాదించిన ఆస్తులు లేవు. వేరే ఏ పనీ చేతకాదు. ప్రదర్శనలు లేక ఆదాయం పోయింది. పెన్షన్‌కు సరిపడే వయసూ రాలేదు. అన్ని రంగాలనూ ఆదుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ కళాకారులకు కూడా ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలి.
–యడవల్లి రమణ, హార్మోనిస్టు
Comments
Please login to add a commentAdd a comment