బృందం పర్యటన సాగిందిలా..
ఎచ్చెర్ల మండలంలో..
జిల్లాలో మొదటిగా ఈ మండలంలోని ఎస్.ఎం.పురం ప్రాంతంలో పర్యటించింది. భూముల వివరాలతో అధికారులు రూపొందించిన ప్రాథమిక మ్యాప్ ఆధారంగా పరిశీలన జరిపింది.
పొందూరు మండలంలో..
అనంతరం పొందూరు మండలంలోని బురిడి కంచరాం, ధర్మపురం, కనిమెట్ట భూములను పరిశీలించింది. భౌగోళిక పరిస్థితులు, పంటల సాగు, భూగర్భ జలాల వివరాలపై ఆరా తీసింది.
నరసన్నపేట మండలంలో..
ఉర్లాం, కామేశ్వరిపేట, జల్లువానిపేట, కొత్తపోలవలస, కొల్లవానిపేట గ్రామాల్లో పర్యటించింది. భూముల లభ్యత, పవర్ ప్లాంట్‌కు గల అనుకూలతలను పరిశీలించింది.
ఎచ్చెర్ల, పొందూరు, నరసన్నపేట:జిల్లాలో మరో పవర్ గేమ్ మొదలైంది. ఇప్పటికే సోంపేట, కాకరాపల్లి పవర్ ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతుండగా కొత్తగా జపాన్ సంస్థ సుమితొమొ ఆధ్వర్యంలో ప్రతిపాదించిన 4వేల మెగావాట్ల అల్ట్రా మెగా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌కు స్థల పరిశీలన మొదలైంది. సుమితొమొ-జెన్‌కో ప్రతినిధుల బృందం మంగళవారం జిల్లాలోని ఎచ్చెర్ల, ఆమదాలవలస, నరసన్నపేట నియోజకవర్గాల్లోని ప్రతిపాదిత భూములను పరిశీలించింది. తొమ్మిది మంది సభ్యుల జపాన్ బృందంతోపాటు జెన్‌కో చీఫ్ ఇంజినీర్ నాగేశ్వర్‌బాబు, ఎస్‌ఈ రంగనాథం, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఎల్.సుబ్రమణ్యం, ఎల్.సూర్యనారాయణ తదితర పది మంది సభ్యులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎచ్చెర్ల, పొందూరు మండలాల్లో, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నరసన్నపేట మండలంలోనూ ఈ బృందాలతో పర్యటించి వివరాలు అందజేశారు.
మ్యాప్‌ల ఆధారంగా పరిశీలన
మొదట ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురం ప్రాంతంలో పర్యటించిన బృందానికి స్థానిక అధికారులు రూపొందించిన మ్యాపు అందజేశారు. ఇందులో ఎస్.ఎం.పురానికి చెందిన 601.02, పొందూరు మండలంలో కనిమెట్టకు చెందిన 746. 40, బురిడి కంచరాంకు చెందిన 438.12, కింతలికి చెందిన 38.71, తోలాపికి చెందిన 190.55, ధర్మపురానికి చెందిన 271.82, నందివాడకు చెందిన 10 4.92 ఎకరాలు.. మొత్తం 2391.55 ఎకరాల భూములను సూచిం చారు. అనంతరం పొందూరు మండలంలోని బురిడికంచరాం,ధర్మపురం, కనిమెట్ట భూములను పరిశీలించారు. భూముల పరిస్థితి, పంటల సాగు, భౌగోళిక పరిస్థితి, తదితర అంశాలను ఆరా తీశారు. అయితే ప్రభుత్వ స్థలం ఉందని అధికారులు చెబుతున్న కొండ ప్రాంతాన్ని మాత్రం జపాన్ బృందం పరిగణనలోకి తీసు కోలేదు. మరోపక్క చెరువు గర్భం 200 ఎకరాలుగా గుర్తించారు. ఎలాగైనా ఈ ప్రాంతంలోనే ప్రాజెక్టు ఖరారు చేయించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ విప్, జెన్‌కో అధికారులు ప్రయత్నించగా.. జపాన్ బృందం ప్లాంట్, టౌన్‌షిప్, ఇతరత్రా అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్థల పరిశీలన చేశారు.
పోలీసుల మోహరింపు
ఈ పర్యటన సందర్భంగా శ్రీకాకుళం డీఎస్పీ భార్గవరావు నాయుడు, జేఆర్‌పురం సీఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ధర్మపురం నుంచి ఎస్‌ఎం పురం వరకు పోలీసులను మోహరించారు.పోలీసులు ముందుగా ఈ ప్రాంత గ్రామాల్లో సివిల్ దుస్తుల్లో తిరుగుతూ పరిస్థితిని ఆరా తీశారు. అయితే ప్రాజెక్ట్‌పై ఇంకా పూర్తిగా అవగాహన లేకపోవడంతో ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు.
ఎచ్చెర్ల నాయకులు దూరం
ఎస్‌ఎంపురం భూముల పరిశీలన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ చౌదరి అవినాష్, ఇదే గ్రామానికి చెందిన జడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి తదితరులు హాజరు కాలేదు. బృందం పర్యటన సమాచారం కూడా వీరికి తెలియజేయలేదని తెలిసింది.
ఉర్లాం ప్రాంతంలో..
అనంతరం ఈ బృందం మంగళవారం సాయంత్రం నరసన్నపేట మండలంలో పర్యటించింది. ఉర్లాం, కామేశ్వరిపేట, జల్లువానిపేట, కొత్తపోలవలస, కొల్లవానిపేట తదితర గ్రామాల భూములను పరిశీలించారు. ఉర్లాం సమీపంలోని మూర్తిరాజు కాల్వ నుంచి రెండు వైపులా కన్పిస్తున్న పంట భూములను పరిశీలించారు. జపాన్ బృంద నాయకుడు యువమోటోకు జెన్‌కో ప్రతినిధి సీవీ రంగనాథన్, స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, తహశీల్దార్ సుధాసాగర్‌లు భూముల సమాచారం అందజేశారు. ఈ ప్రాంతంలో 2600 ఎకరాల భూమి ఉందని, దీంట్లో 600 వరకూ ప్రభుత్వ భూమి అని వివంచారు. రెండు కిలోమీటర్ల పరిదిలో రైల్వే స్టేషన్, 23 కిలోమీటర్లు పరిదిలో కళింగపట్నం పోర్టు, ఐదు కిలో మీటర్ల పరిధిలో జాతీయ రహదారి ఉన్నాయని వివరించారు. ప్రధాన నీటి వనరుగా వంశధార నది ఉందని తెలిపారు. అలాగే గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా ఆశాజనకంగా ఉంటుందని వివరించారు. వీరి వెంట శ్రీకాకుళం ఆర్డీఓ దయానిధి ఇతర అధికారులు పాల్గొన్నారు. పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.
మొదలైంది మరో.. పవర్ గేమ్
Published Wed, Mar 4 2015 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM
Advertisement
Advertisement