సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని సముద్ర తీరం అనూహ్యమైన మార్పులకు లోనవుతోంది. దేశంలో గుజరాత్ తర్వాత అతి పెద్దదైన మన రాష్ట్రంలోని తీరం.. 42 శాతం ఇసుక మేటల వల్ల తీవ్రంగా ప్రభావితమవుతోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు తొమ్మిది జిల్లాల్లో 1,027.58 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న తీరంలో 434.26 (42 శాతం) కిలోమీటర్ల మేర ఇసుక మేటలు వేసింది. 272.34 కిలోమీటర్ల తీరం (27%) కోతకు గురవుతుండగా, 320.98 కి.మీ. (31%) తీరం స్థిరంగా ఉంది. చెన్నై కేంద్రంగా పనిచేసే నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ విభాగం 1990 నుంచి 2016 వరకు సముద్ర తీరంలోని మార్పులను శాటిలైట్ చిత్రాలు, రిమోట్ సెన్సింగ్, క్షేత్ర స్థాయి సమాచారం ద్వారా అధ్యయనం చేసి, ఇటీవల విడుదల చేసిన నివేదికలో పలు విషయాలను వెల్లడించింది.
కృష్ణా, తూర్పుగోదావరిలో ప్రమాదకర మార్పులు
కృష్ణా జిల్లాలో 40.30 కి.మీ. తీరం ప్రమాదకర స్థాయిలో కోతకు గురవుతుండగా, 29.18 కి.మీ. మేర ఇసుక మేటలు వేశాయి. తూర్పుగోదావరి జిల్లాలో 45 కి.మీ. తీవ్రంగా కోతకు గురవుతుండగా, 33.10 కి.మీ. ఇసుక మేటలున్నాయి. ఈ రెండు జిల్లాల్లోనే కోతలు, మేటలు ఎక్కువగా ఉంటున్నాయి. విశాఖలో 102.74 కి.మీ., శ్రీకాకుళంలో 81.60 కి.మీ. తీరం స్థిరంగా ఉంది. కైలాసగిరి, యారాడ కొండలు విశాఖ తీరాన్ని స్థిరంగా ఉండేలా చేస్తున్నాయి. విజయనగరం తీరం కూడా స్థిరంగా ఉంటోంది. నెల్లూరు జిల్లా తీరంలో కొన్ని చోట్ల మేటలు కనిపిస్తుండగా, ఎక్కువ ప్రాంతం స్థిరంగా ఉంది. ప్రకాశం, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని తీరంలో ఇసుక మేటలు బాగా ప్రభావితం చేస్తున్నాయి. గడిచిన 26 ఏళ్లలో పశ్చిమబెంగాల్ తీరం 40 శాతం కోతకు గురై 99 చదరపు కి.మీ. తీరాన్ని కోల్పోయింది. 40 శాతం ఇసుక మేటలు వేయడంతో ఒడిశాలో ఆ మేర తీరం పెరిగింది. దేశం మొత్తం మీద 231.50 చ.కి.మీ. ఇసుక మేటలు వేసి తీరం పెరగ్గా, 234.25 చ.కి.మీ. కోత వల్ల తీరం కోల్పోయింది.
ఒకచోట పెరిగితే మరో చోట తగ్గుతుంది
సముద్ర తీరం ఒకచోట కోతకు గురైతే మరో చోట పెరుగుతుంది. రాష్ట్రంలో ఉప్పాడ తీరాన్ని బట్టి మార్పులను అంచనా వేస్తారు. ఇటీవలి కాలంలో కోత ప్రమాదకర స్థాయిలో ఉంటోంది. తీరానికి ఎక్కడైనా అడ్డుకట్ట (నిర్మాణాలు, జెట్టీలు వంటివి) పడితే మరో చోట మార్పు కనిపిస్తుంది. ఒక్క ప్రాంతాన్నే చూస్తే అక్కడి వరకే కనిపిస్తుంది. అలా కాకుండా మొత్తం తీరాన్ని పరిశీలిస్తే ఎక్కడ పెరిగింది.. ఎక్కడ తగ్గింది తెలుస్తుంది. ఈ అధ్యయనం చాలా నిశితంగా, సంవత్సరాలపాటు చేస్తేగానీ ఏం జరుగుతుందో అర్థం కాదు.
– వీఎస్‌ఎన్ మూర్తి, రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ (ఓషనోగ్రఫీ)
తీరం కోతకు కారణాలివే..
- బంగాళాఖాతంలో ఏర్పడే తుపానుల వల్ల రాష్ట్రంలోని తీరం ఎక్కువగా మార్పులకు లోనై కోతకు గురవుతోంది.
- సాధారణ పరిస్థితుల్లో గాలి వేగం, సముద్ర మట్టాల్లోని తేడాలు, తరచూ మారే వాతావరణ పరిస్థితులు, పర్యావరణం కారణంగానూ తీరం తీరు మార్చుకుంటోంది.
-పోర్టులు, హార్బర్లు, ఫిషింగ్ జెట్టీలు, తీరంలో ఆధునిక సౌకర్యాల కోసం జరిగే మార్పుల వల్ల కూడా ప్రభావితమవుతోంది.
నష్ట నివారణ ఇలా..
- మానవ విధ్వంసాల్ని వీలైనంతగా తగ్గించాలి.
- కోస్టల్ రెగ్యులేటరీ నిబంధనలను (కట్టడాల సైజు, ఏ ప్రాంతంలో కట్టాలి.. ఎక్కడ కట్టకూడదు.. తదితరాలు) తప్పక పాటించాలి.
- నదులు సముద్రంలో కలిసే చోట అడ్డంకులు లేకుండా చూడాలి.
- సముద్రంలో కాలుష్య కారకాల విడుదలను తగ్గించాలి.
- తీరంలో ఆటుపోట్లకు విఘాతం కలుగకుండా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment