అక్కడ రాజ్యాంగమే మారిపోయింది
నోటిఫైడ్ ఏరియా కమిటీలు 74వ రాజ్యాంగ సవరణతోనే రద్దు
అయినా రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయం నోటిఫైడ్ ఏరియాగా గుర్తింపు
పంచాయతీ.. మునిసిపాలిటీల్లో లేని ‘జీఎంఆర్’
‘ఐలా’లోనూ లేదు.. పన్నులు ఎవరికీ చెల్లించకుండా సొంత కమిటీ
ఒప్పందం ప్రకారం రోడ్లు వేయాల్సిన జీఎంఆర్..
తాజాగా నోటిఫైడ్ ఏరియా కాలాన్ని మరో మూడేళ్లు పొడిగించడం గమనార్హం
సాక్షి, హైదరాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం రాజ్యాంగమే మారిపోయింది. 74వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 243 (క్యూ)తో నోటిఫైడ్ ఏరియా కమిటీలు రద్దయ్యాయి. పరిశ్రమలు, పోర్టులు, విమానాశ్రయాలు ఏవైనా సరే.. అవి పంచాయతీ లేదా మునిసిపాలిటీ పరిధిలోకి రావాల్సిందే. లేదంటే స్థానిక పారిశ్రామిక ప్రాంత సంస్థ(ఐలా)లా ఉండాలి. కానీ, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రం ఇందుకు భిన్నంగా నోటిఫైడ్ ఏరియాగా గుర్తించారు. దీని వల్ల స్థానిక సంస్థలకు ఈ విమానాశ్రయంపై ఎలాంటి అధికారాలు ఉండవు. విమానాశ్రయ సంస్థదే ఇష్టారాజ్యం. నిర్మాణ అనుమతులు, పన్నుల వసూళ్లు తదితర అంశాలు స్థానిక సంస్థల పరిధిలోకి రావు.
రాజీవ్‌గాంధీ విమానాశ్రయ యాజమాన్యం నోటిఫైడ్ ఏరియాగా 1965 రాష్ట్ర మున్సిపల్ చట్టం 389 (ఏ) కింద ఉత్తర్వులు తెచ్చుకుంది. వాస్తవానికి 74వ రాజ్యాంగ సవరణ తర్వాత అందుకు అనుగుణంగా రాష్ట్ర మున్సిపల్ చట్టాన్ని ఏడాదిలోగా సవరించుకోవాలి. సవరించుకోని పక్షంలో రాష్ట్ర చట్టంలోని నిబంధనలు ఆటోమేటిక్‌గా తొలగుతాయి. 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం నోటిఫైడ్ ఏరియాగా గుర్తించడానికి వీల్లేదని పురపాలక శాఖ అధికారి ప్రభుత్వానికి స్పష్టం చేసిన తర్వాత కూడా ఈ విమానాశ్రయానికి మరో మూడేళ్ల పాటు నోటిఫైడ్ ఏరియా కమిటీగా గుర్తింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
ఏప్రిల్ 24 నుంచి అమలులోకి వచ్చేలా పురపాలక శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. 74వ రాజ్యాంగ సవ రణతో నోటిఫైడ్ ఏరియా కమిటీలుగా ఉన్న రామగుండం, మందమర్రి, పాల్వంచలను మునిసిపాలిటీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొత్తగా నోటిఫైడ్ ఏరియా కమిటీలను ఏర్పాటు చేయలేదు. కానీ జీఎంఆర్‌ను మాత్రం నోటిఫైడ్ ఏరియా కమిటీగా గుర్తించారు. అంతర్జాతీయ విమానాశ్రయం స్థానిక సంస్థ పరిధిలో ఉంటే ఆరేడు కోట్ల రూపాయలు మేరకు ఆస్తి పన్ను చెల్లించాల్సి వచ్చేదని ఓ అధికారి చెప్పారు. జీఎంఆర్ సంస్థ విమానాశ్రయంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా.. సొంత నిధుల నుంచి ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ మధ్య ఒక రహదారి కోసం రూ. పది కోట్లు నోటిఫైడ్ ఏరియా కమిటీ ఫండ్ నుంచి వినియోగించడంపై కమిటీలోని ప్రభుత్వ అధికారి ఒకరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ఆ నిధులను జీఎంఆర్ తిరిగి కమిటీకి జమ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మునిసిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ పరిధిలోని పారిశ్రామిక వాడల్లో సరైన మౌలిక వసతులు కల్పించడం లేదన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఇండస్ట్రీయల్ ఏరియా లోకల్ అథారిటీ(ఐలా)లను ఏర్పాటు చేసింది.
ఆ విధంగా రాష్ట్రంలో దాదాపు 76 ఐలాలు ఉన్నాయి. ఈ ఐలాల్లో వసూలవుతున్న పన్నుల్లో 35% స్థానిక సంస్థకు (మునిసిపాలిటీ లేదా గ్రామ పంచాయతీకి) చెల్లిస్తూ.. మిగిలిన 65% నిధులను ఆ ప్రాంతంలో అభివృద్ధి కోసం వినియోగించుకుంటున్నాయి. జీఎంఆర్ విమానాశ్రయం నోటిఫైడ్ ఏరియాగా ఉండడంతో.. ఆ 35% నిధులు ఏ సంస్థకూ చెల్లించడం లేదు. నోటిఫైడ్ ఏరియా కమిటీలో ప్రభుత్వ ఉన్నతాధికారులు నలుగురు ఉన్నా.. ఒకరిద్దరు కూడా సమావేశాలకు వెళ్లడం లేదు. సమావేశం మినిట్స్ వస్తే.. వాటిపై సంతకాలు చేసి పంపిస్తున్నట్లు సమాచారం.