రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలు రాగానే వీలైనంత త్వరగా అంటే రెండు నెలల్లో ప్రక్రియను పూర్తి చేయాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించింది.
కమలనాథన్ కమిటీ భేటీలో నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలు రాగానే వీలైనంత త్వరగా అంటే రెండు నెలల్లో ప్రక్రియను పూర్తి చేయాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించింది. రాష్ట్రస్థాయి కేడర్ పంపిణీ మార్గదర్శకాలు తదితర అంశాలపై ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ, ఇకనుంచి చేపట్టాల్సిన చర్యలపై కమలనాథన్ అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగిన సమావేశంలో సమీక్షించారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు శాఖలు, విభాగాలు వారీగా రెండు రాష్ట్రాలకు ఎలా పంపిణీ చేయాలనే దానిపై చర్చించారు. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించేందుకు వచ్చే నెల 1వ తేదీన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ప్రత్యేకంగా రెండు రాష్ట్రాలు సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 14న హైదరాబాద్‌లో కమలనాథన్ కమిటీ సమావేశం కానుంది. దీనికి ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో పాటు కమిటీలో సభ్యురాలైన కేంద్ర వ్యక్తిగత సిబ్బంది-శిక్షణ విభాగం సంయుక్త కార్యదర్శి కూడా హాజరవుతారు. రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగులనుంచి ఆప్షన్లు తీసుకోవడానికి ఆన్‌లైన్ అప్లికేషన్ రూపొందించే పనిని సీజీజీకి అప్పగించనున్నారు. పునర్విభజన విభాగాన్ని పటిష్టతకు ఈ విభాగానికి సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు.