ఆధునికీకరిస్తే గండికి నీరు దండి | The State Government Has Recognized that The Main Canal Has To Be Modernized To Store Water In The Gandikota Project | Sakshi
Sakshi News home page

ఆధునికీకరిస్తే గండికి నీరు దండి 

Published Sat, Jul 27 2019 10:48 AM | Last Updated on Sat, Jul 27 2019 10:48 AM

The State Government Has Recognized that The Main Canal Has To Be Modernized To Store Water In The Gandikota Project - Sakshi

గండికోట ప్రాజెక్టులో 26 టీఎంసీల నీటిని నిల్వ చేయాలంటే ప్రధాన కాలువను ఆధునికీకరించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ పనులను తక్షణం చేపట్టకపోతే లక్ష్యం మేరకు నీరు 
చేరడం కష్టమని భావిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ హయాంలో కాలువ పనులలో సింహభాగం పూర్తయినా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కనీసం పది శాతం పనుల 
పూర్తికి కూడా టీడీపీ ప్రభుత్వం నిధులు విదిలించలేదు. తాజాగా గండి ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన జగన్‌ ప్రభుత్వం కాలువ ఆధునికీకరణకు చేపట్టాల్సిన చర్యలను పరిశీలిస్తోంది. తర్వాత నిధుల విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

సాక్షి ప్రతినిధి కడప : గండికోటలో అనుకున్న మేర నీరు నిల్వ ఉంచడానికి ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించడానికి సర్కారు సిద్ధమవుతోంది. ఎగువన కర్నూలు జిల్లాలోని ఎస్‌ఆర్‌బీసీ (ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌) పరిధిలో కాలువ ఆధునికీకరణ పనులను పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉంది. 20 వేల క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన ప్రధాన కాలువ స్థాయి ప్రస్తుతం పది వేల క్యూసెక్కులకు పడిపోయిందంటే పరిస్థితి అర్ధమవుతుంది. 20 వేల క్యూసెక్కుల నీరు దిగువకు రావాలంటే ఎగువన పెండింగ్‌లో ఉన్న పనులను అత్యవసరంగా పూర్తి చేయాల్‌. అప్పుడే వరదసమయాన గండికోట ప్రాజెక్టులో అనుకున్న మేర నీరు నిలిపే అవకాశముంటుందని నీటిపారుదల అధికారులు చెబుతున్నారు. అధికారుల నివేదిక మేరకు త్వరలోనే పెండింగ్‌ పనులు పూర్తికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నట్లు తెలిసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ హయాంలో రూ.3వేల కోట్లు వెచ్చించి 80శాతం పనులను పూర్తి చేయించారు. గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేయలేకపోయింది. 

పెండింగ్‌ పనులు ఇలా....
►ప్రధాన కాలువ పరిధిలో బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి గోరకల్లు వరకూ, అక్కడి నుంచి అవుకు టన్నెల్‌ వరకూ కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
►బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి గోరకల్లు వరకు ప్రధాన కాలువలో కొన్ని స్ట్రక్చర్స్‌ వైండింగ్‌ పనులను చేపట్టాలి.
►కాలువ లైనిం గ్‌పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
►కేసీ కెనాల్‌ కాలువ క్రాసింగ్‌ల వద్ద స్ట్రక్చర్స్‌ను నిర్మించాలి.
ఎస్‌ఆర్‌బీసీ ప్రధాన కాలువ ఆధునికీకరణ జరగక సగం నీరు కూడా దిగువకు రావడం లేదు. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం 40 రోజులు మాత్రమే వరద ప్రవాహం వచ్చే కాలమని లెక్క కట్టారు. ప్రస్తుతం వరద కాలువ కాల పరిధి 20 నుంచి 30 రోజులకు తగ్గిపోయింది. రోజుకు 20 వేల క్యూసెక్కుల నీరు దిగువకు చేరితే 20 రోజుల్లో గండికోటలో 26 టీఎంసీల నీటిని నిలిపే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం పది వేల క్యూసెక్కులకు మించి నీరొచ్చే పరిస్థితి లేదు. 26 టీఎంసీల నీరు గండికోటకు చేరేందుకు నెల రోజులు పట్టే అవకాశం ఉంది. వరద కాలువ తగ్గిపోయిన నేపథ్యంలో 20 నుండి 26 టీఎంసీల నీటిని నిలపాలంటే కచ్చితంగా ఎస్‌ఆర్‌బీసీ కాలువ నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు తీసుకు రావాల్సి ఉంది. అందుకే తక్షణమే ఎస్‌ఆర్‌బీసీ పరిధిలో పెండింగ్‌ పనులను పూర్తి చేయాల్సిన అవసరముందని గుర్తించారు. 

ఆధునికీకరణ పనులు ఇలా..
ప్రధాన కాలువ గోరకల్లు వరకు రూ.99 కోట్ల విలువైన పనులు చేపట్టాల్సి ఉంది. 26వ ప్యాకేజీలో రూ.85 కోట్ల పనులు జరగాల్సి ఉంది. అవుకు టన్నెల్స్‌ పూడికతీతతోపాటు మిగిలి పనులు పూర్తికి మరో రూ. 60కోట్లు అవసరం. మొత్తంగా రూ. 244 కోట్లు అవసరమని భావిస్తున్నారు. కరువుతో అల్లాడుతున్న మన జిల్లా రైతాంగం బాధలు తొలగించేందుకు సిద్దమైన ప్రభుత్వం గండికోటపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది 20 టీఎంసీలు, వచ్చే ఏడాది 26 టీఎంసీల నీటిని నిల్వ చేసి సాగుకు అందించాలని కంకణం కట్టుకుందిది. వరద సమయంలో సకాలంలో జిల్లాకు నీరు తీసుకువచ్చేందుకు ఎస్‌ఆర్‌బీసీ ప్రధాన కాలువలో పెడింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ పనులుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అధికారులు అందించినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement