వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో ఎందుకు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారో చెప్పాలని టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు డిమాండ్ చేశారు.
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో ఎందుకు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారో చెప్పాలని టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు డిమాండ్ చేశారు. జైలులో దీక్ష చేసేందుకు చట్టాలు అనుమతిస్తాయా? ఈ విషయంలో కేంద్ర హోంశాఖ వివరణ ఇవ్వాలన్నారు. ఆదివారం ఆయన ఎన్టీఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర మంత్రులంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ దీక్షను ప్రభుత్వమే స్పాన్సర్ చేస్తుందనే అనుమానం కలుగుతోందన్నారు. చంచల్‌గూడ జైలు వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంగా మారిందని, అక్కడి నుంచే వ్యాపార లావాదేవీలన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. దీక్ష చేసి నీరసించిన తర్వాత లేదా అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి తరలిస్తే అప్పుడు పరామర్శల పర్వం నడుస్తుందని, అందుకే వెంటనే జగన్‌ను తీహార్ జైలుకు తరలించాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రశ్నలకు బదులేది: ముద్దుకృష్ణమ నాయుడు విలేకరుల సమావేశానికి ‘సాక్షి’ ప్రతినిధిని అనుమతించలేదు. వి విధ రూపాల్లో సమాచారం సేకరించి ఈ వార్తను ఇస్తున్నాం. ఒకవేళ అనుమతిస్తే ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టాలని సాక్షి భావించింది.
ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ఏకపక్షంగా నిరంకుశ వైఖరితో విభజన నిర్ణయం తీసుకున్నందుకు నిరసనగా జగన్ జైలులో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్టు స్పష్టంగా ప్రకటించినప్పటికీ జైలులో ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు కదా.. ప్రజల పక్షాన చంద్రబాబు నిలబడనంత మాత్రాన మరెవరూ అండగా ఉండకూడదన్నది మీ ఉద్దేశమా?
సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారే... మరి చంద్రబాబు, మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం పదవులను పట్టుకుని వేలాడుతారా... అన్న ప్రశ్న ఉదయిస్తుంది కదా దానికేమని సమాధానమిస్తారు?