కోడెలకు అసమ్మతి సెగ | Conflicts In TDP Party | Sakshi
Sakshi News home page

కోడెలకు అసమ్మతి సెగ

Published Mon, Apr 16 2018 7:45 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

Conflicts In TDP Party - Sakshi

పోటీ నిరాహార దీక్షలో ఎంపీపీ కె.ప్రభాకరరావు, నాయకులు

నరసరావుపేట రూరల్‌: నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరింది. సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు, అతని కుమారుడు డాక్టర్‌ శివరామకృష్ణ తీరును నిరసిస్తూ మార్కెట్‌ యార్డ్‌  మాజీ చైర్మన్‌ పులిమి వెంకటరామిరెడ్డి ఆమరణ దీక్షకు దిగారు. నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌ని ప్రకటించి పార్టీని బతికించాలంటూ ఆయన పాలపాడులోని స్వగృహంలో ఆదివారం భార్య, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు కోటేశ్వరమ్మతో కలసి ఆమరణ దీక్షను ప్రారంభించారు. ముందుగా ఎన్‌టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జ్‌ లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. కోడెల శివప్రసాదరావు కుమారుడు నరసరావుపేటలో దందా లు చేస్తూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నాడని ఆరోపించారు.

దీనిపై గతంలో ఎన్నోమార్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయలు, పార్లమెంట్‌ సభ్యుడు రాయపాటి సాంబశివరావు, జిల్లా మంత్రి పత్తిపాటి పుల్లారావుకు విజ్ఞప్తి చేసినప్పటికీ వారు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. స్పీకర్‌ కోడెలకు భయపడి అతని కుమారుడి ఆగడాలను ప్రశ్నించలేక పోతున్నారని తెలిపారు. ఇలాగే కొనసాగితే దీని ప్రభావం రానున్న ఎన్నికల్లో పార్లమెంట్‌ నియోజక వర్గంపై పడుతుందని తెలిపారు. పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్న కోడెల కుమారుడిని నరసరావుపేట నియోజకవర్గం నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటికే మూడుసార్లు పార్టీ ఓటమి పాలయిందని, ఇప్పటి             కైనా మేల్కొనకపోతే తీవ్రంగా నష్టం పోవాల్సి వస్తుందని తెలిపారు. 30 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్న వారు కూడా యువ నాయకుడి వల్ల   దూరంగా వెళుతున్నారని పేర్కొన్నారు. రెండు రోజుల్లో పార్టీ అధిష్టానం దీనిపై స్పందించకుంటే తన ఇద్దరు కుమారులు, కోడళ్లతో దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

దివ్యాంగుల జేఏసీ మద్దతు
దీక్షకు రాజధాని దివ్యాంగుల జేఏసీ నాయకులు మద్దతు పలికారు. రొంపిచర్ల మండలం తుంగపాడుకు చెందిన ఏనుగంటి వెంకట కృష్ణారావు ఆమరణ దీక్షలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. జేఏసీ నాయకులు గొట్టిపాటి లక్ష్మణ్‌ మాట్లాడుతూ నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల కుమారుడు నియంతృత్వ  ధోరణితో వ్యవహరిస్తున్నారని తెలిపారు. రెండు కాళ్లులేని వికలాంగుడైన కృష్ణారావు మీద చోరీ కేసు పెట్టి వేధింపులకు గురి చేశారన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పలువురి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని వాపోయారు. పాము తన పిల్లలను తానే తింటున్నట్టుగా నియోజకవర్గంలో పరిస్థితి ఉందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ అసమ్మతి నాయకులు కొల్లి బ్రహ్మయ్య, చల్లా సుబ్బారావు, జాలాది సత్యం, వాసిరెడ్డి రవి, వడ్లమూడి శివరామయ్య పాల్గొన్నారు. దీక్షకు మద్దతుగా గ్రామస్తులు  పాల్గొన్నారు. 

ఎంపీపీ ప్రభాకరరావు పోటీ దీక్ష
నియోజకవర్గ అసమ్మతి నాయకులు దీక్షకు దిగడంతో ఆ పార్టీలోని మరో వర్గం గ్రామంలో పోటీ దీక్షను ప్రారంభించారు. గ్రామానికి ఎంపీపీ కె.ప్రభాకరరావు, టీడీపీ నాయకులు అలవాల సాంబిరెడ్డి, అడపా వెంకటరెడ్డి, కొమ్ముల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. స్పీకర్‌ కోడెల ఆశీస్సులతో పదవులు పొందిన నాయకులు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎంపీపీ కె.ప్రభాకరరావు తెలిపారు. గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందనేది అవాస్తవం అన్నారు. ఇరు వర్గాల దీక్షలతో పోలీసులు గ్రామంలో 144 సెక్షన్‌ విధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement