రాష్ట్రానికి ‘ఝజ్జర్’ కాంతులు
- వచ్చే నెల నుంచి 222 మెగావాట్లు
- ఊహించని విధంగా కేంద్రం విద్యుత్ కేటాయింపులు
- అక్టోబర్ నుంచి 374 మెగావాట్లకు పెంపు
- సెప్టెంబర్ వరకు ఏపీకీ 304 మెగావాట్లు
- ఢిల్లీ వదులుకున్న వాటాను పంచిన కేంద్ర సర్కారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అనూహ్యంగా కేంద్రం నుంచి 222 మెగావాట్ల విద్యుత్ కేటాయింపులు లభించాయి. వేసవి అవసరాలను తీర్చేందుకు అదనపు విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుండగా.. ఎవరూ ఊహించని విధంగా ఈ కరెంటు అందుబాటులోకి రావడం అధికారవర్గాలను ఆశ్చర్యపరిచింది. హరియాణాలోని ఝజ్జర్ జిల్లాలో ఉన్న ‘ఇందిరాగాంధీ సూపర్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు’(ఐజీఎస్‌టీపీఎస్) నుంచి ఉత్పత్తవుతున్న 693 మెగావాట్లను గతంలో కేంద్రం ఢిల్లీకి కేటాయించగా.. ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కరెంటును కేంద్రానికి తిరిగిచ్చేసింది.
ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పునఃకేటాయింపుల్లో భాగంగా.. ఈ విద్యుత్ నుంచి 304 మెగావాట్లను ఆంధ్రప్రదేశ్‌కు, 222 మెగావాట్లను తెలంగాణకు, 167 మెగావాట్లను కేరళకు కేటాయించింది. మూడు రాష్ట్రాలకు వచ్చే నెల(ఏప్రిల్) 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ విద్యుత్ పంపిణీ జరగనుంది. తర్వాత అక్టోబర్ నుంచి తెలంగాణకు ఝజ్జర్ నుంచి వచ్చే కోటా 374 మెగావాట్లకు పెరగనుంది.
ఈ మేరకు 2015 అక్టోబర్ 1 - 2016 మార్చి 31 మధ్య కాలంలో ఝజ్జర్ విద్యుత్ పంపిణీలో భాగంగా మరో కోటాను కేంద్రం నిర్ణయించింది. మొత్తం 693 మెగావాట్లలో తెలంగాణకు 374 మెగావాట్లు, కేరళకు 319 మెగావాట్లు కేటాయించింది. ఈ మేరకు జరిపిన పునః కేటాయింపులను అమలు చేయాలని కోరుతూ కేంద్ర విద్యుత్ సంస్థ(సీఈఏ)కు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డి.గుహ ఈ నెల 19న లేఖ రాశారు.