రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లాలో విద్యార్థి జేఏసీ, ఎన్‌జీఓలతో పాటు వివిధ పార్టీలు నిర్వహిస్తున్న సమైక్య ఉద్యమం 11వ రోజు ఉప్పెనలా సాగింది. శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వెంకటగిరి, ఉదయగిరిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసనలు హోరెత్తాయి. ఎన్‌జీఓ నేతలు ఆందోళనలు కొనసాగించారు. విద్యార్థులు ర్యాలీలు నిర్వహించి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు.
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆత్మకూరు బస్టాండువద్ద హిజ్రాలు వినూత్న నిరసన తెలిపారు. కేసీఆర్ వేషధారణలోని ఓ వ్యక్తితో హిజ్రాకు పెళ్లి చేశారు. అనంతరం కేసీఆర్‌ను చంపి హిజ్రాను వితంతువును చేస్తూ తమదైన శైలిలో నిరసనను తెలిపారు. ఈ కార్యక్రమంలో హిజ్రాలతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అర్బన్ ఆర్యవైశ్య సం ఘం ఆధ్వర్యంలో వ్యాపారులు, కార్మికులు సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బడిబాటతో విద్యార్థుల నిరసనన తెలిపారు. దీంతో ట్రాఫిక్ ఆగిపోయింది.
అన్నమయ్య సర్కిల్‌లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం సీఎం కిరణ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బస్టాండు ఎదుట మానవహారం నిర్వహించారు. సమైక్య రాష్ట్ర పర్యవేక్షణ వేదిక ఆధ్వర్యంలో మోటారు సైకిల్ ర్యాలీ జరిగింది. టీడీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆ పార్టీ కార్యకర్తలు నగరంలో ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
గూడూరు ఐసీఎస్ రోడ్డు ప్రాంతంలోని కూరగాయల మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాపారులంతా దుకాణాలకు తాళాలు వేశారు. అనంతరం రోడ్డుపైనే వంట వార్పు నిర్వహించారు. అక్కడే సహపంక్తి భోజనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కోట, చిట్టమూరు, వాకాడు మండలాల జర్నలిస్ట్‌లు సమైక్యాంధ్రకు కోట క్రాస్‌రోడ్డులో వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. చిట్టమూరు, వాకాడులో కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ముత్తుకూరులో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం బంద్ పాటించారు. ఈ సందర్భంగా ఆదాల మాట్లాడుతూ తెలంగాణ విభజనతో భవిష్యత్ ప్రశ్నార్థకమైందన్నారు. పొదలకూరులో సమైక్యాంద్రకు మద్దతుగా ముస్లింలు భారీ ప్రదర్శన నిర్వహించారు. కావలిలో సమైక్యాంధ్రకు మద్దతుగా పండ్లు, తోపుడు బండ్ల వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. వైకుంఠపురం పవర్ యూత్ ఆధ్వర్యంలో కేసీఆర్, సోనియా విచిత్ర వేషధారణలతో ట్రాలీపై ర్యాలీ సాగింది.
శ్రీపొట్టిశ్రీరాములు బొమ్మ సెంటర్లో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యాన ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో కబడ్డీ ఆడుతూ నిరసన తె లిపారు. వెంకటగిరి పట్టణంలో పోలేరమ్మ గుడివద్ద నుంచి కాశీపేటవరకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బంగారుపేటలో సమైక్యపోరాట సమితి ఆధ్వర్యంలో వంటావార్పు, మహిళా పవర్ నాయకుల ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన, అడ్డరోడ్డు సెంటర్‌లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు.
ఉదయగిరి బస్టాండులో వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ, రాస్తారోకో చేశారు. దుత్తలూరు సెంటర్లో విద్యార్థులు రాస్తారోకో, వరికుంటపాడు మండలం ఇరువూరులో మానవహారం, వింజమూరులో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలో కళాశాల విద్యార్థుల రాస్తారోకో నిర్వహించారు.
సూళ్లూరుపేటలో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో పీర్లచావిడి సెంటర్లో మౌనప్రదర్శన జరిగింది. పట్టణమంతా ర్యాలీ చేసిన అనంతరం జేఏసీ నాయకులు మౌనప్రదర్శన చేశారు.
ఉప్పెనలా ఉద్యమం
Published Sun, Aug 11 2013 3:51 AM | Last Updated on Fri, Nov 9 2018 4:31 PM
Advertisement
Advertisement