ట్రక్కు డ్రైవర్ల ఆందోళన.. పెట్రోల్ బంక్‌లపై ఎగబడుతున్న జనం Truck Drivers Protest Across States Against Hit And Run Law | Sakshi
Sakshi News home page

ట్రక్కు డ్రైవర్ల ఆందోళన.. పెట్రోల్ బంక్‌లపై ఎగబడుతున్న జనం

Published Tue, Jan 2 2024 11:12 AM

Truck Drivers Protest Across States Against Hit And Run Law - Sakshi

ఢిల్లీ: హిట్ అండ్ రన్ కేసుల్లో కేంద్రం తీసుకువచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా రోడ్లపై రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలతో ఇంధన ట్రక్కులు దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. దీంతో ఇంధన కొరత ఏర్పడుతుందని జనం పెట్రోల్ బంక్‌లపై ఎగబడుతున్నారు.

థానే జిల్లాలోని మీరా భయాందర్ ప్రాంతంలో ముంబై-అహ్మదాబాద్ హైవేపై ట్రక్కు డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులపై రాళ్లు రువ్వారు. రాళ్లదాడితో పోలీసు వాహనం ధ్వంసమైంది. షోలాపూర్, కొల్హాపూర్, నాగ్‌పూర్, గోండియా జిల్లాల్లో కూడా రోడ్లు దిగ్బంధించారు. 

ఛత్తీస్‌గఢ్‌లోనూ నిరసనలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,000 మందికి పైగా ప్రైవేట్ బస్సు డ్రైవర్లు సమ్మెను ప్రకటించారు. రాయ్‌పూర్, బిలాస్‌పూర్, దుర్గ్, రాజ్‌నంద్‌గావ్‌లోని బస్ స్టేషన్‌లలో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. ఆందోళనలు రాబోయే రోజుల్లో ఇంధన సరఫరాకు ఆటంకం కలిగిస్తాయని భయపడి ప్రజలు వివిధ నగరాల్లోని పెట్రోల్ పంపుల వద్ద క్యూ కట్టారు. అటు.. పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌లోనూ డ్రైవర్ల ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. 

భారతీయ శిక్షా స్మృతి స్థానంలో కేంద్రం ఇటీవల భారత న్యాయ సంహితను తీసుకొచ్చింది. ఇందులో హిట్‌ అండ్ రన్ కేసుల్లో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాదాలకు కారణమైన ట్రక్కు డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించాలి. లేదంటే పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.7 లక్షల జరిమానా విధించే అవకాశాన్ని కల్పించారు. దీంతో ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఈ కఠిన నిబంధనలకు భయపడి కొత్తవారు ఈ వృత్తిలోకి రావడంలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్‌ ధర.. ఎంతంటే..

Advertisement
 
Advertisement
 
Advertisement