మడకశిర, న్యూస్‌లైన్ : రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డికి సమైక్య సెగ బలంగా తాకింది. తల్లి నరసమ్మ మరణం తర్వాత ఆదివారం స్వగృహంలో పూజలు చేయడానికి మండలంలోని నీలకంఠాపురానికి వచ్చిన మంత్రిని సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు, ఉద్యమకారులు నిలదీశారు.
మంత్రి ఇంటిని ముట్టడించి.. రాజీనామా కోసం డిమాండ్ చేయడానికి ఉదయమే జేఏసీ నాయకులు, సమైక్యవాదులు మడకశిర నుంచి బయలుదేరారు. వారిని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. అయితే.. వారు రోడ్లపైనే బైఠాయించి మంత్రికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినదించడంతో పోలీసులు వదలిపెట్టక తప్పలేదు. దీంతో వారు నీలకంఠాపురంలోని మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లకుండా పోలీసులు బయట గేటు వద్దే అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
అయితే వారు మంత్రి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఇంటి ఆవరణలోకి దూసుకెళ్లారు. మంత్రిని చుట్టుముట్టారు. అక్కడే బైఠాయించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు హోరెత్తించారు. ‘ఆగస్ట్ 3న ఇంటిని ముట్టడించినప్పుడు తల్లి పెద్దకర్మ అనంతరం 4వ తేదీన సమైక్యాంధ్రపై మాట్లాడతానని చెప్పారు. తర్వాత ఆ ఊసేలేదు. 54 రోజుల నుంచి ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా ఎందుకు సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడంలేద’ని నిలదీశారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే సుధాకర్ అక్కడే భోజనం వడ్డించడానికి వెళ్లగా ఉద్యమకారులు వారినీ వదలలేదు. ‘భోజనం చేయండి... తర్వాత మాట్లాడతా’నని మంత్రి చెప్పినా వారు వినిపించుకోలేదు.
‘భోజనం వద్దు... సమైక్యాంధ్ర కావాల’ంటూ నినదించారు. ‘రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర విద్యార్థులు, ప్రజలకు అన్యాయం జరగకూడదని మేము జీతాలు వదలుకుని ఉద్యమిస్తున్నాం. మీరు మాత్రం పదవులను ఎందుకు వదలుకోవడం లేద’ని నిలదీశారు. మంత్రి స్పందిస్తూ రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చివరి క్షణం వరకు పోరాడతామన్నారు. ‘మీ ఉద్యమాలు మీరు చేయండి. మా ప్రయత్నం మేము చేస్తాం. కాంగ్రెస్‌తో పాటు అన్ని పార్టీల తప్పిదం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. లేఖలు ఇచ్చిన పార్టీలు పునరాలోచన చేయాలి. సీమాంధ్రలో ఏ జిల్లాలోనూ లేనివిధంగా అనంతపురంలో 30 లక్షల మందికిపైగా ఉద్యమకారులు రోడ్లెక్కుతున్నారు. ఇప్పుడు మనరాష్ట్రం దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంది. విభజన జరిగితే ఢిల్లీలో సీమాంధ్రులను పట్టించుకునేవారు ఉండరు. ఈ ఉద్యమం దేశచరిత్రలో నిలిచిపోతుంద’ని అన్నారు. విభజనకు సంబంధించిన నోటు త్వరలోనే అసెంబ్లీకి వస్తుందని, తీర్మానం వీగిపోవాలంటే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పదవుల్లోనే ఉండాలని అభిప్రాయపడ్డారు. బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడితే సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు అడ్డుకుంటారని తెలిపారు. ‘జై సమైక్యాంధ్ర’ అనాలని జేఏసీ నాయకులు ఎంత డిమాండ్ చేసినా, వేడుకున్నా మంత్రి మాత్రం ఆ మాట అనలేదు. దీంతో వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
రఘవీరాకు సమైక్య సెగ
Published Mon, Sep 23 2013 3:24 AM | Last Updated on Wed, Aug 29 2018 5:50 PM
Advertisement
Advertisement