దుర్ముఖి నామ సంవత్సరం శుభప్రదం కావాలి
రాష్ట్రస్థాయి ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి
విజయవాడ : దుర్ముఖి నామ సంవత్సరం నుంచి రాష్ట్రానికి శుక్ర మహాదశ పట్టాలని తాను భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రుడు పరిపాలనలో ఆరితేరినవాడని చెప్పారు. నగరంలోని గురునానక్ కాలనీలో శుక్రవారం జరిగిన దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఈ వేడుకలకు 13 జిల్లాల నుంచి వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. సాంస్కృతిక శాఖ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. వ్యవసాయ, ఉద్యానవన, భక్తి టీవీ పంచాంగాలను, ప్రకృతి వ్యవసాయ పితామహుడు శుబాష్ పాలేకర్ పంపిన సీడీని సీఎం ఆవిష్కరించారు. ప్రారంభోపన్యాసంలో చంద్రబాబు మాట్లాడుతూ దుర్ముఖి నామ సంవత్సరం తెలుగు ప్రజల జీవితాల్లో శుభప్రదమైన మార్పులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 23 మంది వివిధ రంగాల ప్రముఖులకు కళారత్న (హంస) పురస్కారాలు అందించారు. ఈ పురస్కారంలో భాగంగా రూ.50 వేల నగదు, జ్ఞాపిక అందజేశారు. మరో 53 మందికి ఉగాది పురస్కారం అందించారు. వీరికి రూ.10 వేల నగదుతో పాటు శాలువాతో సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. పంచాంగ పఠనాన్ని శ్రీనివాస గార్గేయ, దీక్షితులు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆరుగురు వేద పండితులను సత్కరించారు. ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ వీరయ్య, డాక్టర్ రామచంద్రరావు, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ ప్రతిమ, డాక్టర్ మోషేలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా గాయత్రి, మురళీకృష్ణ వ్యవహరించారు. రాష్ట్ర మంత్రులు పైడిపాముల కొండలరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాస్, ఎంపీలు కేశినేని శ్రీనివాస్, గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహనరావు, తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్ వై.వి.అనురాధ తదితరులు పాల్గొన్నారు.