సాక్షి, విజయవాడ: ‘‘దేశంలోనే సీనియర్ నాయకుడిని నేనే. నా తరువాతే అందరూ ముఖ్యమంత్రులయ్యారు. అలాంటి 29 సార్లు అడిగినా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదా?’అని మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆదివారం విజయవాడలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన మాట్లాడుతూ బీజేపీపై నిప్పులుచెరిగారు.
‘‘నాలుగేళ్లు ఓపికగా తిరిగాను. 29 సార్లు అడిగాను. కానీ కేంద్రం ఏమాత్రం లక్ష్యపెట్టలేదు. చివరాఖరి బడ్జెట్ చూసిన తర్వాత ఇక భరించలేకపోయాను. అందుకే గళం విప్పాను. బీజేపీని నమ్ముకుంటే మోసం చేశారు. ఇప్పుడు వాళ్లే యుద్ధం చేస్తామంటున్నారు. రాష్ట్రంలో లేనిపోని సమస్యలు సృష్టించే దిశలో బీజేపీ ప్రవర్తిస్తోంది. నాలుగు సంవత్సరాలు మాతో స్నేహంగా ఉండి.. ఒక్కసారే విమర్శలు చేస్తున్నారు.
తెలుగువారు ఆత్మగౌరవం చంపుకొని ఉండలేరని ప్రధానమంత్రి మోదీతో చెబితే.. ఆయన పార్లమెంటులో ఎగతాళిగా మాట్లాడారు. దేశ సైన్యానికి ఖర్చుచేసే డబ్బులు కూడా అడుగుతారా అని జెట్లీ ఎద్దేవా చేశారు..’’ అంటూ ఆవేదనచెందారు చంద్రబాబు.
ప్యాకేజీ వద్దు హోదానే కావాలి: పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన హక్కు ప్రత్యేక హోదా అని, దాన్ని సాధించేదాకా తెలుగుజాతి విశ్రమించొద్దని ముఖ్యమంత్రి అన్నారు. హక్కుల పోరాటంలో కళాకారులు, విద్యార్దులు ముందుకు రావాలని కోరారు. హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామని కేంద్రం అంటోదని, ఆ ప్యాకేజీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోనని, ప్రత్యేక హోదా మాత్రమే ఏపీకి కావాలని స్పష్టంచేశారాయన.
Comments
Please login to add a commentAdd a comment