మహాబూబ్నగర్ జిల్లాలో కొత్తకోట మండల పాలెం వద్ద బస్సు అగ్నికి ఆహుతి అయిన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్పై కొరడా ఝుళిపించారు. ఈ నేపథ్యంలో ఆర్టీఏ అధికారుల మంగళవారం కూడా ప్రైవేట్ ట్రావెల్స్ పై దాడులు నిర్వహించారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 32 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన ప్రైవేట్ బస్సులన్ని నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నాయని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు.
అయితే నల్గొండ జిల్లాలో అత్యధికంగా 16 బస్సులను సీజ్ చేసినట్లు తెలిపారు. రంగరెడ్డి జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో 5, ఖమ్మం జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 2 బస్సులను సీజ్ చేసినట్లు వివరించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నడుపుతూ, అమాయక ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్న ప్రైవేట్ బస్సులపై దాడులు కొనసాగుతాయని ఆర్టీఏ అధికారులు మంగళవారం స్పష్టం చేశారు.